Abn logo
Sep 26 2021 @ 00:13AM

28 నుంచి ఏపీ అమెచ్యూర్‌ గోల్ఫ్‌ చాంపియన్‌షిప్‌ టోర్నీ

 విశాఖపట్నం (స్పోర్ట్సు), సెప్టెంబరు 25: ఈస్ట్‌ పాయింట్‌ గోల్ఫ్‌ క్లబ్‌ (ఈపీజీసీ) ఆధ్వర్యంలో ఈనెల 28 నుంచి అక్టోబరు ఒకటి వరకు ఆంధ్రప్రదేశ్‌ అమెచ్యూర్‌ గోల్ఫ్‌ చాంపియన్‌షిప్‌ టోర్నీ జరగనుంది. ఇండియన్‌ గోల్ఫ్‌ యూనియన్‌ (ఐజీయు) నిబంధనల ప్రకారం జరిగే ఈ టోర్నీలో దేశవ్యాప్తంగా 80 మంది క్రీడాకారులు  ప్రాతినిథ్యం వహించనున్నారు. కొవిడ్‌ కారణంగా ఇండియన్‌ గోల్ఫ్‌ యూనియన్‌  ఈ ఏడాది దేశవ్యాప్తంగా కేవలం ఆరు టోర్నీలకే పరిమతం చేయగా వాటిలో  కోల్‌కతా, ఢిల్లీ వంటి మెట్రో నగరాల్లోని గోల్ఫ్‌ క్లబ్‌లతోపాటు విశాఖలోని ఈస్ట్‌పాయింట్‌ గోల్ఫ్‌ క్లబ్‌కు అవకాశం రావడం విశేషం. అమెచ్యూర్‌ గోల్ఫ్‌ చాంపియన్‌షిప్‌ టోర్నీకి తొలిసారిగా ఆతిథ్యమిస్తున్న నేపథ్యంలో పోటీలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు ఈస్ట్‌ పాయింట్‌ గోల్ఫ్‌ క్లబ్‌ ప్రతినిధులు ఏర్పాట్లు చేస్తున్నారు. 1884లో స్థాపించిన  క్లబ్‌ దేశంలోని ప్రధాన మైదానాలలో ఒకటిగా గుర్తింపు పొందడమే కాకుండా ఆంధ్రప్రదేశ్‌లో 18 హోల్స్‌తో కూడిన ఏకైక క్లబ్‌గా ప్రత్యేకతను చాటుకున్నది. కాగా రాష్ట్రంలో గోల్ఫ్‌ క్రీడను ప్రోత్సహించడంతోపాటు పర్యాటక రంగాభివృద్ధికి చేస్తున్న కృషిలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌ అమెచ్యూర్‌ గోల్ఫ్‌ చాంపియన్‌షిప్‌ టోర్నీ నిర్వహిస్తున్నట్టు  ఈస్ట్‌ పాయింట్‌ గోల్ఫ్‌ క్లబ్‌ ప్రతినిధులు ప్రకటనలో పేర్కొన్నారు.