గంటకు 28 సిజేరియన్లు!

ABN , First Publish Date - 2022-08-18T08:23:38+05:30 IST

రాష్ట్రంలో కడుపు కోతలకు అడ్డుకట్ట పడడం లేదు. అడ్డగోలుగా సిజేరియన్‌ కాన్పులు జరుగుతూనే ఉన్నాయి.

గంటకు 28 సిజేరియన్లు!

కడుపు ‘కోత’ల్లో దేశంలోనే అగ్రస్థానంలో తెలంగాణ

రాష్ట్రంలో 57 శాతం శస్త్రచికిత్స కాన్పులే.. ప్రైవేటు ఆస్పత్రుల్లోనే ఎక్కువ

కొందరు నొప్పులు భరించలేక, మరికొందరు ముహూర్తాలు చూసుకొని ఆపరేషన్లు

మహిళల్లో ఊబకాయం, మధుమేహం, రక్తపోటు వంటి సమస్యలూ కారణం

రెండు దశాబ్దాల క్రితం కోతలు 10-15 శాతమే!.. ప్రస్తుతం దానికి 4 రెట్లు అధికం

సిజేరియన్లు తగ్గించేందుకు సర్కారు చర్యలు.. ఏడాదిలో 2ు మేర తగ్గిన ఆపరేషన్లు


హైదరాబాద్‌, ఆగస్టు 17 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కడుపు కోతలకు అడ్డుకట్ట పడడం లేదు. అడ్డగోలుగా సిజేరియన్‌ కాన్పులు జరుగుతూనే ఉన్నాయి. ఎంతలా అంటే.. సగటున గంటకు 28 శస్త్రచికిత్స ప్రసవాలు జరుగుతున్నాయి! ప్రభుత్వ ఆస్పత్రుల్లో కాస్త తక్కువగా, ప్రైవేటులో ఎక్కువగా జరుగుతున్నాయి. వైద్య ఆరోగ్యశాఖ తాజా లెక్కల ప్రకారం రాష్ట్రంలో ప్రస్తుతం 57 శాతం సిజేరియన్లు జరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా కోతల కాన్పుల సగటు 21 శాతం ఉండగా, భారత్‌లో అది 22 శాతంగా ఉంది. ఇక 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా సిజేరియన్‌ ప్రసవాల శాతం 28.5కుపెరుగుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) చెబుతోంది. కానీ, రాష్ట్రంలో ఇప్పుడే దానికి రెట్టింపు స్థాయిలో సిజేరియన్లు జరుగుతుండడందోళన కలిగిస్తోంది. ఇక సిజేరియన్‌ ప్రసవాల్లో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో ఉంది. పొరుగు రాష్ట్రమైన ఏపీలో 40.1, మహారాష్ట్రలో 20.1, కర్ణాటకలో 23.6 శాతం శస్త్రచికిత్స కాన్పులు జరుగుతున్నాయి. మన రాష్ట్రంలో గత ఏడాది ఆగస్టులో ప్రభుత్వ ఆస్పత్రుల్లో 47.24 శాతం సిజేరియన్లు జరిగితే ప్రస్తుతం అది 45.92 శాతానికి తగ్గింది.


ఇక ప్రైవేటులో 80.98 శాతం జరిగితే ఇప్పుడది 78.86 శాతానికి తగ్గింది. అంటే మొత్తంగా రాష్ట్రంలో ఏడాదిలో రెండు శాతం మేర కోతలను తగ్గించగలిగారు. గత ఏడాది ఆగస్టులో సర్కారీ దవాఖానాల్లో సాధారణ కాన్పులు 54.7 శాతంగా ఉండగా, ప్రస్తుతం అది 66.8కి పెరిగింది. ఇదే సమయంలో ప్రైవేటు ఆస్పత్రుల్లో 45.3 నుంచి 33.2 శాతానికి తగ్గింది. రాష్ట్రవ్యాప్తం గా జూలైలో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో కలిపి మొత్తం 36,380 ప్రసవాలు జరిగాయి. ఇందులో 20,685 డెలివరీలు కోతలే కావడం గమనార్హం. అంటే 57 శాతం సిజేరియన్లు జరిగాయి. ఈ లెక్కన గంటకు 28 కడుపు కోతలు జరుగుతున్నాయి. రోజుకు 689 సిజేరియన్లు జరుగుతున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ గణాంకాలు చెబుతున్నాయి. ఇక దేశంలోనే కరీంనగర్‌ జిల్లా సిజేరియన్‌ డెలివరీల్లో అగ్రస్థానంలో ఉంది. అక్కడ దాదాపు 85 శాతానికిపైగా కోతలే జరుగుతున్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ప్రైవేటు ఆస్పత్రులు ప్రజల బలహీనతను సొమ్ము చేసుకుంటున్నాయి. కేసీఆర్‌ కిట్‌ వచ్చిన తర్వాత ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల శాతం పెరిగింది. సిజేరియన్ల శాతం తగ్గింది. అయితే చాలామంది దంపతులు మంచి రోజు,  టైం చూసుకొని ఆ టైంకే ప్రైవేటు ఆస్పత్రులకు తీసుకెళ్లి సిజేరియన్‌ చేయిస్తున్నారు.  కొందరు నొప్పులు భరించలేమన్న భయంతో సిజేరియన్లకు మొగ్గు చూపుతున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో అయితే ఇలా చేయరు. దీంతో ప్రజలు ప్రైవేటుకు క్యూ కట్టి మరీ కడుపు కోయించుకుంటున్నారు.


సాధారణ కాన్పుకు రూ.20 వేలైతే సిజేరియన్‌కు రూ.40-50 వేలు వసూలు చేస్తారు. అమెరికా లాంటి దేశంలో కూడా సిజేరియన్లు భారీగానే జరుగుతున్నాయి. అక్కడ ప్రస్తుతం 32.7 శాతం సీ సెక్షన్స్‌ జరుగుతున్నట్లు సీడీసీ తన నివేదికలో వెల్లడించింది. ఇక డబ్ల్యూహెచ్‌వో ప్రమాణాల మేరకు సీ సెక్షన్‌ ప్రసవాలు ప్రతి వందకు 10-15 శాతమే ఉండాలి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పుట్టే ప్రతి ఐదుగురిలో ఒకరు కడుపు కోతతోనే జన్మిస్తున్నట్లు డబ్ల్యూహెచ్‌వో వెల్లడించింది. 1990లో ప్రపంచవ్యాప్తంగా సిజేరియన్లు 7 శాతం ఉండగా, ప్రస్తుతం అది 21 శాతానికి చేరుకున్నట్లు డబ్ల్యూహెచ్‌వో గణాంకాలు చెబుతున్నాయి.  మన దేశంలో జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం ప్రస్తుతం 21.5 శాతం కోతలు జరుగుతున్నట్లు వెల్లడించింది. అత్యధికంగా తెలంగాణలో 60ు సిజేరియన్‌ కాన్పులు జరుగుతున్నట్లు సర్వేలో తేలింది.


సర్కారు తీసుకున్న చర్యలేంటంటే..

 వైద్య, ఆరోగ్య శాఖ మంత్రిగా హరీశ్‌రావు బాధ్యతలు తీసుకున్న తర్వాత సిజేరియన్లపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. కడుపు కోతలు ఎక్కువగా జరిగే కరీంనగర్‌ లాంటి జిల్లాల్లో ప్రైవేటు ఆస్పత్రుల గైనకాలజిస్టులతో భేటీ అయ్యారు. తప్పనిసరి అయితేనే సిజేరియన్‌ చేయాలని సూచించారు.  ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో శప్రతి సిజేరియన్‌ ఆపరేషన్‌పై ఆడిట్‌ను తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అనవసరంగా ఆపరేషన్లు చేసినట్లు తేలితే కఠిన చర్యలకు వెనకాడబోమని హెచ్చరించింది. జిల్లాల్లో కడుపు కోతలపై డీఎంహెచ్‌వో ఆధ్వర్యంలోని కమిటీ ఆస్పత్రుల్లో తనిఖీలు చేసే అధికారాన్ని కట్టబెట్టింది. వీటితోపాటు సర్కారులో సాధారణ

కాన్పులను పెంచేందుకు ఒక్కోదానికి రూ.3 వేలు ప్రోత్సాహకాన్ని ప్రకటించింది.


పెరుగుతున్న ఆరోగ్య సమస్యలు..

మహిళల్లో ప్రస్తుతం ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయని వైద్యనిపుణులు చెబుతున్నారు. 30 ఏళ్లకే మధుమేహం, థైరాయిడ్‌, ఊబకాయం, రక్తపోటు వంటి సమస్యలు పెరిగాయని అంటున్నారు. దాని వల్ల నార్మల్‌ డెలివరీలు చేసే పరిస్థితి ఉండడం లేదని పేర్కొంటున్నారు. వీటివల్ల కూడా సిజేరియన్‌ చేయాల్సి వస్తోందని ఓ కార్పొరేట్‌ ఆస్పత్రి గైనకాలజిస్టు అభిప్రాయపడ్డారు. 


ముహూర్తం చూసుకుంటున్నారు..    

శిశువుకు హార్ట్‌రేట్‌ పెరిగినప్పుడు, ఉమ్మనీరు చేరినప్పుడు, గర్భిణులకు ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నప్పుడే సిజేరియన్‌ చేయాల్సి ఉంటుంది. ఇటీవలి కాలంలో ఊబకాయం, థైరాయిడ్‌, బీపీ, మధుమేహ వ్యాధిగ్రస్థులు కూడా పెరిగారు. అలాంటి వారికి సహజ ప్రసవం సాధ్యం కాదనే చెప్పాలి. ఇక డెలివరీ ఫలానా వారంలో అవుతుందని చెప్పినప్పుడు గర్భిణుల కుటుంబ సభ్యులు ఆ వారంలో ఒక ముహూర్తం చూసుకుంటున్నారు. ఆ సమయానికి సిజేరియన్‌ చేయమని కోరుతున్నారు. 

 - డాక్టర్‌ షర్మిల, అపోలో ఆస్పత్రి, హైదరాబాద్‌

Updated Date - 2022-08-18T08:23:38+05:30 IST