చీప్‌ లిక్కర్‌పై బాదుడు క్వార్టర్‌పై 25 పెంపు

ABN , First Publish Date - 2022-05-20T09:27:55+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం చీప్‌ లిక్కర్‌ ధరను భారీగా పెంచింది. ఇప్పటివరకు క్వార్టర్‌ రూ.95 ఉండగా.

చీప్‌ లిక్కర్‌పై బాదుడు క్వార్టర్‌పై 25 పెంపు

  • రాష్ట్రంలో ఒకేసారి పెంపు.. బీరుపై రూ.10
  • లిక్కర్‌ మీద 20 నుంచి 25 శాతం దాకా బాదుడు
  • రూ.200దాటి ఉండే క్వార్టర్‌ మీద రూ.40 వడ్డింపు
  • నెలకు రూ.500 కోట్ల అదనపు అమ్మకాలే లక్ష్యం
  • రూ.36 వేల కోట్లు దాటనున్న వార్షిక విక్రయాలు!
  • 20 శాతం మార్జిన్‌కు దెబ్బని వ్యాపారుల ఆందోళన
  • ధరల పెంపుతో మద్యపానం తగ్గుతుంది: అహ్మద్‌


రెండేళ్ల కిందట కరోనా సమయంలో మద్యం ధరలను సర్కారు 20% పెంచింది. అప్పట్లో చీప్‌ లిక్కర్‌పై పెంపు 14 శాతానికి పరిమితం చేశారు. పేదవాడు తాగే మద్యం కాబట్టే 14% పెంపుతో సరిపెట్టినట్లు కేసీఆర్‌ ప్రకటించారు. కానీ, ఇప్పుడు మాత్రం చీప్‌ లిక్కర్‌పై ఏకంగా 27% పెంచారు.


హైదరాబాద్‌, మే 19(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం చీప్‌ లిక్కర్‌ ధరను భారీగా పెంచింది. ఇప్పటివరకు క్వార్టర్‌ రూ.95 ఉండగా.. రూ.25 పెంచి రూ.120 చేసింది. మిగతా లిక్కర్‌ క్వార్టర్‌ బాటిల్‌ ధరను రూ.20 నుంచి రూ.40 వరకు పెంచింది. మద్యం కొత్త ధరల వివరాలతో.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇవి గురువారం నుంచే అమల్లోకి వచ్చాయని పేర్కొన్నారు. కాగా.. లిక్కర్‌, బీర్‌, వైన్‌ రేట్లను వేర్వేరుగా ప్రకటించారు. బీర్‌పై రూ.10తో సరిపెట్టినా.. లిక్కర్‌పై మాత్రం బ్రాండ్‌ల వారీగా 20 నుంచి 25 శాతం వరకు పెంచారు. ఇక లిక్కర్‌ను రెండు భాగాలుగా విభజించారు. రూ.200 లోపు ధర ఉన్న క్వార్టర్‌ బాటిల్‌పై రూ.20, హాఫ్‌పై రూ.40, ఫుల్‌పై రూ.80 చొప్పున..., రూ.200పైన ఉండే క్వార్టర్‌కు రూ.40, హాఫ్‌పై రూ.80, ఫుల్‌ బాటిల్‌పై రూ.160 వరకు వడ్డించారు. దేశీయ వైన్‌ క్వార్టర్‌కు రూ.10, హాఫ్‌నకు రూ.20, ఫుల్‌ బాటిల్‌కు రూ.40 చొప్పున పెంచారు. రాష్ట్రంలో అమ్ముడయ్యే లిక్కర్‌లో 60 శాతంపైగా చీప్‌ లిక్కరే. తక్కువ ధరకు దొరుకుతుండడంతో గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా తాగుతుంటారు. ఈ నేపథ్యంలో మరింత ఆదాయం ఉద్దేశంతో చీప్‌ లిక్కర్‌ ధరను రూ.25 మేర పెంచింది.


ప్రస్తుతం గుడ్‌ డే, డౌన్‌ టౌన్‌, వన్‌ ఫైన్‌, డైమండ్‌ ఫైన్‌, హై లైఫ్‌ బ్రాండ్‌ల చీప్‌ లిక్కర్‌ను 180 ఎంఎల్‌ బాటిళ్లలో అమ్ముతున్నారు. ఇవి ఆపై పరిమాణం బాటిళ్లలో లభ్యం కావు. ఇక రెండేళ్ల కిందట కరోనా సమయంలో మద్యం ధరలను సర్కారు 20 శాతం పెంచింది. అప్పట్లో చీప్‌ లిక్కర్‌పై పెంపు 14 శాతానికి పరిమితం చేశారు. పేదవాడు తాగే మద్యం అయినందునే 14 శాతం  పెంపుతో సరిపెట్టినట్లు సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. కాగా, రాష్ట్రంలో చీప్‌ లిక్కర్‌ తర్వాత.. ఆఫీసర్స్‌ ఛాయిస్‌, ఇంపీయరిల్‌ బ్లూ బ్రాండ్లకు డిమాండ్‌ ఉంటుంది. వీటి క్వార్టర్‌ ధరను రూ.20 చొప్పున పెంచి.. చీప్‌ లిక్కర్‌పై మాత్రం రూ.25 బాదారు. అంటే.. దాదాపు 27 శాతం పెంచారు.




అదనపు టార్గెట్‌ రూ.500 కోట్లు

రాష్ట్రంలో నెలకు 28 లక్షల కేసుల లిక్కర్‌, 50 లక్షల కేసుల బీర్లు అమ్ముడవుతుంటాయి. వీటి విలువ సగటున రూ.2,450 కోట్లు. కొత్త ధరలతో నెలవారీ అమ్మకాల విలువ రూ.500 కోట్లు పెరుగుతుందని సర్కారు భావిస్తోంది. ఇప్పటివరకు ఏడాదికి రూ.30 వేల కోట్ల అమ్మకాలు సాగుతుండగా.. ఇకపై అవి రూ.36వేల కోట్లకు చేరతాయి. మరోవైపు ఇటీవల నెలవారీ విక్రయాల టార్గెట్‌ను రూ.2,750 కోట్లుగా ఎక్సైజ్‌ శాఖ నిర్దేశించుకుంది. ఏప్రిల్‌ లో రూ.2,545 కోట్ల దగ్గరే ఆగిపోయింది. కాగా, కొత్త ధరలకు దుకాణ యజమానులకు మార్జిన్‌ వర్తిస్తుందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రస్తుతం చీప్‌పై 27 శాతం, మిగతా లిక్కర్‌, బీర్‌, వైన్‌ బ్రాండ్‌లకు 20 శాతం మేర మార్జిన్‌ ఇస్తున్నారు. అయితే.. ధరల పెంపుతో మార్జిన్‌ను త్వరగా చేరుకుంటామని, నష్టపోతామని దుకాణ యజమానులు అంటున్నారు.


ఏడాదికి రూ.8 కోట్ల విలువైన మద్యం వరకే పూర్తి మార్జిన్‌ (20 శాతం) వర్తిస్తుందని, ఆ తర్వాత స్టాక్‌ కొనుగోలు చేస్తే 10 శాతమే మార్జిన్‌ ఉంటుందని చెబుతున్నారు. కాగా, దుకాణాల్లోని స్టాక్‌ అంతా కొత్త ధరల ప్రకారమే విక్రయించేలా ఎక్సైజ్‌ శాఖ చర్యలు తీసుకుంది. ధరలను పెంచాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోగానే.. బుధవారం రాత్రి మద్యం దుకాణాలను అధికారులు సీల్‌ చేశారు. గురువారం తెరిచి.. స్టాక్‌ను లెక్కగట్టారు. పెంచిన ధరల ప్రకారం ఎక్సైజ్‌ డ్యూటీని వసూలు చేశారు. అనంతరం విక్రయాలకు అనుమతి ఇచ్చారు. అలాగే, కొత్త ధరల ప్రకారం ఆన్‌లైన్‌లో స్టాక్‌ కొనుగోలును ప్రారంభించారు. 


పెంపుతో నియంత్రణ: ఎక్సైజ్‌ డైరెక్టర్‌

ధరల పెంపుతో రాష్ట్రంలో మద్యపానం నియంత్రణలోకి వస్తుందని ఎక్సైజ్‌ శాఖ డైరెక్టర్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌ తెలిపారు. ‘‘2020 మేలో మద్యం ధరలను పెంచాం. రెండేళ్లుగా అవే కొనసాగించాం. ఎంఆర్పీ కన్నా అధిక ధరకు విక్రయిస్తే 18004252523 టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదు చేయాలి.’’ అని ఓ ప్రకటనలో సూచించారు.

Updated Date - 2022-05-20T09:27:55+05:30 IST