కాపురానికి తీసుకెళ్లలేదని.. భర్తకు వీడియోకాల్‌ చేసి..!

ABN , First Publish Date - 2021-10-30T19:06:34+05:30 IST

ఓ ఇంటిని అద్దెకు తీసుకుని నివాసం ఉంటున్నారు. కాగా...

కాపురానికి తీసుకెళ్లలేదని.. భర్తకు వీడియోకాల్‌ చేసి..!

చిత్తూరు జిల్లా/మదనపల్లె క్రైం : భర్తకు వీడియోకాల్‌ చేసిన భార్య... లైవ్‌లో ఉరేసుకుంది. మదనపల్లె  టూటౌన్‌ పోలీసుల కథనం మే రకు... అనంతపురం జిల్లా బాబే నాయక్‌ తాండాకు చెందిన చక్రే నాయక్‌, కమలమ్మ దంపతులు కొంతకాలం కిందట ఉపాధి నిమి త్తం మదనపల్లెకు వలసొచ్చారు. పట్టణంలోని ఎస్బీఐకాలనీ ఎక్స్‌టెన్షన్‌లో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని నివాసం ఉంటున్నారు. కాగా చక్రేనాయక్‌ వాచ్‌మెన్‌గా, కమలమ్మ ఇళ్లల్లో పాచిపనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. 


వీరి ఒక్కగానొక కుమార్తె రమ్యశ్రీ(24)కి ఏడేళ్ల కిందట కర్ణాటక రాష్ట్రం చేలూరుకు చెందిన చందునాయక్‌తో వివాహమైంది. వీరికి 11 నెలల కుమార్తె ఉంది. ఈ నేపథ్యంలో దంపతుల మధ్య కొంత కాలంగా కుటుంబ సమస్యలపై గొడవలు జరుగుతున్నాయి. దీంతో భర్తపై అలిగిన రమ్యశ్రీ కొద్దిరోజుల కిందట పుట్టింటికి వచ్చేసింది. తనను కాపురానికి తీసుకెళ్లాలని రమ్యశ్రీ కొద్దిరోజులుగా భర్తకు ఫోన్‌చేసి అడుగుతోంది. చందు నాయక్‌ స్పందించలేదు. ఇదిలావుండగా రమ్యశ్రీ శుక్రవారం భర్తకు వీడియో కాల్‌ చేసి కాపురానికి తీసుకెళ్లమని కోరింది. ఏ విషయం చెప్పకపోవడంతో చున్నీతో ఫ్యానుకు ఉరేసుకుంది. దీంతో చందు వెంటనే అత్త కమలమ్మకు ఫోన్‌చేసి విషయం చెప్పాడు.


కాగా ఇళ్లల్లో పనులు చేసేందుకు వెళ్లిన ఆమె హుటాహుటిన ఇంటికి చేరుకుని ఫ్యానుకు వేళాడుతున్న కుమార్తెను చూసి బిగ్గరగా కేకలు వేసింది. స్థానికులు చున్నీ తొలగించి చూడగా, అప్పటికే ఆమె మృతి చెందింది. సమాచారం అందుకున్న టూటౌన్‌ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారించారు. అల్లుడి వేధింపుల కారణంగానే తన బిడ్డ ఆత్మహత్య చేసుకుందని పోలీసులకు చెప్పింది. గతంలో చందుపై వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో వేధింపుల కేసు నమోదైందని పేర్కొంది. అనంతరం మృత దేహాన్ని జిల్లా ఆస్పత్రికి తరలించారు. కమలమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ చంద్రమోహన్‌ చెప్పారు.

Updated Date - 2021-10-30T19:06:34+05:30 IST