కొత్తగా 25వేల మొబైల్‌ టవర్లు

ABN , First Publish Date - 2022-10-05T09:48:04+05:30 IST

దేశంలో కొత్తగా 25వేల మొబైల్‌ టవర్లను ఏర్పాటుచేయాలని కేంద్రం నిర్ణయించింది. మారుమూల ప్రాంతాలకు కనెక్టివిటీని అందించడమే లక్ష్యంగా టవర్లను నిర్మించనుంది. దీనికోసం రూ.26 వేల కోట్లను కేటాయించింది. దీనికి

కొత్తగా 25వేల మొబైల్‌ టవర్లు

  • 26వేల కోట్లతో 500 రోజుల్లో ఏర్పాటు
  • భారత్‌ బ్రాడ్‌బ్యాండ్‌ ఆధ్వర్యంలో నిర్మాణం
  • తద్వారా మారుమూల ప్రాంతాలకూ కనెక్టివిటీ
  • కేంద్ర టెలికాం మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ వెల్లడి
  • ఎఫ్‌ఎం పాలసీలో సవరణలకు క్యాబినెట్‌ ఆమోదం


న్యూఢిల్లీ, అక్టోబరు 4:  దేశంలో కొత్తగా 25వేల మొబైల్‌ టవర్లను ఏర్పాటుచేయాలని కేంద్రం నిర్ణయించింది. మారుమూల ప్రాంతాలకు కనెక్టివిటీని అందించడమే లక్ష్యంగా టవర్లను నిర్మించనుంది. దీనికోసం రూ.26 వేల కోట్లను కేటాయించింది. దీనికి అవసరమైన నిధులను యూనివర్సల్‌ సర్వీసెస్‌ ఆబ్లిగేషన్‌ ఫండ్‌ అనే సంస్థ అందించనుంది. భారత్‌ బ్రాడ్‌బ్యాండ్‌ నెట్‌వర్క్‌ సంస్థ టవర్ల నిర్మాణాన్ని చేపట్టనుందని కేంద్ర టెలికాం శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ వెల్లడించారు. న్యూఢిల్లీలో మూడు రోజులపాటు జరిగిన డిజిటల్‌ ఇండియా కాన్ఫరెన్స్‌ సోమవారం ముగిసింది. అదేవిధంగా ప్రైవేట్‌ ఎఫ్‌ఎం ఫేజ్‌-3 పాలసీలో సవరణలు చేయాలని కేంద్రం నిర్ణయించింది. గ్రామీణ ప్రాంతాలకు ఎఫ్‌ఎం నెట్‌వర్క్‌ను విస్తరించడమే లక్ష్యంగా సవరణలను కేంద్ర క్యాబినెట్‌ మంగళవారం ఆమోదించింది. దీన్ని అనుసరించి... ఎఫ్‌ఎం లైసెన్స్‌లో మార్పులు చేసుకోవడానికి విధించిన మూడేళ్ల కాలపరిమితిని తొలగించారు.


అలాగే ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం ఏదైనా ఒక కంపెనీ మొత్తం రేడియో స్టేషన్లలో 15శాతానికి మించి స్టేషన్లను నిర్వహించకూడదు. తాజా సవరణల్లో భాగంగా ఈ నిబంధనను తొలగించారు. అదేవిధంగా సీ, డీ క్యాటగిరీ నగరాల్లో ఎఫ్‌ఎం స్టేషన్ల కోసం నిర్వహించే బిడ్డింగ్‌లో పాల్గొనడానికి అవసరమైన పెట్టుబడిని రూ.1.5 కోట్ల నుంచి రూ.కోటికి తగ్గించారు. ఈ సవరణల ద్వారా ఎఫ్‌ఎం రేడియో రంగం విస్తరించి యువతకు మరిన్ని ఉపాధి అవకాశాలు లభిస్తాయని కేంద్రం పేర్కొంది.

Updated Date - 2022-10-05T09:48:04+05:30 IST