28గంటలు.. 10అంతస్తులు

ABN , First Publish Date - 2021-06-20T08:45:03+05:30 IST

వాళ్లను చూస్తుంటే కాలంతో పరుగెత్తుతున్నారా అనిపించింది.. అంత వేగంగా సిబ్బంది, కార్మికులు కలిసికట్టుగా కదులుతూ చకచకా పనులన్నీ చక్కబెట్టారు.. కేవలం 28 గంటల 45 నిమిషాల స్వల్ప వ్యవధిలోనే 10 అంతస్తుల భవంతిని కళ్లెదుట నిలబెట్టారు. అందరి నోటా వహ్వా అనిపించారు.

28గంటలు.. 10అంతస్తులు

ప్రీ ఫ్యాబ్రికేటెడ్‌ పరిజ్ఞానంతో శరవేగంగా భవన నిర్మాణం

చైనీయుల మరో రికార్డు

భూకంపాలను తట్టుకునే దృఢత్వం, 

వెయ్యేళ్ల జీవితకాలమే ప్రత్యేకతలు

అవసరమైతే అంతస్తులన్నీ విడగొట్టి..

వేరే చోటుకు తరలించే వెసులుబాటు

5 వంతులు తక్కువ బడ్జెట్‌లోనే..


బీజింగ్‌, జూన్‌ 19: వాళ్లను చూస్తుంటే కాలంతో పరుగెత్తుతున్నారా అనిపించింది.. అంత వేగంగా సిబ్బంది, కార్మికులు కలిసికట్టుగా కదులుతూ చకచకా పనులన్నీ చక్కబెట్టారు.. కేవలం 28 గంటల 45 నిమిషాల స్వల్ప వ్యవధిలోనే 10 అంతస్తుల భవంతిని కళ్లెదుట నిలబెట్టారు. అందరి నోటా వహ్వా అనిపించారు. నిర్మాణరంగంలో కొత్త పోకడలకు చిరునామాగా నిలిచే చైనాకు చెందిన స్థిరాస్తి కంపెనీ ‘బ్రాడ్‌ గ్రూప్‌’ ఈ సరికొత్త రికార్డును లిఖించింది. ఈ నిర్మాణ పనుల వీడియోను బ్రాడ్‌ గ్రూప్‌ యూట్యూబ్‌లో షేర్‌ చేయగా వైరల్‌గా మారింది.


ఇంతవేగంగా భవనాన్ని నిర్మించేందుకు ప్రీ ఫ్యాబ్రికేటెడ్‌ నిర్మాణ పరిజ్ఞానాన్ని వినియోగించారు. భవనంలో ఉండాల్సిన గదులు, ఇతరత్రా వసతుల మాడ్యూల్‌లను ముందస్తుగా ఫ్యాక్టరీల్లో తయారు చేయించి ట్రక్కుల్లో సైట్‌కు తెప్పించుకొని.. నేరుగా ఎక్కడికక్కడ నట్లు, బోల్టులతో బిగించారు. దీంతో ఎంతో సమయం ఆదా అయిం ది. ఒక్కో మాడ్యూల్‌ను స్టెయిన్‌ లెస్‌ స్టీల్‌తో.. 12 మీటర్ల పొడవు, 2.44 మీటర్ల వెడల్పు, 3 మీటర్ల ఎత్తుతో రూపుదిద్దారు. నిర్మాణ పనుల్లో వెయ్యి మందికిపైగా వివిధ విభాగాల సిబ్బంది పాల్గొనగా, 3 భారీ క్రేన్లను వినియోగించారు. భూకంపాలను తట్టుకొని నిలబడేంత దృఢంగా దీన్ని నిర్మించామని, ఈ భవంతి జీవితకాలం వెయ్యేళ్లని బ్రాడ్‌ గ్రూప్‌ తెలిపింది.


అవసరమైతే ఈ భవనాన్ని ఏ అంతస్తుకు ఆ అంతస్తుగా విడగొట్టి వాహనాల్లో తరలించి, మరో ప్రదేశంలో ఏర్పాటు చేసుకునే సౌలభ్యమూ ఉంటుందని పేర్కొంది. ఇన్ని వెసులుబాట్ల దృష్ట్యా దీన్ని ‘లివింగ్‌ బిల్డింగ్‌’ గా పిలుస్తున్నట్లు కంపెనీ వివరించింది. ఇం దులో విద్యుత్‌ వినియోగ ఆదా 20ు మేర పెరుగుతుందని, సాధారణ భవనాల నిర్మాణానికి అయ్యే ఖర్చు కంటే ఐదు వంతులు తక్కువ బడ్జెట్‌లోనే పది అంతస్తులను కట్టామని పేర్కొంది. 



Updated Date - 2021-06-20T08:45:03+05:30 IST