Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement

పావలా వడ్డీ రాయితీకి మంగళం!

twitter-iconwatsapp-iconfb-icon
పావలా వడ్డీ రాయితీకి మంగళం!

చేనేత పథకాలను నిర్వీర్యం చేస్తున్న ప్రభత్వం

జిల్లాలో చేనేత సంఘాలపై తీవ్ర ప్రభావం

‘నేతన్న నేస్తం’ ఒక్కటే కార్మికులకు దిక్కు

గత ప్రభుత్వాలు చేనేత సహకార సంఘాల మనుగడతో పాటు కార్మికుల సంక్షేమం కోసం ఎన్నెన్నో పథకాలను అమలు చేశాయి. ఆయా పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం నేడు ఒక్కొక్కటిగా మంగళం పాడుతుంటే చేనేత సహకార సంఘాలు క్రమంగా నిర్వీర్యమవుతున్నాయి. సంఘాలకు ప్రభుత్వం ఇచ్చే రాయితీలను ఒక్కొక్కటిగా  నిలిపివేస్తూ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయంతో  ఈ దుస్థితి  నెలకొంది. ప్రస్తుతం చేనేత సంఘాలకు ప్రభుత్వం  ఇచ్చే పావలా వడ్డీ రాయితీకి మంగళం పాడుతూ ఉత్తర్వులు జారీ చేశారు. దాంతో కోట్ల రూపాయల మేర వడ్డీ రాయితీ నిధులు నిలిచిపోవడంతో  సహకార సంఘాల  మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. 

(ఆంధ్రజ్యోతి-అమలాపురం)

ప్రభుత్వం అమలుచేస్తున్న నవరత్నాల్లో భాగంగా చేనేత కార్మికుల కుటుంబాలకు ఇస్తున్న ‘నేతన్న నేస్తం’ పథకం అమలుతో మిగిలిన పథకాలన్నింటికీ గ్రహణం పడుతోంది. దాంతో చేనేత సంఘాలు, వాటిలో ఉన్న సభ్యులు విలవిల్లాడిపోతున్నారు. పావలా వడ్డీ రాయితీ పథకాన్ని చేనేత కార్మికుల సంక్షేమం కోసం అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి అమలుచేస్తే ఆ పథకాన్ని ఆయన తనయుడైన నేటి ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి నిర్వీర్యం చేశారు. పావలా వడ్డీ రాయితీని రద్దు చేస్తూ ప్రభుత్వం 2020 మార్చి 26న ఉత్తర్వులు ఇచ్చిన్పటికీ ఇప్పుడు ఆ సమాచారాన్ని చేనేత సంఘాలకు తెలియజేస్తూ జిల్లా అధికారులు ఈ నెల 4వ తేదీన ఉత్తర్వులు జారీ చేశారు. వాస్తవానికి జిల్లాలో పావలా వడ్డీ పథకం కింద 2016 జూన్‌ నుంచి 2020 మార్చి 31 వరకు రూ.4.16 కోట్లు పెండింగులో ఉంది. చేనేత సంఘాలకు ఎంతో ప్రయోజనకరమైన పావలా వడ్డీ పథకాన్ని నిలిపివేయకుండా చూడాలని చేనేత, జౌళి శాఖ ఉన్నతాధికారులు సైతం ప్రభుత్వానికి నివేదించినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఫలితంగా పావలా వడ్డీని రద్దు చేస్తూ తాజా ఉత్తర్వులు ఇవ్వడంతో చేనేత సంఘాల వారు ఆందోళన చెందుతున్నారు. త్రిఫ్ట్‌ పథకం కింద 2018 సెప్టెంబరు 30 నుంచి 2020 డిసెంబరు 31కి రూ.1.76 కోట్లు విడుదల కావాల్సి ఉండగా రూ.49.66 లక్షలు బడ్జెట్‌ విడుదలైంది. అయితే వీటికి సంబంధించి బిల్లులు పెట్టినప్పటికీ లబ్ధిదారులకు బిల్లులు ఇంకా చెల్లించలేదు. యార్న్‌ సబ్సిడీ కింద 2018 ఏప్రిల్‌ 31 నుంచి 2020 మార్చి 31 వరకు రూ.3.6 కోట్లు రావాల్సి ఉంది. అయితే ప్రభుత్వం రూ.60.85 లక్షలు మాత్రమే విడుదల చేసింది. వీటికి సంబంధించి బిల్లులు పెట్టామని అధికారులు చెప్తున్నారు. అఽయితే జిల్లాలో చేనేతల సంక్షేమం కోసం గత ప్రభుత్వాలు వివిధ పథకాలను అమలు చేసినప్పటికీ వాటన్నింటికీ ‘చేనేత నేస్తం’ ముసుగులో బ్రేక్‌ వేయడం వల్ల సహకార సంఘాల అభివృద్ధి కుంటుపడుతోంది. చేనేత రంగానికి అనుబంధంగా పని చేస్తున్న సరిజట్టు, జంత్రం, రంగుల అద్దకం, డైయింగ్‌ కార్మికులను ప్రభుత్వం గుర్తించకపోవడంతో తీవ్రంగా నష్టపోతున్నారు. చేనేత మాతృ సంస్థ అయిన ఆప్కో చేనేత సంఘాల నుంచి వస్త్రాలు సక్రమంగా కొనుగోలు చేయకపోవడంతో పాటు బకాయిపడ్డ మొత్తాలను విడుదల చేయకపోవడం వంటి పరిణామాలతో సంఘాల్లో కోట్లాది రూపాయల విలువైన వస్త్ర నిల్వలు పేరుకుపోయాయి. దాంతో కార్మికులకు పనులు కల్పించలేని పరిస్థితి సంఘాలకు ఏర్పడింది. ఫలితంగా కోట్ల రూపా యల చేనేత వస్త్రాల లావాదేవీలపై ఈ ప్రభావం తీవ్రంగా ఉంటుందని చేనేత కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో అమలుచేసిన పథకాల ద్వారా చేనేత, అనుబంధ కార్మికులతో పాటు సంఘాలకు ఎంతో మేలు చేకూరేది. దాంతో పాటు కార్మికులకు కొంత మేర ఉపాధి కల్పించే అవకాశాలు ఉండేవని చేనేత నాయకులు చెప్తున్నారు. 

చేనేత వస్త్రాలపై రిబేట్‌ ప్రకటించాలి

 చింతా శంకరమూర్తి, బండారులంక

గత ప్రభుత్వాలు చేనేత వస్త్రాలపై అమలుచేసిన 30 శాతం రిబేట్‌ పథకాన్ని కొనసాగించాలి. అప్పుడే సంఘాల్లో పేరుకుపోయిన వస్త్ర నిల్వలు అమ్ముడు పోతాయి. ఇప్పటికే చేనేత ముడిసరుకులైన నూలు, రంగుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. పవర్‌ లూమ్‌ ఉత్పత్తుల ధాటికి తట్టుకోవాలంటే చేనేత వస్త్రా లపై రిబేట్‌ను కొనసాగించడంతో పాటు గత పథకాలను అమలు చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది.
Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.