Australia జైలు నుంచి విడుదలైన 24 ఏళ్ల భారతీయ విద్యార్థి.. India జెండా కోసమే కటకటాల్లోకి.. కాపాడిన ఆ వీడియోలు

ABN , First Publish Date - 2021-09-04T02:46:50+05:30 IST

ఆస్ట్రేలియాలో అరెస్టైన ఓ భారతీయ విద్యార్థి ఎట్టకేలకు విడుదలవుతున్నాడు. భారత జెండా కోసం పోరాడి..

Australia జైలు నుంచి విడుదలైన 24 ఏళ్ల భారతీయ విద్యార్థి.. India జెండా కోసమే కటకటాల్లోకి.. కాపాడిన ఆ వీడియోలు

సిడ్నీ: ఆస్ట్రేలియాలో అరెస్టైన ఓ భారతీయ విద్యార్థి ఎట్టకేలకు విడుదలవుతున్నాడు. భారత జెండా కోసం పోరాడి జైలుకెళ్లాడు. దాదాపు 4 నెలల తర్వాత ఎట్టకేలకు విడుదలవుతున్నాడు. అతడి విడుదల కోసం ఆస్ట్రేలియా, ఇండియా నుంచే కాకుండా ప్రపంచ దేశాల్లోని అనేకమంది భారతీయులు కూడా సదరు విద్యార్థికి మద్దతుగా నిలిచారు. దీంతో అతడి విడుదల సాధ్యమైంది.


వివరాల్లోకి వెళితే.. విశాల్ జుద్. హర్యానాకు చెందిన విద్యార్థి. స్టూడెంట్ వీసాపై ఆస్ట్రేలియాలో చదువుకునేందుకు వెళ్లాడు. అక్కడే ఉంటూ ప్రశాంతంగా చదువు కొనసాగిస్తున్నాడు. అయితే ఇటీవల భారతదేశం ప్రవేశపెట్టిన రైతు చట్టాలకు వ్యతిరేకంగా ఆస్ట్రేలియాలో కూడా ఆందోళనలు తీవ్రతరంగా కొనసాగుతున్నాయి. 2020 డిసెంబరు నాటికి పెర్త్, సిడ్నీ, మెల్‌బోర్న్‌.. ఇతర రాష్ట్రాల్లో కూడా ఖలిస్తానీ సమర్థకుల నిరసనలు ఉధృతమయ్యాయి. భారతదేశాన్ని కించపరుస్తూ, భారత ప్రధానిపై విమర్శలు గుప్పిస్తూ తీవ్ర నినాదాలతో అనేక చోట్ల అల్లర్లకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలోనే ఖలిస్తానీ నిరసనకారులకు వ్యతిరేకంగా విశాల్, అతడి స్నేహితులు సిడ్నీలోని క్వాకర్స్ హిల్‌లో నిరసనలు నిర్వహించారు. అయితే వారిపై ఖలిస్తానీవాదులు దాడి చేశారు.


దాడిలో ఖలిస్తానీలు భారతదేశాన్ని కించపరుస్తూ.. భారీ నినాదాలు చేస్తూ భారత త్రివర్ణ పతాకానికి నిప్పు పెట్టారు. దీంతో విశాల్, అతడి స్నేహితులు కూడా ఖలిస్తానీ జెండాను కాల్చేశారు. ఆ తర్వాత ఇలా జెండాలను కాలుస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో కోకొల్లలు కనిపించాయి. అదే సమయంలో విశాల్ అతడి స్నేహితులతో పాటు మరికొంతమంది భారతీయులు కలిసి ఖలిస్తానీలకు వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించారు. ఇదే అవకాశంగా తీసుకున్న ఖలిస్తానీ మద్దతుదారులు.. హిందువులు తలపాగా చుట్టుకున్న సిక్కులపై దాడులు చేస్తున్నారని మీడియాకు, పోలీసులకు ఫిర్యాదులు చేసి ఇరికించారు. దీంతో అతడిని పోలీసులు అతడిపై కేసు నమోదు చేశారు. దీనికి తోడు అంతకుముందు 6 నెలల క్రితం విశాల్‌పై ఉన్న మరో కేసును కూడా పోలీసులు బయటకు తీశారు. మొత్తానికి ఏప్రిల్ 16 2021న అతడిని పోలీసులు అరెస్టు చేశారు. ఆస్తులకు ధ్వంసం చేశాడనే ఆరోపణలతో పాటు హత్య కేసును కూడా నమోదు చేశారు.


కేసుకు సంబంధించి విశాల్ లాయర్ కోర్టులో ఓ వీడియో ప్రవేశపెట్టారు. అందులో క్వాకర్స్ హిల్‌లో జరిగిన ఘటనకు సంబంధించిన దృశ్యాలున్నాయి. విశాల్‌పై ఖలిస్తానీ నిరసనకారులు దాడి చేయడం, భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీపై నోటికొచ్చినట్లు మాట్లాడడం అన్నీ రికార్డయ్యాయి. అలాగే ఆ తర్వాత నిర్వహించిన ర్యాలీ గురించి న్యాయవారి కోర్టకు విన్నవించారు. ర్యాలీ అనంతరం సాయంత్రం 4:30 గంటల సమయంలో దాదాపు 12 మంది నిర్వాహకులు పర్రమట్టలోని జోన్స్ పార్క్‌లో సేదతీరుతున్నారు.


అదే సమయంలో దాదాపు 100 మంది వారిని చుట్టుముట్టి భారత్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేయడం ప్రారంభించారు. ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో కారులో నుంచి దిగిన ఓ వ్యక్తి బేస్ బాల్ బ్యాట్‌తో విశాల్‌పై దాడికి ప్రయత్నించడంతో ఆ బ్యాట్‌ను లాక్కున్న విశాల్ అతడి కారుపై కొట్టాడు. కారు అద్దం పగిలిపోయింది. దీంతో పాటు హత్య కేసు కూడా పెట్టారు. అయితే కోర్టులో అతడి తరపు న్యాయవాది ప్రవేశపెట్టిన వీడియోను పరిశీలించిన న్యాయమూర్తి విశాల్‌ను నిరపరాథిగా ప్రకటించి కేసు కొట్టేశారు. అతడిని విడుదల చేశారు. దాదాపు నాలుగున్నర నెలల తర్వాత అతడు విడుదలయ్యాడు.

Updated Date - 2021-09-04T02:46:50+05:30 IST