2,44,345 మందికి రైతు భరోసా

ABN , First Publish Date - 2022-05-17T06:42:25+05:30 IST

వైఎస్‌ఆర్‌ రైతు భరోసా పథకం చెక్కుల పంపిణీ కార్యక్రమం సోమవారం స్థానిక ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో నిర్వహించారు.

2,44,345 మందికి రైతు భరోసా
రైతు భరోసా చెక్కును అందజేస్తున్న మంత్రులు, కలెక్టర్‌, ప్రజాప్రతినిధులు, అధికారులు

రూ.183.26 కోట్ల చెక్కు అందజేసిన మంత్రులు ముత్యాలనాయుడు, అమర్‌నాథ్‌


కొత్తూరు, మే 16: వైఎస్‌ఆర్‌ రైతు భరోసా పథకం చెక్కుల పంపిణీ కార్యక్రమం సోమవారం స్థానిక ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా హాజరైన మంత్రులు బూడి ముత్యాలనాయుడు, గుడివాడ అమర్‌నాథ్‌ మాట్లాడుతూ, రైతులకు విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారక మందులు, వ్యవసాయ యంత్ర పరికరాలు, ధాన్యం కొనుగోళ్లు, తదితర సేవలను ఒకేచోట అందించడానికి తమ ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసిందని చెప్పారు. జిల్లా కలెక్టర్‌ రవి పట్టన్‌శెట్టి మాట్లాడుతూ, ఈ ఏడాదికి మొదటి విడతగా ప్రస్తుతం రూ.7,500 చొప్పున రైతుల ఖాతాల్లోకి జమ చేస్తామని, రెండో విడత అక్టోబరులో రూ.4 వేలు, మూడో విడత జనవరిలో రూ.2 వేలు రైతులకు అందుతాయని వివరించారు. అనంతరం జిల్లాలో 2,44,345 మంది రైతులకు వైఎస్‌ఆర్‌ రైతు భరోసా, పీఎం కిసాన్‌ పథకం కింద రూ.183.26 కోట్ల చెక్కును విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్‌ చిక్కాల రామారావు, డీసీసీబీ చైర్‌పర్సన్‌ చింతకాయల అనిత, డీసీఎంఎస్‌ చైర్మన్‌ పల్లా చినతల్లి, అనకాపల్లి ఏఎంసీ చైర్‌పర్సన్‌ పలకా యశోద, ఆర్డీవో చిన్నికృష్ణ, జిల్లా వ్యవసాయాధికారి జి.లీలావతి, ఎంపీపీలు, జడ్పీటీసీ సభ్యులు, కార్పొరేటర్లు, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-05-17T06:42:25+05:30 IST