5 వేలకు ఐదు రోజుల్లో 25 వేలు

ABN , First Publish Date - 2022-06-23T08:27:35+05:30 IST

5 వేలకు ఐదు రోజుల్లో 25 వేలు

5 వేలకు ఐదు రోజుల్లో 25 వేలు

ఆశ చూపి.. ఒక్కరోజే రూ.కోటి వసూలు 

బోర్డు తిప్పేసిన జీఈ హెల్త్‌కేర్‌

వెలుగుచూసిన గొలుసుకట్టు మోసం 

మోసపోయిన వందలాది బాధితులు


గిద్దలూరు టౌన్‌, జూన్‌ 22: రూ.5వేలు పెట్టుబడి పెడితే 5 రోజుల్లో రూ.25 వేలు ఆదాయం. ఎంత పెట్టుబడి పెడితే అంతకు ఐదు రెట్లు ఖాయం... ఇదీ జీఈ హెల్త్‌కేర్‌ ప్రచారం. జనం నమ్మారు వేలాది రూపాయలు పెట్టుబడిగా పెట్టేశారు. ఓ వ్యక్తి 50వేలు పెట్టుబడి పెట్టగా అతనికి కొద్ది రోజుల్లో రూ.2లక్షలు జమ అయింది. అతడు ఈ విషయాన్ని ఇతరులకు చెప్పి.. మరింత మందిని సభ్యులుగా చేర్చాడు. అధిక లాభాలు వస్తుండటంతో పోటీపడి మరీ డబ్బులు కట్టారు. దీంతో ఒక్కరోజులోనే ఆ సంస్థకు రూ.కోటికిపైగా పెట్టుబడులు వచ్చాయి. అయితే పట్టణానికి చెందిన జి.ప్రవీణ్‌ రూ.64వేలు కట్టి సభ్యుడిగా చేరాడు. అతని ఖాతాలో తిరిగి రూ.4వేలు మాత్రమే జమయ్యాయి. దీంతో తనను చేర్పించినవారిని సంప్రదించగా.., వారు ముఖం చాటేశారు. పట్టణంలోని చాలామందిదీ ఇదే పరిస్థితి. గొలుసుకట్టు వ్యాపారం ద్వారా అధిక డబ్బులు వస్తాయని ఆశకు పోయిన వారంతా ఘెల్లుమంటున్నారు. ఈ గొలుసుకట్టు వ్యాపారంలో ప్రకాశం జిల్లా గిద్దలూరు పరిసర ప్రాంతంలో 1500 మందికి పైగా మోసపోయినట్లు తెలుస్తోంది. జీఈ హెల్త్‌కేర్‌కు సంబంధించిన ప్రాడక్ట్స్‌లో పెట్టుబడి పెడితే రెండింతల లాభం వస్తుందని సంస్థ వెబ్‌సైట్లలో, సోషల్‌ మీడియాలో ప్రకటనలు ఇచ్చింది. వాటిని చూసిన అనేకమంది పెట్టుబడి పెట్టారు. జీఈ సంస్థ వాట్సప్‌ గ్రూపు సభ్యులందరినీ ఒకచోటికి చేర్చి.. ఒక్కో సభ్యుడు సభ్యత్వం కోసం రూ.600 చెల్లించాలని, ఆపై ఒక్కొక్కరు కొంతమందిని చేర్చి, ఆ కొంతమంది మరికొంతమందిని చేర్చేలా గొలుసుకట్టు వ్యాపారాన్ని ప్రారంభించారు. ఒక్కొక్కరు రూ.600 కట్టి చేరిన తర్వాత రూ.150 కమీషన్‌ వస్తుందని ఆశ చూపారు. రూ.600 చెల్లించి సభ్యత్వం తీసుకున్న సభ్యుడు సంస్థ నుంచి ప్రొడక్ట్‌ కొనుగోలు చేయాలి. రూ.600 పెట్టుబడి పెడితే రోజుకు రూ.23 వడ్డీతోపాటు 15 రోజుల తర్వాత రూ.1,650 వస్తుందని ఆశ చూపించింది. ఈవిధంగా కొందరు అధిక మొత్తంలోనే పెట్టుబడులు పెట్టారు. చివరకు ఆ సంస్థ బోర్డు తిప్పేసినట్లు తెలియడంతో బాధితులు లబోదిబోమంటున్నారు. ఈ గొలుసుకట్టు మోసంలో గిద్దలూరు, కంభం, నంద్యాల ప్రాంతాల్లోనే 1500 మంది వరకూ బాధితులు ఉన్నట్లు సమాచారం. వారంతా పోలీసులను ఆశ్రయించి తమ గోడు వెల్లబోసుకున్నారు. ఈ విషయంపై ఎస్‌ఐ బ్రహ్మనాయుడును వివరణ కోరగా బాధితుల ఫిర్యాదు మేరకు పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.

Updated Date - 2022-06-23T08:27:35+05:30 IST