Abn logo
Sep 21 2021 @ 13:01PM

27న జరిగే బంద్‌ను విజయవంతం చేయండి

- కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలపై పోరాడుతాం

- రైతు సంఘాల పిలుపు


బళ్లారి(కర్ణాటక): కేంద్ర ప్రభుత్వం కొత్తగా తెచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేసే వరకు పోరాడుతామని కర్ణాటక రాష్ట్ర రైతు సంఘం(హసిరిసేన) రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌.మాధవరెడ్డి పేర్కొన్నారు. సోమవారం సంయుక్త పోరాట-కర్ణాటక సంఘం ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు సంఘం నాయకులు మాట్లాడుతూ రైతులు పోరాటం చేస్తున్నా, కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందన్నారు. కేంద్ర ప్రభుత్వం కొత్తగా తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలు, విద్యుత్‌ రద్దు, వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మ ద్దతు ధర, వంటనూనె, పెట్రోల్‌, తదితర నిత్యావసర వస్తువు ధరల తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ దేశ వ్యాప్తంగా ఈ నెల 27న రైతు సంఘాలు పిలుపునిచ్చిన మేరకు బళ్లారి జిల్లాలో బంద్‌ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్‌ కంపెనీలకు అప్పగించేందుకు తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలు, నూతన విద్యుత్‌ విధానాలు రద్దు చేయాలని, రైతులు పండించిన పంటలకు కనీస మద్దతు ధర కల్పించాలనే తదితర డిమాండ్లతో దేశంలో 500లకు పైగా రైతు సం ఘాల ఆధ్వర్యంలో ‘భారత్‌ బంద్‌’ పిలుపునిచ్చినట్లు తెలిపారు. అందులో భాగంగానే బళ్లారిలో బంద్‌ నిర్వహిస్తున్నట్లు, నగర ప్రజలు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో భాగంగా ఈ నెల 25న నగర వ్యాప్తంగా సాయంత్రం కాగడ ప్రదర్శన, 26న బైక్‌ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతు సంఘాలు చేపడుతున్న ఈ బంద్‌ను విజయవంతం చేయాలని  కోరారు. సమావేశంలో కర్ణాటక రాష్ట్ర రైతు సంఘం(హసిరు సేన) జిల్లా కార్యదర్శి, కర్ణాటక ప్రాంత రైతు సంఘం జిల్లా అధ్యక్షులు శివశంకర్‌, సంగనకల్లు కృష్ణప్ప, జిల్లా ప్రముఖులు గోవింద్‌ పాల్గొన్నారు.