25 మంది టీచర్లు అరెస్ట్‌

ABN , First Publish Date - 2022-05-04T07:40:27+05:30 IST

25 మంది టీచర్లు అరెస్ట్‌

25 మంది టీచర్లు అరెస్ట్‌

టెన్త్‌ పేపర్ల లీకేజీ, మాస్‌ కాపీయింగ్‌పై కేసులు


(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌) 

పదో తరగతి పరీక్షా పత్రాల లీకేజీ, మాస్‌ కాపీయింగ్‌ను ప్రోత్సహించారం టూ కృష్ణా, ఏలూరు జిల్లాలకు చెందిన 25 మంది టీచర్లు, ఒక అటెండర్‌, కర్నూలు జిల్లాలో ఐదుగురు యువకులపై పోలీసులు కేసులు నమోదుచేశారు. వివరాలు... ఏలూరు జిల్లా మండవల్లి మండలం కానుకొల్లు జెడ్పీ పాఠశాలలో లెక్కల టీచరుగా పనిచేస్తున్న బి.రత్నకుమార్‌ వాట్సప్‌ నంబరు నుంచి కృష్ణాజిల్లా పామర్రు మండలం పసుమర్రు జెడ్పీ ఉన్నత పాఠశాలలో పనిచేసే టీచర్లకు ప్రశ్నపత్రం, జవాబు పత్రాలు వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. జవాబులతో కూడిన కాపీలను పసుమర్రు పాఠశాల విద్యార్థులు పరీక్ష రాస్తున్న డోకిపర్రు ఉన్నత పాఠశాలకు తీసుకువెళ్తున్నట్టు వెల్లడైంది.


మండవల్లి పాఠశాలలో పనిచేసే 8మంది టీచర్లు ప్రశ్నలకు జవాబులు రాసి, వాటిని ప్రింట్లు తీసి అటెండర్‌ ద్వారా ప్రతి గదికి తీసుకువెళ్లి విద్యార్థులకు ఇస్తున్నట్టుగా గుర్తించారు. ఈ కేసులో పసుమర్రుకు చెందిన ఆరుగురు, మండవల్లికి చెందిన ఒక ఉపాధ్యాయుడిని సోమవారమే సస్పెండ్‌ చేశారు. నిందితులకు ప్రభుత్వాస్పత్రిలో వైద్యపరీక్షలు నిర్వహించి రిమాండ్‌కు తరలించారు. కాగా, టెన్త్‌ పరీక్షల్లో మాస్‌ కాపీయింగ్‌ను ప్రోత్సహించారంటూ ఏలూరు త్రీటౌన్‌ పోలీసులు 10మంది ఉపాధ్యాయులను అరెస్టు చేశారు. వీరిని కోర్టులో హాజరు పర్చగా జడ్జి 14రోజులు రిమాండ్‌ విధించారు. కాగా, కర్నూలు జిల్లాలో టెన్త్‌ గణిత ప్రశ్నపత్రం లీకైన ఘటనలో ఐదుగురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ రామాంజులు తెలిపారు. ఆలూరు మండలం మరకట్టు గ్రామానికి చెందిన కృష్ణతో పాటు కురవళ్లి, ఆలూరు ప్రాంతాలకు చెందిన వెంకటేశ్‌, ఉమ, అజిత్‌, నాగేశ్‌లపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు పంపించినట్లు ఎస్‌ఐ వెల్లడించారు. 

Read more