రోజుకు 240 శాంపిల్స్‌కే!

ABN , First Publish Date - 2020-03-29T10:01:54+05:30 IST

రాష్ట్రంలో కరోనా నిర్థారణ ల్యాబ్‌ల సామర్థ్యంపై ఆందోళన నెలకొంది. తిరుపతి, విజయవాడ, కాకినాడ, అనంతపురంలలో ఉన్న వైరాలజీ ల్యాబ్‌లలో మాత్రమే...

రోజుకు 240 శాంపిల్స్‌కే!

  • ప్రశ్నార్థకంగా రాష్ట్రంలో ల్యాబ్‌ల సామర్థ్యం
  •  కొత్తగా వచ్చే ల్యాబ్‌లతో 420 శాంపిల్స్‌కు పెంపు
  • అయినా చాలవు.. 2 వేలకు పెంచాలి: నిపుణులు
  • ప్రైవేటు ఆస్పత్రులపై ఆరోగ్యశాఖ దృష్టి
  • జిల్లాల్లో మూడేసి పెద్దాసుపత్రులు స్వాధీనం?
  • ఆరోగ్యశ్రీ ద్వారా ఆస్పత్రులకు ప్యాకేజీలు
  • ప్రశ్నార్థకంగా రాష్ట్రంలో ల్యాబ్‌ల సామర్థ్యం

అమరావతి, మార్చి 28(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కరోనా నిర్థారణ ల్యాబ్‌ల సామర్థ్యంపై ఆందోళన నెలకొంది. తిరుపతి, విజయవాడ, కాకినాడ, అనంతపురంలలో ఉన్న వైరాలజీ ల్యాబ్‌లలో మాత్రమే ఇప్పటి వరకూ కరోనా నిర్థారణ పరీక్షలు చేస్తున్నారు. నాలుగు ల్యాబ్‌లలో 240కి మించి శాంపిల్స్‌ పరీక్షించే స్థాయి లేదు. రోజుకు రెండు షిఫ్ట్‌లలో శాంపిల్స్‌ పరీక్షించవచ్చు. ప్రతి షిఫ్ట్‌కు 30 చొప్పున రోజుకు ఒక్కో ల్యాబ్‌లో 60 శాంపిల్స్‌ మాత్రమే పరీక్ష చేసే సామర్థ్యం ఉంది. కాగా, విశాఖపట్నం, గుంటూరు, కడపల్లోనూ ల్యాబ్‌లు పెట్టాలని ఆరోగ్యశాఖ నిర్ణయించింది. ఇవి కూడా అందుబాటులోకి వస్తే 420 శాంపిల్స్‌ పరీక్ష చేయగల సామర్థ్యం మాత్రమే రాష్ట్రంలో ఉంటుంది. ఇది ఏ మేరకు సరిపోతుందో ఆరోగ్యశాఖ అధికారులు ఆలోచన చేయాలి. ఒకేసారి రెండు వేల మందికి పరీక్షలు చేయగల సామర్థ్యం లేకపోతే భవిష్యత్‌లో ఎదురయ్యే పరిణామాల్ని ఎదుర్కొవడం కష్టంగా ఉంటుంది. ఇప్పటి వరకూ విదేశాల నుంచి 28 వేల మంది రాష్ట్రంలోకి వచ్చారు. వీరిలో ఎంత మందికి కరోనా ప్రభావం ఉందో చెప్పలేని పరిస్థితి. ఉన్న వారిలో ఎంత మంది వారి కుటుంబ సభ్యులతో సన్నిహితంగా ఉంటున్నారో అంచనా వేయలేని పరిస్థితుల్లో ఆరోగ్యశాఖ అధికారులున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొని అయినా రాష్ట్రంలో ల్యాబ్‌ల సామర్థ్యం పెంచాలి. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న 11 ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలు, 17 ప్రైవేటు మెడికల్‌ కాలేజీల్లో ల్యాబ్‌లు అందుబాటులో ఉంటాయి. వీటిని కరోనా నిర్థారణ ల్యాబ్‌లుగా మా ర్చుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం ఆ వైపుగా అడుగులు వే యాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. వీటితో పాటు రాష్ట్రంలోని ప్రైవేటు ల్యాబ్‌లను కూడా కరోనా నిర్థారణ పరీక్షలకు ఉపయోగించాలని సూచనలు వస్తున్నాయి. రాష్ట్రంలో ఒకేసారి 2 వేలకు పైగా శాం పిల్స్‌ను పరీక్ష చేయగలిగే సామర్థ్యం పెంచుకుంటే తప్ప ఏప్రిల్‌లో ఎదురయ్యే పరిస్థితిని తట్టుకునే పరిస్థితి ఉండదు. 

ప్రైవేటు ఆస్పత్రుల సేవలకు సిద్ధం..

రాష్ట్రంలో ప్రైవేటు ఆస్పత్రుల సేవలను ఉపయోగించుకునేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రైవేటు మెడికల్‌ కాలేజీలు, వాటి అనుబంధ ఆస్పత్రులను కరోనా నివారణ చర్యల కోసం ఉపయోగించుకోవాలని నిర్ణయించింది. ప్రస్తుతం రాష్ట్రంలో 28 వరకూ మెడికల్‌ కాలేజీలు, అనుబంధ ఆస్పత్రులు ఉన్నాయి. ఇందులో ఇప్పటికే 11 బోధనాస్పత్రులను కరోనా సేవల కోసం ఉపయోగించుకునే విధంగా మార్చారు. వీటితో పాటు జిల్లాల్లో ఉన్న ప్రధాన ఆస్పత్రులను కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకునేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే ఈ మేరకు జిల్లా కలెక్టర్లకు అమరావతి నుంచి సమాచారం వెళ్లింది. జిల్లాల్లో అన్ని సదుపాయాలున్న రెండుమూడు ఆస్పత్రులను కల్లెక్టర్లు స్వాధీనం చేసుకోనున్నారు. ఆస్పత్రులు మొత్తాన్ని ప్రభుత్వం పరిధిలోకి తీసుకుంటారు. స్వాధీనం చేసుకున్న ఆస్పత్రి పర్యవేక్షణ, రోగులకు చికిత్స చేయించేందుకు ఆరోగ్యశాఖ ఒక ప్రత్యేక అధికారిని నియమిస్తుంది. ఈ మేరకు త్వరలో ఉత్తర్వులు రానున్నాయి. తొలి విడతలో రెండుమూడు ఆస్పత్రులను ఆరోగ్యశాఖ తను పరిధిలోకి తీసుకుంటుంది. అనంతరం అవసరాన్ని బట్టి స్వాధీనం చేసుకునే విధంగా ఆరోగ్యశాఖ సన్నాహాలు చేస్తోంది. అందించిన చికిత్స ఆధారంగా ఆయా ఆస్పత్రులకు ప్యాకేజీలను కూడా ప్రకటించేందుకు ఆరోగ్యశాఖ సిద్ధమవుతోంది. కేసులను బట్టి ప్యాకేజీలను నిర్ణయిస్తుంది.


Updated Date - 2020-03-29T10:01:54+05:30 IST