ముందస్తు పన్ను వసూళ్లలో 25 శాతం క్షీణత

ABN , First Publish Date - 2020-09-18T06:06:07+05:30 IST

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో సెప్టెంబరుతో ముగిసే రెండో త్రైమాసికానికి ముందస్తు పన్ను వసూళ్లు వార్షిక ప్రాతిపదికన 25.5 శాతం క్షీణించి రూ.1,59,057 కోట్ల కు పరిమితమయ్యాయి...

ముందస్తు పన్ను వసూళ్లలో 25 శాతం క్షీణత

  • రెండో త్రైమాసికానికి రూ.1,59,057 కోట్లు
  • భారీగా తగ్గిన కార్పొరేట్‌ ట్యాక్స్‌ చెల్లింపులు 


ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో సెప్టెంబరుతో ముగిసే రెండో త్రైమాసికానికి ముందస్తు పన్ను వసూళ్లు వార్షిక ప్రాతిపదికన 25.5 శాతం క్షీణించి రూ.1,59,057 కోట్ల కు పరిమితమయ్యాయి. గత ఆర్థిక సంవత్సరంలో ఇదే కా లానికి వసూళ్లు రూ.2,12,889 కోట్లుగా నమోదయ్యాయి. ఈ జూన్‌తో ముగిసిన మొదటి త్రైమాసికంతో పోలిస్తే మాత్రం పరిస్థితి  చాలా మెరుగైంది. ఎందుకంటే, కఠిన లాక్‌డౌన్‌ దెబ్బకు మొదటి త్రైమాసికం వసూళ్లు ఏకంగా 76 శాతం పతనమై రూ.11,714 కోట్లకు పడిపోయాయి. రెండో త్రైమాసిక ముందస్తు పన్ను చెల్లింపులకు గడువు ఈ నెల 15తో ముగిసింది. కార్పొరేట్‌ కంపెనీలు, వ్యక్తులు ఆర్థిక సంవత్సరం మొత్తానికి చెల్లించాల్సిన పన్ను బకాయిల్లో 15 శాతం తొలి త్రైమాసికంలో, రెండు, మూడు త్రైమాసికాల్లో 25 శాతం చొప్పున, మిగతా 35 శాతాన్ని నాలుగో త్రైమాసికంలో చెల్లించాల్సి ఉంటుంది. మరిన్ని వివరాలు.. 


రెండో త్రైమాసికంలో కార్పొరేట్ల ముందస్తు పన్ను చెల్లింపులు వార్షిక ప్రాతిపదికన 27.3 శాతం తగ్గి రూ.1,29,619.6 కోట్లకు పరిమితం అయ్యాయి. 


వ్యక్తిగత ఆదాయ పన్ను ముందస్తు వసూళ్లు 15 శాతం తగ్గి రూ.29,437.5 కోట్లుగా నమో దయ్యాయి. 


మొత్తం కలిపి (కార్పొరేట్‌ ట్యా క్స్‌, వ్యక్తిగత ఆదాయ పన్ను) రూ. 1.59 లక్షల కోట్లకు పైగా వసూలుఅయ్యాయి. 


టీడీఎస్‌ (రాబడి మూలం వద్దే పన్ను వసూలు) ఆదాయం మాత్రం మెరుగ్గా ఉందని ముంబై జోన్‌ ఐటీ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. రెండో త్రైమాసికంలో టీడీఎస్‌ వసూళ్లు కేవ లం 5.6 శాతం తగ్గుదలతో రూ. 1,38,605.2 కోట్లుగా నమోదయ్యాయి. 


ప్రస్తుత ఆర్థిక సంవత్సరాని (2020-21)కి స్థూల పన్ను వసూళ్లు వార్షిక ప్రాతిపదికన 12 శాతం వృద్ధి చెంది రూ.24.23 లక్షల కోట్లకు చేరవచ్చని బడ్జెట్లో ప్రభుత్వం అంచనా వేసింది. అందులో ప్రత్యక్ష పన్ను వసూళ్ల ఆదాయాన్ని రూ.13.19 లక్షల కోట్లుగా అంచనా వేసింది. 

Updated Date - 2020-09-18T06:06:07+05:30 IST