ఎకరాకు 25 కేజీలే..

ABN , First Publish Date - 2022-10-08T04:31:09+05:30 IST

రబీలో ఉమ్మడి జిల్లాలో 1,36,067 హెక్టార్లలో పప్పుశనగ పంట సాగవుతుందని వ్యవసాయాధికారులు అంచనా వేశారు.

ఎకరాకు 25 కేజీలే..
కోడుమూరులో ఎమ్మెల్యే సుధాకర్‌ రాయితీ శనగ విత్తనాలను రైతులకు పంపిణీ చేస్తున్న దృశ్యం

  1. అరకొర విత్తన పంపిణీపై ఆందోళన
  2. సబ్సిడీలోనూ కోత విధించడంపై ఆగ్రహం


కర్నూలు(అగ్రికల్చర్‌), అక్టోబరు 7: రబీలో ఉమ్మడి జిల్లాలో 1,36,067 హెక్టార్లలో పప్పుశనగ పంట సాగవుతుందని వ్యవసాయాధికారులు అంచనా వేశారు. ఈ మేరకు ఆర్‌బీకే కేంద్రాల ద్వారా విత్తనాలు అందించేందుకు కర్నూలు, నంద్యాల జిల్లాల వ్యవసాయ శాఖ యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. ఈ మొత్తం విస్తీర్ణానికి సరిపడా రాయితీ విత్తనాలను సిద్ధం చేయడంలో అధికారులు శ్రద్ధ తీసుకోలేదనిరైతు సంఘాల ప్రతినిధులు మండిపడుతున్నారు. ఇప్పటి దాకా పది వేల క్వింటాళ్ల విత్తనాలు మాత్రమే ఏపీ సీడ్స్‌ సంస్థ వద్ద సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. మరో 7,500 క్వింటాళ్ల విత్తనాల కోసం అధికారులు దిక్కులు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. మరోవైపు బహిరంగ మార్కెట్‌లో నాణ్యమైన శనగ ధర రూ.4,500 నుంచి రూ.5వేలు పలుకుతుండగా ప్రభుత్వం మాత్రం రూ.6,456 ధర నిర్ణయించింది. ఇందులో 25 శాతం సబ్సిడీ పోగా క్వింటానికి రైతులు చెల్లించాల్సిన మొత్తం రూ.4,842. బహిరంగ మార్కెట్‌లోనే క్వింటం రూ.4,500కు లభిస్తుంటే.. ప్రభుత్వం రూ.6,456గా నిర్ణయించడం ఎంత వరకు సమంజసమని రైతులు ప్రశ్నిస్తున్నారు. పైగా ఎకరాకు సరిపడా 50 కేజీల విత్తనాలు అందించకుండా 25 కేజీలు విత్తనాలు ఇస్తే మిగిలినవి ఎక్కడ తెచ్చుకోవాలని రైతులు ప్రశ్నిస్తున్నారు. ఇదిలాఉంటే ఉమ్మడి జిల్లాలోని పలు ఆర్‌బీకే కేంద్రాల వద్ద ప్రజాప్రతినిధులు, వ్యవసాయాధికారులు శుక్రవారం అరకొరగానే విత్తన పంపిణీ కార్యక్రమం చేపట్టి చేతులు దులుపుకున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

నాణ్యమైన విత్తనాలను అందిస్తున్నాం - వరలక్ష్మి, జేడీ: 

ప్రస్తుత రబీలో అత్యధికంగా సాగవుతున్న పప్పుశనగకు సంబంధించి 25శాతం సబ్సిడీపై విత్తనాలు అందించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశాం. ఆర్‌బీకే కేంద్రాల వద్ద రైతులకు సరిపడ విత్తనాలను సిద్ధం చేస్తున్నాం. శుక్రవారం నుంచి విత్తన పంపిణీ మొదలైంది. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మొత్తం విస్తీర్ణంలో నాలుగో భాగం విస్తీర్ణానికి మాత్రమే రాయితీ విత్తనాలు అందించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇదే విధానాన్ని గత కొన్ని సంవత్సరాలుగా అమలు చేస్తున్నాం.

సబ్సిడీని కుదించడం దారుణం - రామకృష్ణ, రైతు సంఘం జిల్లా కార్యదర్శి: 

గత సంవత్సరం పప్పుశనగ పంటను సాగు చేసిన రైతులు ప్రకృతి వైపరీత్యాల వల్ల పూర్తిగా నష్టపోయారు. ఈసారైనా ప్రభుత్వం రైతులకు కొంత ప్రయోజనాన్ని చేకూరుస్తుందేమోనని ఆశించాం. కనీసం 50 శాతం సబ్సిడీపై విత్తనాలు అందించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాం. వీటిని ఏ మాత్రం ప్రభుత్వం పట్టించుకోలేదు. గత సంవత్సరం 33 శాతం సబ్సిడీ ఇస్తే.. ఈసారి ఆ సబ్సిడీని 25 శాతానికి కుదించడం దారుణం. వ్యాపారులకు లబ్ధి చేకూర్చే విధంగా బహిరంగ మార్కెట్‌లో కూడా లేని ధరను నిర్ణయించడం అన్యాయం.


Updated Date - 2022-10-08T04:31:09+05:30 IST