2,500 మంది సమాజ్‌వాదీ పార్టీ కార్యకర్తలపై ఎఫ్ఐఆర్

ABN , First Publish Date - 2022-01-15T01:32:40+05:30 IST

ఉత్తరప్రదేశ్‌లోని సమాజ్ వాదీ పార్టీ (ఎస్‌పీ) నేతలు, కార్యకర్తలు 2,500 మందిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

2,500 మంది సమాజ్‌వాదీ పార్టీ కార్యకర్తలపై ఎఫ్ఐఆర్

లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని సమాజ్ వాదీ పార్టీ (ఎస్‌పీ) నేతలు, కార్యకర్తలు 2,500 మందిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఎస్‌పీ చీఫ్, మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్, బీజేపీ మాజీ నేత స్వామి ప్రసాద్ మౌర్య నిర్వహించిన ‘వర్చువల్ ర్యాలీ’ కి వీరంతా భౌతికంగా హాజరై కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించారన్న అభియోగాలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. 


ఎపిడమిక్ డిసీజెస్ యాక్ట్ ప్రకారం వివిధ సెక్షన్ల కింద వీరిపై కేసులు నమోదు చేసినట్టు లక్నో పోలీస్ కమిషనర్ డీకే ఠాకూర్ తెలిపారు. ఇందుకు సంబంధించి వీడియో ఆధారం లభించిన తర్వాతే వీరిపై కేసులు నమోదు చేసినట్టు చెప్పారు.


పోలీసులు సేకరించిన ఆ వీడియో ఫుటేజీలో సమాజ్‌వాదీ పార్టీ కార్యాలయం ఎదుట పెద్ద  సంఖ్యలో గుమిగూడిన కార్యకర్తలను పోలీసులు చెదరగొడుతున్నట్టుగా ఉంది. ఎస్‌పీ కార్యాలయం ఎదుట కొవిడ్ నిబంధనలను ఉల్లంఘించి పెద్ద ఎత్తున గుమిగూడినట్టు తమకు సోషల్ మీడియా ద్వారా సమాచారం అందినట్టు వివరించారు.


ఎలాంటి ముందస్తు అనుమతులు లేకుండానే సమాజ్‌వాదీ పార్టీ వర్చువల్ ర్యాలీ నిర్వహించినట్టు లక్నో జిల్లా మేజిస్ట్రేట్ అభిషేక్ ప్రకాశ్ తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసు బృందాన్ని, మేజిస్ట్రేట్‌ను ఎస్‌పీ కార్యాలయానికి పంపామని, వారిచ్చిన నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని అభిషేక్ ప్రకాశ్ తెలిపారు. 

Updated Date - 2022-01-15T01:32:40+05:30 IST