- చెన్నై చేరుకున్న ఉప రాష్ట్రపతి
చెన్నై: భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు బుధవారం చెన్నై చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో నగరానికి విచ్చేసిన ఆయనకు విమానాశ్రయంలో రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవి, రాష్ట్ర పర్యావరణ, వాతావరణ మార్పుల విభాగం, యువజన సంక్షేమం, క్రీడలశాఖ మంత్రి ఎస్వీ మెయ్యనాధన్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇరై అన్బు, డీజీపీ సి.శైలేంద్రబాబు, చెన్నై ఓటీఏ కమాండెంట్ మాణిక్ కుమార్దాస్ తదితరులు సాదర స్వాగతం పలికారు. ఈ నెల 28న చెన్నైలో జరుగనున్న మాజీ ముఖ్యమంత్రి, దివంగత ఎం.కరుణానిధి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. అనంతరం ఈ నెల 29న తిరిగి ఢిల్లీ పయనమైవెళ్తారని ఉపరాష్ట్రపతి కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ముమ్మరంగా కరుణ విగ్రహ ఏర్పాటు పనులు స్థానిక ఓమండూరార్ ప్రభుత్వ ఎస్టేట్ ప్రాంతంలో దివంగత మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి విగ్రహాన్ని ఏర్పాటుచేసే పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ కాంస్య విగ్రహాన్ని మీంజూరులోని శిల్పాలయంలో ప్రముఖ శిల్పి దీనదయాళన్ రూపొందించారు. రెండు టన్నుల బరువు, 16 అడుగుల ఎత్తున్న ఈ విగ్రహాన్ని 12 అడుగుల పీఠంపై అమర్చనున్నారు. మంగళవారం రాత్రి భారీ క్రేన్ సాయంతో ఆ విగ్రహాన్ని పీఠంపై అమర్చి శిల్పులు చివరి దశ పనులు పూర్తి చేశారు. గురువారం సాయంత్రానికల్లా ఈ విగ్రహ ఏర్పాట్లు పూర్తవుతాయని అధికారులు తెలిపారు. డీఎంకే ప్రధాన కార్యాలయమైన అన్నా అరివాలయంలో ఉన్నట్లే ఇక్కడి కరుణానిధి విగ్రహం కూడా అభివాదం చేస్తున్న భంగిమలో రూపొందించారు. ఈ విగ్రహాన్ని ఈ నెల 28 సాయంత్రం ముఖ్యమంత్రి స్టాలిన్ అధ్యక్షతన జరిగే ప్రత్యేక సభలో ఉప రాష్ట్రపతి ఆవిష్కరించనున్నారు.
ఇవి కూడా చదవండి