బెడ్డుకు 25 వేలు

ABN , First Publish Date - 2021-05-10T09:10:18+05:30 IST

కరోనా బాధితులకు సేవల ముసుగులో విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో వసూళ్ల దందా మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది. ఇక్కడ రోజుల తరబడి పడిగాపులు కాస్తున్నా బాధితులు బెడ్‌లు దొరకడం లేదు

బెడ్డుకు 25 వేలు

బాధితుడి యోగక్షేమాలకు మరో రూ.10 వేలు 

కరోనా పేషెంట్లకు సేవల ముసుగులో వసూళ్లు 

ఖాళీ అవుతున్న బెడ్‌లు దళారులతో అమ్మకానికి 

తెలిసినవారు, అంబులెన్స్‌ డ్రైవర్ల ద్వారా బేరాలు 

బెజవాడ ప్రభుత్వాస్పత్రిలో దోపిడీ దందా జోరు


(విజయవాడ-ఆంధ్రజ్యోతి) 

కరోనా బాధితులకు సేవల ముసుగులో విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో వసూళ్ల దందా మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది. ఇక్కడ రోజుల తరబడి పడిగాపులు కాస్తున్నా బాధితులు బెడ్‌లు దొరకడం లేదు. కానీ దొడ్డిదారిన ఆస్పత్రి సిబ్బందితో బేరసారాలు సాగిస్తున్నవారికి మాత్రం వెంటనే లభిస్తున్నాయి. ఈ ఆస్పత్రిలోని సుమారు 800 బెడ్‌లు ఎప్పుడో నిండిపోయాయి. కొత్తగా కరోనా బారినపడుతున్న వారు రోజూ 50 నుంచి 100మంది వరకు వస్తున్నారు. పరిస్థితి సీరియ్‌సగా ఉన్న కొంతమంది క్యాజువాలిటీ దగ్గరే ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారికి బెడ్‌లు ఖాళీ లేకపోయినా వైద్యులు ఆక్సిజన్‌ అందించి.. ఆస్పత్రి ఆవరణలో, వరండాల్లోనే వైద్యం అందిస్తున్నారు. ఇక్కడ రోజూ 40మందికి పైగా మృతి చెందుతుండగా, ఇలా ఖాళీ అవుతున్న బెడ్‌లను క్యాజువాలిటీలో, వరండాల్లో చికిత్స పొందుతున్నవారికి కేటాయించాల్సి ఉంది. కానీ ఈ ఆస్పత్రిలో పనిచేస్తున్న కొంతమంది కాసులకు కక్కుర్తి పడుతూ బెడ్‌లను దళారుల ద్వారా అమ్మకానికి పెడుతున్నారు. ఒక్కో బెడ్‌ను రూ.20 నుంచి రూ.25వేలకు అమ్ముతున్నట్లు ఆస్పత్రి వర్గాలే చెబుతున్నాయి. ప్రైవేటు ఆస్పత్రుల్లో ఒక్కరోజుకే రూ.75వేల నుంచి రూ.లక్ష వరకూ వసూలు చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వాస్పత్రిలో రూ.25వేలు ఇవ్వడానికి బాధితుల కుటుంబ సభ్యులు వెనుకాడకపోవడంతో కాసుల వర్షం కురుస్తోందని చెబుతున్నారు. తమకు బాగా తెలిసినవారి ద్వారా, బాధితులను ఆస్పత్రికి తీసుకొస్తున్న అంబులెన్స్‌ల డ్రైవర్ల ద్వారా బెడ్‌ల అమ్మకాలు సాగిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. 


ఆప్తుల కోసం ఆరాటం 

ఆస్పత్రిలోని వివిధ వార్డుల్లో దాదాపు వెయ్యి మంది వరకు కరోనా బాధితులు చికిత్స పొందుతుండగా తమ ఆప్తులు ఏ వార్డులో ఉన్నారో, వారి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో తెలియక కుటుంబ సభ్యులు, బంధువులు ఆస్పత్రి బయట పడిగాపులు కాస్తూ తీవ్ర భయాందోళనలు చెందుతున్నారు. ఒకసారి లోపలికి వెళ్లి చూసి వస్తామని బతిమలాడుతున్నా ఆస్పత్రి సిబ్బంది అనుమతించడం లేదు. దీంతో వారికి డబ్బులిస్తూ తమ ఆప్తుల సమాచారాన్ని తెలుసుకుంటున్నారు. కొంతమంది కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ వైద్యసిబ్బంది, నాలుగో తరగతి ఉద్యోగులు ఇదే పనిలో ఉంటున్నారు. ఆస్పత్రిలో ప్రైవేటు ఏజెన్సీల ఆధ్వర్యంలో పని చేస్తున్న ఔట్‌సోర్సింగ్‌, కాంట్రాక్ట్‌ సిబ్బందికి దాదాపు ఏడాదిగా జీతాలు చెల్లించడం లేదు. తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వారంతా ప్రస్తుతం ఆస్పత్రిలో నెలకొన్న పరిస్థితులను తమకు అనుకూలంగా మలచుకుంటున్నారు. కొందరైతే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నవారి యోగక్షేమాలు చూస్తామంటూ రూ.వేలల్లో డిమాండ్‌ చేస్తున్నారని చెబుతున్నారు. కొవిడ్‌ వార్డుల్లో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్టు వైద్యసిబ్బంది లోపల ఉన్న పేషెంట్లను బాగా చూసుకుంటామంటూ రూ.5 నుంచి రూ. 10వేల వరకు వసూలు చేస్తుండగా.. కొందరు ఆన్‌లైన్‌ ద్వారా, గూగల్‌ పే, ఫోన్‌పే ద్వారా డబ్బు జమ చేయించుకుంటున్నారని చెబుతున్నారు. 


ప్రతిదానికీ ఒక రేటు 

కరోనా బాధితులకు ఆస్పత్రిలో ఉచితంగా ఆహారం అందిస్తున్నా తినలేకపోతున్నామని పలువురు వాపోతున్నారు. ఈ నేపథ్యంలో వారి కుటుంబ సభ్యులు ఇంటి నుంచి భోజనాలను తీసుకొస్తున్నారు. వాటిని నేరుగా బాధితులకు అందించే అవకాశం లేకపోవడంతో ఆయా వార్డుల్లో పనిచేస్తున్న ఎంఎన్‌వోలు, ఎఫ్‌ఎన్‌వోలు, పారిశుధ్య సిబ్బందిని ఆశ్రయించాల్సి వస్తోంది. భోజనాలు, వేడినీళ్లు, దుస్తులు, పండ్లు.. తదితరాలను వార్డులోకి తీసుకువెళ్లి బాధితులకు అందించినందుకు ఒక్కోదానికి ఒక్కో రేటు నిర్ణయించి వసూలు చేస్తున్నారు. లోపల ఉన్న తమవారికోసం సిబ్బంది అడిగినంత ఇవ్వడానికి కుటుంబసభ్యులు వెనకాడటం లేదు. ఈ విషయాన్నీ తెలిసినా ఆస్పత్రి ఉన్నతాధికారులు చూసీచూడనట్లుగా పోతున్నారన్న విమర్శలొస్తున్నాయి. 

Updated Date - 2021-05-10T09:10:18+05:30 IST