28 ఈకేవైసీ పూర్తి

ABN , First Publish Date - 2022-05-23T05:30:00+05:30 IST

రైతులను అందించే సాయం అనర్హులకు కూడా అందుతోందన్న ఫిర్యాదులతో కేంద్రం అప్రమత్తమైంది.

28 ఈకేవైసీ పూర్తి


  • నవాబుపేట మండలంలో అత్యధికంగా..
  • బషీరాబాద్‌ మండలంలో అత్యల్పంగా నమోదు
  • సకాలంలో పూర్తి చేస్తేనే ఖాతాల్లో కిసాన్‌ సమ్మాన్‌ నిధి యోజన సాయం జమ
  • లేకపోతే కేంద్ర ప్రభుత్వ సాయానికి దూరం

రైతులను అందించే సాయం  అనర్హులకు కూడా అందుతోందన్న ఫిర్యాదులతో కేంద్రం అప్రమత్తమైంది. లబ్ధ్దిదారులు విధిగా ఈకేవైసీ ప్రక్రియ పూర్తి చేయాలన్న నిబంధన విధించింది.  అయితే జిల్లాలో సగానికి సగం మంది లబ్ధ్దిదారులు కూడా ఈకేవైసీ పూర్తి చేయలేదు.  ఈ నెలాఖరు లోగా ఈ ప్రక్రియను పూర్తి చేస్తేనే  రైతుల ఖాతాల్లో రూ.6 వేల కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సాయం జమ  కానుంది. 

వికారాబాద్‌, మే23 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): కేంద్ర ప్రభుత్వం రైతులకు అందించే ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి ( పీఎంకేఎ్‌సఎన్‌) సాయం పొందడానికి తప్పని సరిగా ఈ- కేవైసీ చేయించాల్సి ఉండగా, జిల్లాలో సగానికి సగం మంది లబ్ధ్దిదారులు కూడా ఆ ప్రక్రియ పూర్తి చేయలేదు. పీఎంకేఎ్‌సఎన్‌ పథకం కింద రైతుల ఖాతాల్లో రూ.6 వేల కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సాయం జమ కావాలంటే తప్పనిసరిగా ఈ-కేవైసీ (ఎలక్ర్టానిక్‌- నోయువర్‌ కస్టమర్‌) ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం అందించే సాయం కొందరు  అనర్హులకు కూడా అందుతోందన్న ఫిర్యాదులతో అప్రమత్తమై... లబ్ధ్దిదారులు విధిగా ఈ-కేవైసీ ప్రక్రియ పూర్తి చేయాలన్న నిబంధన విధించారు. కొంత మంది లబ్ధ్దిదారులు ఆధార్‌ లింక్‌ చేసినా బ్యాంకు ఖాతాలకు తమ మొబైల్‌ నెంబర్లు అనుసంధానం చేసుకోలేదు. మరణించిన లబ్ధ్దిదారులకు సాయం అందకుండా నిలిపివేయాల్సి ఉండగా ఆ విధంగా చర్యలు తీసుకోకపోవడంతో అనర్హులకు కూడా పీఎంకేఎ్‌సఎన్‌ సాయం అందుతోంది. అనర్హులకు కాకుండా అర్హులకే ప్రధాన మంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధులు అందించేందుకు ఈ -కేవైసీ తప్పనిసరి చేశారు. పీఎం కిసాన్‌ పోర్టల్‌, పీఎం కిసాన్‌ యాప్‌ల్లో నేరుగా లబ్ధ్దిదారులే తమ స్మార్ట్‌ఫోన్ల ద్వారా ఓటీపీ సాయంతో వివరాలు పొందుపరిచే అవకాశం కల్పించారు. ఈ సదుపాయం లేనివారు కామన్‌ సర్వీస్‌ సెంటర్లు, మీసేవా కేంద్రాల్లో బయోమెట్రిక్‌ ద్వారా అనుసంధానం చేసుకునే అవకాశం కల్పించారు. పీఎంకేఎ్‌సఎన్‌ కోసం ఈనెల 31వ తేదీ వరకు ఈ-కేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకునేలా గడువు విధించారు. 

ఈకేవైసీ పూర్తి చేయకపోతే సాయానికి దూరం

గ్రామీణ ప్రాంత రైతులకు ఈ-కేవైసీపై అవగాహన కల్పించేందుకు వ్యవసాయ శాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. కొందరు లబ్ధిదారులు సీఎస్సీ, మీ సేవా కేంద్రాల్లో ఈ- కేవైసీ పూర్తి చేసుకుంటుండగా ఈ ప్రక్రియ పూర్తి చేసుకోని రైతులకు రైతు వేదికల్లో పూర్తి చేసుకునే ఏర్పాట్లు అధికారులు చేశారు. వారం రోజుల్లోగా ఈ-కేవైసీ పూర్తి చేసుకోకపోతే లబ్ధిదారులు ఏటా మూడు విడతల్లో కేంద్ర ప్రభుత్వం అందించే రూ.6వేల ఆర్థిక సాయం దక్కకుండా పోయే అవకాశం ఉంది. 

సగానికి సగమే ..

జిల్లాలోని 18 మండలాల్లో ఆధార్‌ అనుసంధానమైన లబ్ధిదారులు మొత్తం 1,40,677 మంది ఉన్నారు. వీరిలో ఇప్పటి వరకు 39,156 మంది మాత్రమే తమ ఖాతాల ఈ-కేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకున్నారు. ఇంకా 1,01,521 మంది లబ్దిదారులు ఈ ప్రక్రియ పూర్తి చేసుకోవాల్సి ఉంది. జిల్లాలో ఇంత వరకు 28 శాతం మంది రైతులు మాత్రమే ఈ ప్రక్రియ పూర్తి చేసుకోగా, 72 శాతం లబ్ధిదారులు ఇంకా చేసుకోవాల్సి ఉంది. జిల్లాలో ఈ-కేవైసీ ప్రక్రియ అధిక సంఖ్యలో లబ్ధిదారులు పూర్తి చేయడంలో 38 శాతం ప్రగతితో నవాబుపేట మండలం మొదటి స్థానంలో నిలువగా, 11 శాతం ప్రగతితో బషీరాబాద్‌ మండలం చివరి స్థానంలో ఉంది. 

సెల్‌ఫోన్‌లోనూ అవకాశం ..

పీఎంకేఎ్‌సఎన్‌ లబ్ధిదారులకు తమ సెల్‌ఫోన్లలోనూ ఈ-కేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకునే అవకాశం కల్పించారు. పీఎం కిసాన్‌ వెబ్‌ పోర్టల్‌లో లబ్ధిదారులు ఫార్మర్‌ కార్నర్‌లో సూచించిన ఈ-కేవైసీ ఆప్షన్‌పైన క్లిక్‌ చేయాలి. ఆధార్‌, ఫోన్‌ నెంబర్‌కు వచ్చిన వన్‌ టైం పాస్‌వర్డ్‌ (ఓటీపీ) నమోదు చేసిన తరువాత ఈ-కేవైసీ సక్సెస్‌ అని స్ర్కీన్‌పై డిస్‌ప్లే కావాలి. లేనిపక్షంలో ఆ ప్రక్రియ పూర్తికాలేదని గుర్తించాలి. ఆధార్‌, ఫోన్‌ నంబర్‌ అనుసంధానం చేయని లబ్ధిదారులు మాత్రం సీఎస్సీ, మీ - సేవా కేంద్రాల్లో బయోమెట్రిక్‌ ద్వారా నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. 

ఆధార్‌ అనుసంధానం చేసుకున్న లబ్ధ్దిదారులు 1,40,677

ఈకేవైసీ పూర్తి చేసిన వారు 39,156

మిగిలిన లబ్ధ్దిదారులు1,01,521

గడువు మే 31

మండలం       మొత్తం మంది       ఈకేవైసీ

        రైతులు           చేసుకున్నవారు

నవాబుపేట 8,815 3,426

బంట్వారం 4,238 1,438

బషీరాబాద్‌ 8,270 939

 బొంరా్‌సపేట్‌ 10,470 7,395

ధారూరు 7,586 1,454

దోమ 8,262 2,976

దౌల్తాబాద్‌ 10,578 5,074

కొడంగల్‌ 10,036 3,141

కులకచర్ల 9,336 1,783

మర్పల్లి 8,815 2,166

మోమిన్‌పేట 7,338 1,633

పరిగి 9,171 2,074

పెద్దేముల్‌ 8,059 2,978

పూడూరు 8,075 1,250

తాండూరు 7,628 2,097

వికారాబాద్‌ 6,611 1,459

యాలాల్‌ 7,000 2,096

కోట్‌పల్లి 389         97

Updated Date - 2022-05-23T05:30:00+05:30 IST