ఎస్సై ఉద్యోగమిప్పిస్తానని 25 లక్షలు వసూలు చేసి...

ABN , First Publish Date - 2021-03-28T16:08:34+05:30 IST

ఉన్నతాధికారిని అని పరిచయం చేసుకున్నాడు.

ఎస్సై ఉద్యోగమిప్పిస్తానని 25 లక్షలు వసూలు చేసి...

హైదరాబాద్/పంజాగుట్ట : ఉన్నతాధికారిని అని పరిచయం చేసుకున్నాడు. ‘నీ ఎత్తు, పొడుగు ఎస్సై ఉద్యోగానికి పనికి వస్తావు, నీకు ఉద్యోగమిప్పిస్తా’నంటూ నమ్మబలికి ఓ నిరుద్యోగి నుంచి పలుదఫాలుగా రూ.25 లక్షలు వసూలు చేసి, ఫోన్‌ స్విచ్చాఫ్‌ చేశాడు. దాంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు పంజాగుట్ట పోలీసులను ఆశ్రయించాడు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఘట్కేసర్‌ మండలం పోచారం గ్రామానికి చెందిన బద్రినారాయణ నిరుద్యోగి. కొంతకాలం క్రితం బేగంపేట సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చాడు. ఆసమయంలో అతడికి సుధాకర్‌ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. తాను నిరుద్యోగినని ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నానని సుధాకర్‌తో చెప్పుకున్నాడు.


సుధాకర్‌ ఎస్సై ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికాడు. అతడి మాటలు నమ్మిన బద్రినారాయణ తన వద్ద ఉన్న డబ్బులతోపాటు అప్పులు చేసి మరీ మూడు నెలల వ్యవధిలో పలుదఫాలుగా రూ.25లక్షలు సుధాకర్‌కు ముట్టజెప్పాడు. తన మీద నమ్మకం వచ్చేందుకు సుధాకర్‌ సీఎం క్యాంపు కార్యాలయం పక్కనే ఉన్న టూరిజం ప్లాజా హోటల్‌లో రూమ్‌ తీసుకునేవాడు. బాధితుడిని హోటల్‌ రూమ్‌లోనే కలిసేవాడు. మొదట రూ.10 లక్షలు, మరోసారి రూ.10 లక్షలు, చివరగా మరో రూ.5 లక్షలు సుధాకర్‌ తీసుకున్నాడు. అడిగిన ప్రతిసారి త్వరలోనే ఉద్యోగం వస్తుంది.. తర్వాత డబ్బులు బాగా సంపాదించవచ్చని చెప్పేవాడు. డబ్బులు తీసుకుని రోజులు గడుస్తున్నా ఉద్యోగం మాత్రం రాలేదు. చివరికి ఓ రోజు సుధాకర్‌ ఫోన్‌ స్విచ్ఛాప్‌ అయ్యింది. అతడి కోసం ప్లాజా హోటల్‌, సీఎం క్యాంపు ఆఫీసు చుట్టూ తిరిగినా ఫలితం లేకుండా పోయింది. బాధితుడు మోసపోయానని గ్రహించి పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సుధాకర్‌ ఇదే విధంగా గతంలో పలువురిని మోసం చేసినట్లు సమాచారం.

Updated Date - 2021-03-28T16:08:34+05:30 IST