24/7 నిఘా

ABN , First Publish Date - 2022-08-19T08:04:33+05:30 IST

కేబీఆర్‌పార్కులో సినీ నటిపై గత నవంబరులో ఓ వ్యక్తి దాడిచేసి సెల్‌ఫోన్‌ దొంగిలించాడు.

24/7 నిఘా

నిరంతరాయంగా సీసీ కెమెరాలు పనిచేసేలా చర్యలు


నిర్వహణకు పబ్లిక్‌ సేఫ్టీ సొసైటీ ఏర్పాటు

విరాళాలు ఇచ్చే వారికి పన్ను మినహాయింపు

ప్రభుత్వానికి పోలీస్‌ శాఖ ప్రతిపాదన


హైదరాబాద్‌, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి): కేబీఆర్‌పార్కులో సినీ నటిపై గత నవంబరులో ఓ వ్యక్తి దాడిచేసి సెల్‌ఫోన్‌ దొంగిలించాడు. నిందితుడ్ని గుర్తించేందుకు పోలీసులు సీసీ కెమేరా రికార్డింగు పరిశీలించే ప్రయత్నం చేసిన సమయంలో ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. కేబీఆర్‌ పార్కు పరిసరాల్లో మొత్తం 42 కెమేరాలు ఉంటే అందులో 25 మాత్రమే పనిచేస్తున్నట్లు గుర్తించారు. ఒక్క కేబీఆర్‌ పార్కువద్దే కాదు హైదరాబాద్‌లోని ప్రధాన ప్రాంతాలతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి పరిస్థితే ఉంది. హైదరాబాద్‌తోపాటు రాష్ట్రంలో ప్రతి అంగుళం నిఘా నీడలో ఉండేందుకు పోలీ్‌సశాఖ 10 లక్షల సీసీ కెమేరాలు ఏర్పాటు లక్ష్యంగా పెట్టుకుంది. లక్ష్యాన్ని చాలావరకు చేరుకుంది కూడా. ఇప్పుడు వాటి నిర్వహణపై దృష్టి సారించింది. అందుకోసం ప్రత్యేకంగా ‘పబ్లిక్‌ సేఫ్టీ సొసైటీ’ ఏర్పాటు చేసింది. సొసైటీ ద్వారా సీసీ కెమేరాల పర్యవేక్షణ కొనసాగిస్తారు. సొసైటీ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తి అయింది. సొసైటీకి రాష్ట్ర స్థాయిలో డీజీపీ కార్యాలయ అధికారుల పర్యవేక్షణ ఉంటుంది. జిల్లాల్లో కమిషనర్లు, ఎస్పీలు పర్యవేక్షిస్తారు. కార్పొరేట్‌ సంస్థల నుంచి సీఎస్‌ఆర్‌ కింద సొసైటీకి నిధులు సేకరిస్తారు. సాధారణ వ్యక్తులు, సంస్థలు కూడా తమకు వీలైనంత మొత్తాన్ని సొసైటీకి విరాళంగా అందజేయవచ్చు. సొసైటీకి వచ్చే విరాళాలకు పన్ను రాయితీ కల్పించాలని పోలీస్‌ శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. పన్ను మినహాయింపుపై ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చిన వెంటనే సొసైటీని పూర్తి స్థాయిలో ప్రజలకు చేరువలో చేసేందుకు చర్యలు చేపట్టింది. 


పక్కాగా సీసీ కెమేరాల నిర్వహణ..

ప్రైవేటు వ్యక్తుల భాగస్వామ్యంతో నివాస సముదాయాలు, కాలనీలు, వ్యాపార సముదాయాల వద్ద ఎక్కడికక్కడ పోలీ్‌సలు సీసీ కెమేరాలు ఏర్పాటు చేయించారు. కానీ నిర్వహణ లేక చాలా కెమేరాలు సరిగా పనిచేయడం లేదు. నిధుల కొరత కారణంగా స్థానిక పోలీ్‌సలు వాటి మరమత్తులు చేయడం లేదు. కానీ ఇకపై సొసైటీకి వచ్చే నిధులతో ఎక్కడ పనిచేయడం లేదని గుర్తించినా తక్షణమే అవసరమైన మరమ్మత్తులు చేయిస్తారు. కమిషనర్‌, ఎస్పీకి ఇండెంట్‌ పెట్టి సొసైటీ ఖాతా నుంచి నిధులు తీసుకుంటారు. రాష్ట్రంలో మారుమూల గ్రామంలో ఏ చిన్న సంఘటన జరిగిన హైదరాబాద్‌లో ఉన్నతాధికారులు స్వయంగా పర్యవేక్షించే విధంగా బంజారాహిల్స్‌లో ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్‌(ఐసీసీసీ) కొద్ది రోజుల క్రితమే ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఐసీసీసీ సమర్థంగా పనిచేయాలంటే ప్రతి సీసీ కెమేరా పనిచేయాల్సిందే. ఇందుకోసమే పోలీస్‌ శాఖసొసైటీ ఏర్పాటు చేసింది. కాగా సొసైటీ ఏర్పాటు చేసి నిధుల సేకరించడం పట్ల విమర్శలు వస్తున్నాయి. ప్రతి చదరపు కి.మీ.కు 480 సీసీ కెమేరాల ఏర్పాటుతో ప్రపంచంలోనే అత్యధిక సీసీ కెమేరాలు ఉన్న నగరాల్లో హైదరాబాద్‌ రెండో స్థానంలో ఉంది.

Updated Date - 2022-08-19T08:04:33+05:30 IST