వ్యాక్సినేష‌న్‌లో దూసుకెళ్తున్న అమెరికా.. ఏకంగా 25 రాష్ట్రాల్లో..

ABN , First Publish Date - 2021-05-25T18:45:48+05:30 IST

అగ్ర‌రాజ్యం అమెరికా వ్యాక్సినేష‌న్‌లో దూసుకెళ్తోంది. ఆ దేశంలోని మొత్తం 50 రాష్ట్రాల్లో 25 రాష్ట్రాలు ఇప్ప‌టికే 50 శాతానికి పైగా మందికి రెండు డోసుల‌ టీకాలు ఇవ్వ‌డం పూర్తి చేశాయ‌ని తాజాగా విడుద‌లైన‌ సీడీసీ(యూఎస్ సెంట‌ర్స్ ఫ‌ర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్ష‌న్ ) డేటా తెలియ‌జేస్తోంది.

వ్యాక్సినేష‌న్‌లో దూసుకెళ్తున్న అమెరికా.. ఏకంగా 25 రాష్ట్రాల్లో..

వాషింగ్ట‌న్‌: అగ్ర‌రాజ్యం అమెరికా వ్యాక్సినేష‌న్‌లో దూసుకెళ్తోంది. ఆ దేశంలోని మొత్తం 50 రాష్ట్రాల్లో 25 రాష్ట్రాలు ఇప్ప‌టికే 50 శాతానికి పైగా మందికి రెండు డోసుల‌ టీకాలు ఇవ్వ‌డం పూర్తి చేశాయ‌ని తాజాగా విడుద‌లైన‌ సీడీసీ(యూఎస్ సెంట‌ర్స్ ఫ‌ర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్ష‌న్ ) డేటా తెలియ‌జేస్తోంది. సోమ‌వారం విడుద‌లైన ఈ డేటా ప్ర‌కారం మైన్స్ రాష్ట్రం దేశంలోనే అత్య‌ధికంగా 62.9 శాతం మందికి రెండు డోసుల వ్యాక్సినేష‌న్ పూర్తి చేసింది. ఆ త‌ర్వాతి స్థానాల్లో క‌నెక్టిక‌ట్‌(62.8 శాతం), వెర్మాంట్(62.7 శాతం) ఉన్నాయి. అలాగే మసాచుసెట్స్, రోడ్ ఐలాండ్ రాష్ట్రాలు సైతం 60 శాతానికి పైగా మంది వ‌యోజ‌నుల‌కు వ్యాక్సినేష‌న్ ఇచ్చాయి. న్యూజెర్సీలో 59.1 శాతం మందికి, న్యూయార్క్ 56 శాతానికి పైగా రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు టీకాలు ఇవ్వ‌డం పూర్తి చేశాయి. అటు వాషింగ్ట‌న్ డీసీ కూడా రాష్ట్ర ప్ర‌జ‌ల్లో 50 శాతానికి పైగా మందికి రెండు డోసుల‌ టీకాలు ఇచ్చింది. 


ఇక‌పోతే త‌క్కువ‌గా వ్యాక్సినేష‌న్ ఇచ్చిన రాష్ట్రాల జాబితాలో మిస్సిస్సిపీ(34.4 శాతం), అలబామా(36.7 శాతం), అర్కాన్సాస్(38.9 శాతం), టేనస్సీ(39.3 శాతం) ఉన్న‌ట్లు సీడీసీ డేటా ద్వారా తెలిసింది. అలాగే దేశ‌వ్యాప్తంగా ఇప్ప‌టివ‌ర‌కు 49.6 శాతం మంది వ‌యోజ‌నులు రెండు డోసుల టీకాలు తీసుకోగా, 61 శాతం మంది క‌నీసం ఒక్క డోసు వ్యాక్సినేష‌న్ పూర్తి చేసుకున్నారు. ఇదిలా ఉంటే.. అమెరికా అధ్య‌క్షుడు జో బైడెన్ ఆ దేశ స్వాతంత్య్ర‌ దినోత్స‌వం జూలై 4 నాటికి దేశంలోని 70 శాతం మంది ప్ర‌జ‌ల‌కు క‌నీసం ఒక్క డోసు వ్యాక్సినేష‌న్ పూర్తి చేయాల‌ని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్ర‌స్తుతం అగ్ర‌రాజ్యం ఈ ల‌క్ష్యాన్ని అందుకునే దిశ‌గా దూసుకెళ్తోంది. దీనికి తాజాగా వెలువ‌డిన సీడీసీ డేటానే చ‌క్క‌టి ఉదాహ‌ర‌ణ.     


Updated Date - 2021-05-25T18:45:48+05:30 IST