మహారాష్ట్రలో భారీ ఎన్‌కౌంటర్... 26 మంది మావోల హతం

ABN , First Publish Date - 2021-11-14T01:32:01+05:30 IST

మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో శనివారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో

మహారాష్ట్రలో భారీ ఎన్‌కౌంటర్... 26 మంది మావోల హతం

ముంబై : మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో శనివారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో 26 మంది మావోయిస్టులు మరణించారు. గారపట్టి పోలీస్ స్టేషన్ పరిధిలోని మర్డింటొల అడవిలో ఈ సంఘటన జరిగినట్లు పోలీస్ కంట్రోల్ రూమ్ అధికారులు తెలిపారు. నాగపూర్ నుంచి 250 కిలోమీటర్ల దూరంలో, ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో ఈ సంఘటన జరిగినట్లు చెప్పారు. 


గడ్చిరోలి జిల్లాకు చెందిన యాంటీ మావోయిస్టు స్క్వాడ్‌కు చెందిన సీ-60 ఫోర్స్ జవాన్లు అదనపు ఎస్పీ సౌమ్య ముండే నేతృత్వంలో గస్తీ విధులు నిర్వహిస్తుండగా మావోయిస్టులు కాల్పులు జరిపారని, వెంటనే జవాన్లు ప్రతిస్పందించారని తెలిపారు. 


గడ్చిరోలి జిల్లా పోలీసు సూపరింటెండెంట్ అంకిత్ గోయల్ మాట్లాడుతూ, సంఘటన స్థలానికి అదనపు పోలీసు బలగాలను పంపించినట్లు తెలిపారు. ఈ ఎన్‌కౌంటర్‌లో 26 మంది మావోయిస్టులు మరణించారని,  మర్డింటొల అడవిలో గాలింపు జరుపుతున్నామని తెలిపారు. మృతదేహాలను గడ్చిరోలి తరలించి, పోస్ట్‌మార్టంకు పంపిస్తామని తెలిపారు. సంఘటన స్థలం నుంచి పెద్ద ఎత్తున ఆయుధాలు, మందుగుండు సామగ్రిలను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఈ ఎన్‌కౌంటర్లో నలుగురు పోలీసు సిబ్బంది తీవ్రంగా గాయపడినట్లు తెలిపారు. చికిత్స కోసం వీరిని హెలికాప్టర్ ద్వారా నాగపూర్ తరలించినట్లు చెప్పారు. 


ఈ ఎన్‌కౌంటర్ మృతుల్లో టాప్‌మోస్ట్ మావోయిస్ట్ కమాండర్, సెంట్రల్ కమిటీ మెంబర్ దిలీప్ టెల్టుంబ్డే కూడా ఉన్నట్లు సమాచారం. 


Updated Date - 2021-11-14T01:32:01+05:30 IST