హైదరాబాద్‌లో మరో 26 మందికి కరోనా.. ఒకే ఇంట్లో ఏడుగురికి..

ABN , First Publish Date - 2020-05-22T15:53:03+05:30 IST

గ్రేటర్‌లో కరోనా విజృంభిస్తోంది. గురువారం మరో 26 మందికి వైరస్‌ సోకినట్లు అధికారులు ప్రకటించారు.

హైదరాబాద్‌లో మరో 26 మందికి కరోనా.. ఒకే ఇంట్లో ఏడుగురికి..

హైదరాబాద్‌ సిటీ (ఆంధ్రజ్యోతి): గ్రేటర్‌లో కరోనా విజృంభిస్తోంది. గురువారం మరో 26 మందికి వైరస్‌ సోకినట్లు అధికారులు ప్రకటించారు.  


ఒకే కుటుంబంలో ఏడుగురికి.. 

ఓల్డ్‌మలక్‌పేట శంకర్‌నగర్‌లో మసీదు కమిటీ మౌజంకు కరోనా పాజిటివ్‌ అని తేలగా అతడితో ప్రైమరీ కాంటాక్టులో ఉన్న 14 మందికి పరీక్షలు చేయగా ఏడుగురికి పాజిటివ్‌ అని తేలింది. వీరిలో అతడి భార్య, ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు అల్లుళ్లు ఉన్నారు. వీరందరినీ కింగ్‌కోఠి ప్రభుత్వ ఆస్పత్రి నుంచి గాంధీ ఆస్పత్రికి తరలించారు. 


ఈదీబజార్‌లో నలుగురికి.. 

సంతోష్‌నగర్‌ సర్కిల్‌-7 పరిధిలోని యాకుత్‌పుర ఈదీబజార్‌లోగల మౌలానా ఆజాద్‌నగర్‌లో నివసిస్తున్న 45 ఏళ్ల మహిళ కరోనాతో మృతి చెందింది. ఆమె కుటుంబంలోని 9 మందిని క్వారంటైన్‌ చేయగా అందులో నలుగురికి కరోనా పాజిటివ్‌ వచ్చింది.


ఓల్డ్‌మలక్‌పేటలో మహిళకు..

ఓల్డ్‌మలక్‌పేట వాటర్‌ట్యాంక్‌ ప్రాంతంలో నివసిస్తున్న 36 ఏళ్ల మహిళ కింగ్‌కోఠి ప్రభుత్వ ఆస్పత్రిలో పరీక్ష చేయించుకోగా కరోనా పాజిటివ్‌ అని తేలింది. ఆమె కుటుంబంలోని ఆరుగురిని ప్రైమరీ కాంటాక్టుగా గుర్తించి ఆస్పత్రికి తరలించారు.


పఠాన్‌బస్తీలో రిటైర్డ్‌ ఉద్యోగికి..

ముషీరాబాద్‌ పఠాన్‌బస్తీకి చెందిన రిటైర్డ్‌ ఉద్యోగి స్థానిక ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించుకోగా కరోనా పాజిటివ్‌ వచ్చింది. దీంతో అతడిని గాంధీ ఆస్పత్రికి తరలించినట్లు భోలక్‌ఫూర్‌ ప్రభుత్వ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్‌ కృష్ణమోహన్‌ తెలిపారు.  


మూసాపేట సర్కిల్‌లో ఐదు కరోనా కేసులు

మూసాపేట సర్కిల్‌ అల్లాపూర్‌ డివిజన్‌లోని రాణాప్రతాప్‌నగర్‌లో 60 ఏళ్ల మహిళకు, బబ్బుగూడలో 61 ఏళ్ల వృద్ధుడికి, కొత్తూరి సీతారామయ్యనగర్‌లో 32ఏళ్ల మహిళకు కరోనా పాజిటివ్‌ వచ్చింది. బాలాజీనగర్‌ డివిజన్‌లోని ఓ గేటెడ్‌ కమ్యూనిటీలో 50ఏళ్ల తండ్రి, 24 ఏళ్ల కుమారుడికి పాజిటివ్‌ వచ్చిందని సర్కిల్‌ వైద్యాధికారి డాక్టర్‌ సంపత్‌ తెలిపారు.

 

బడీగల్లీ ప్రాంతంలో వృద్ధురాలికి.. 

మంగళ్‌హాట్‌ బడీగల్లీ ప్రాంతంలో నివసిస్తున్న వృద్ధ్దురాలికి కరోనా పాజిటివ్‌ రాగా ఆమెను గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఎనిమిదిమంది కుటుంబసభ్యులను హోం క్వారంటైన్‌లో ఉంచినట్లు అధికారులు తెలిపారు.


సచివాలయనగర్‌ కాలనీలో.. 

వనస్థలిపురం సచివాలయనగర్‌ కాలనీలో నివసిస్తున్న వృద్ధురాలికి పాజిటివ్‌ వచ్చింది. ఆమె పది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతుండగా ఎల్‌బీనగర్‌ అవేర్‌ గ్లోబల్‌ ఆస్పత్రికి వైద్య పరీక్షల కోసం తీసుకెళ్లినట్లు కుటుంబసభ్యుల ద్వారా తెలిసింది. ఆమెకు ఐదుగురు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. వైద్య పరీక్షలు అందించే సమయంలో వనస్థలిపురంలో ఉంటున్న ఇద్దరు కుమార్తెలతోపాటు మెహిదీపట్నానికి చెందిన మరో కూతురు, కుమారుడు సహాయకులుగా ఉన్నారు.


కరోనా లక్షణాలుంటే ఐసోలేషన్‌ వార్డుకు

కరోనా లక్షణాలుంటే వారిని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఐసోలేషన్‌ వార్డుకు తరలిస్తున్నారు. గురువారం నల్లకుంట ఫీవర్‌ ఆస్పత్రిలో 15 కరోనా అనుమానిత కేసులు నమోదయ్యాయి. ఎస్‌ఆర్‌నగర్‌, మాదన్నపేటతోపాటు పలు ప్రాంతాలకు చెందిన వారు జ్వరంతో బాధపడుతుండడంతో అంబులెన్స్‌లో ఫీవర్‌ ఆస్పత్రికి తరలించారు. వీరిని ఐసోలేషన్‌ వార్డులో ఉంచి రక్త నమూనాలను సేకరించి ల్యాబ్‌కు పంపించారు. బాగ్‌లింగంపల్లి ఈడబ్ల్యూఎస్‌ క్వార్టర్స్‌లో కరోనా పాజిటివ్‌ వచ్చిన మహిళ ఇంటి సభ్యులు ముగ్గురిని అధికారులు పరీక్షల నిమిత్తం నేచర్‌క్యూర్‌ ఆస్పత్రికి గురువారం తరలించారు. మెహిదీపట్నం సరోజినీదేవి ఆస్పత్రి ఐసోలేషన్‌ వార్డులో చాంద్రాయణగుట్ట, జియాగూడ, బండ్లగూడ, కార్వాన్‌ ప్రాంతాలకు చెందిన 24 మంది ఉన్నారు.


ఛాతీ వ్యాధుల ఆస్పత్రి ఓపీకి గురువారం పదిమంది రాగా వారిలో నలుగురు అడ్మిట్‌ అయ్యారు. ప్రస్తుతం ఆస్పత్రిలో ఐదుగురు అనుమానితులకు చికిత్స అందిస్తున్నట్లు సూపరింటెండెంట్‌ డాక్టర్‌ మహబూబ్‌ఖాన్‌ తెలిపారు. నెగెటివ్‌ వచ్చిన తొమ్మిది మందిని డిశ్చార్జి చేశామన్నారు. ముషీరాబాద్‌ పఠాన్‌బస్తీలో రిటైర్డ్‌ ఉద్యోగికి కరోనా పాటిజివ్‌ రాగా, అతడు నివసించే అపార్ట్‌మెంట్‌లో మరో నలుగురు జ్వరంతో బాధపడుతుండడంతో కింగ్‌కోఠి ఆస్పత్రికి తరలించారు. ఆ ప్రాంతంలోకి ఎవరినీ వెళ్లనీయకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు. భోలక్‌పూర్‌ కట్టడి ప్రాంతంలో ఉన్న వారికి వైద్య సిబ్బంది పరీక్షలు నిర్వహించి ఆరోగ్య పరిస్థితిని పరిశీలించారు. రామంతాపూర్‌ కరోనా ప్రీ ప్రాంతంగా మారింది. శ్రీరమణపురంలో కట్టడిని నాలుగు రోజుల క్రితం తొలగించిన అధికారులు పాశం సత్తయ్య కాలనీ, నవరంగ్‌గూడలలో కట్టడిని గురువారం తొలగించారు. కరోనా వైరస్‌ సోకిన వారితోపాటు ప్రైమరీ కాంటాక్టులందరికీ నెగెటివ్‌ రావడం, క్వారంటైన్‌ గడువు ముగియడంతో కట్టడిని తొలగించినట్లు నోడల్‌ అధికారి నాగమణి తెలిపారు. కట్టడి ప్రాంతాల్లో సేవలు అందించిన వైద్య, పోలీసులు, జీహెచ్‌ఎంసీ సిబ్బందిని పలువురు అభినందించారు.

Updated Date - 2020-05-22T15:53:03+05:30 IST