24 వేల క్యూసెక్కులే !

ABN , First Publish Date - 2022-08-07T04:16:30+05:30 IST

కేసీ కెనాల్‌, తెలుగుగంగ, గాలేరు - నగరి కాలువలు రాయలసీమకు సాగు, తాగు నీరు అందిస్తున్నాయి.

24 వేల క్యూసెక్కులే !
24 వేల క్యూసెక్కులకే ఎర్రగూడూరు బ్రిడ్జి వద్ద నిండిన కాలువ

పోతిరెడ్డిపాడు నుంచి రావాల్సింది 44 వేల క్యూసెక్కులు
పూర్తి స్థాయిలో నీరు విడుదల కలేనా?
కాలువల సామర్థ్యం అంతంత మాత్రమే
నిర్వహణ లోపంతో నష్టపోతున్న రాయలసీమ


కేసీ కెనాల్‌, తెలుగుగంగ, గాలేరు - నగరి కాలువలు రాయలసీమకు సాగు, తాగు నీరు అందిస్తున్నాయి. అయితే వీటికి పూర్తి స్థాయిలో నీరు అందాలంటే పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌ నుంచి 44 వేల క్యూసెక్కుల నీరు విడుదల కావాలి. ప్రభుత్వ నిర్లక్ష్యం, నిర్వహణ లోపాల వల్ల ఆ స్థాయిలో నీరు కిందకు వదిలే పరిస్థితి లేదు. ప్రస్తుతం 24 వేల క్యూసెక్కులు మాత్రమే కిందికి వదులుతున్నారు. లైనింగ్‌ పనులు 16 శాతమే పూర్తవడంతో నీరు సాఫీగా ముందుకు సాగడం లేదు. ప్రస్తుతం నీరు వదులుతున్నారు కాబట్టి పనులు చేసే వెసులుబాటు లేదు. దీంతో ఆయకట్టు రైతులకు ఈ ఏడాది సాఫీగా నీరు అందుతుందా? అనేది అనుమానమేని సాగు నీటి నిపుణులు అభిప్రాయపడుతున్నారు.


-నంద్యాల, ఆంధ్రజ్యోతి

నిర్వహణ గాలికి..

శ్రీశైలం జలాశయం నుంచి పోతిరెడ్డిపాడుకు విడుదల చేసే నీటిని మొదట బానకచర్ల హెడ్‌ రెగ్యులేటర్‌కు పంపుతారు. ఇక్కడి నుంచి కేసీ కెనాల్‌, తెలుగుగంగ, గాలేరు - నగరి కాలువలకు నీరు విడుదల చేస్తారు. ఈ కాలువలకు పూర్తిస్థాయిలో నీరు విడుదల కావాలంటే బానకచర్లకు 44 వేల క్యూసెక్కుల నీరు అందాలి. అయితే పోతిరెడ్డిపాడు నుంచి బానకచర్ల మధ్య ఉన్న కాలువ నిర్వహణ మూడేళ్లుగా సరిగా లేదు. దీంతో అనుకున్న స్థాయిలో నీరు విడుదల కావడం లేదు. గత సంవత్సరం వరద ఎక్కువ ఉండటంతో ఒకసారి 44 వేల క్యూసెక్కుల నీరు వదిలారు. అయితే పాములపాడు - ఎర్రగూడూరు మధ్యలో నీరు ఎగదన్నడంతో పోతిరెడ్డిపాడు నుంచి అవుట్‌ ఫ్లోను తగ్గించారు. ఈ ఏడాది జూలైలో పోతిరెడ్డిపాడు నుంచి మొదటిసారి 4 వేల క్యూసెక్కుల నీరు మాత్రమే వదిలారు. కాలువల నిర్వహణ సరిగా లేనందువల్ల ఒకేసారి ఎక్కువ మొత్తంలో నీరు విడుదల చేస్తే ఇబ్బంది అవుతుందని జిల్లా సాగునీటి అధికారులు తెలపడం గమనార్హం. దీనిని బట్టి కాలువల నిర్వహణ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

కాలువ సామర్థ్యం తగ్గిపోయే అవకాశం..

పోతిరెడ్డిపాడు నుంచి బానకచర్ల వరకు ఉన్న కాలువను ఎస్‌ఆర్‌ఎంసీ అంటారు. (శ్రీశైలం ప్రధాన కాలువ) ఈ కాలువ 1వ కి.మీ నుంచి 9 కి.మీ వరకు శ్రీశైలం బ్యాక్‌ వాటర్‌ ఆవరించి ఉంటుంది. శ్రీశైలం జలాశయానికి ఇన్‌ ఫ్లో ఎక్కువగా ఉన్న సందర్భాల్లో బ్యాక్‌ వాటర్‌ ఎస్‌ఆర్‌ఎంసీలో కలుస్తుంది. ఎస్‌ఆర్‌ఎంసీ బలహీనంగా ఉండటంతో నీరు ఇలా చొచ్చుకువస్తున్నాయి. ఈ ఉద్దేశంతో ఎస్‌ఆర్‌ఎంసీకి స్టాండర్ట్‌ వాల్‌ నిర్మాణాన్ని చేపట్టారు. దీనివల్ల ఎస్‌ఆర్‌ఎంసీలోనికి నీరు రాకుండా నిలువరించవచ్చు. అయితే ఈ నిర్మాణం పూర్తికాకపోవడంతో శ్రీశైలం బ్యాక్‌ వాటర్‌ ఎస్‌ఆర్‌ఎంసీలో కలుస్తున్నాయి. నీరు వచ్చి చేరుతున్నపుడు ఎస్‌ఆర్‌ఎంసీలోనికి పూడిక కూడా కలుస్తోంది. పోతిరెడ్డిపాడు ద్వారా 44 వేల క్యూసెక్కులు ఉన్న కాలువ కనీసం 30 వేల క్యూసెక్కులు కూడా తరలించే పరిస్థితి లేదు. ఇక నిర్వహణ లోపం వల్ల పూడిక కూడా వచ్చి చేరితే ఈ తరలింపు సామర్థ్యం మరింత తగ్గిపోతుంది. రాయలసీమకు నీరు అందించే పోతిరెడ్డిపాడు పట్ల పాలకుల నిర్లక్యానికి ఇది నిదర్శనం.

 మొరాయిస్తున్న గేట్లు..

పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ వద్ద మొత్తం పది గేట్లు ఉన్నాయి. వీటి నిర్వహణ కూడా సరిగా లేదన్న విమర్శలు వస్తున్నాయి. గేట్లకు అమర్చాల్సిన రబ్బర్‌ సీలింగులను ఏర్పాటు చేయలేదని తెలుస్తోంది. సీలింగులు సక్రమంగా ఉంటే నీరు లీక్‌ అవదు. అంతే కాకుండా గేట్లు ఎత్తి దించే సమయంలో మొరాయించకుండా ఉంటాయి. అయితే ఈ సీలింగులు సరిగా లేకపోవడంతో ఇన్‌ఫ్లో అనుగుణంగా గేట్లు ఎత్తి, దించుతున్నపుడు మొరాయిస్తున్నాయి. ఈ నెల 7న ఎత్తిన 6వ నంబరు గేటును 8వ తేదీన దించేందుకు సిబ్బంది ప్రయత్నించగా మొరాయించింది. పై నుంచి ఇన్‌ ఫ్లో ఎక్కువగా ఉండటం వల్ల ఆ గేటును అలాగే ఉంచినా ఎలాంటి ఇబ్బంది లేకుండా పోయింది. అదే ఇన్‌ ఫ్లో తక్కువగా ఉన్న సమయంలో గేటు అలానే తెరిచి ఉంచితే నీరు వృథాగా కిందికి పోతుంది. ఇప్పటికైనా ప్రభుత్వం పట్టించుకుని లైనింగ్‌ పనులు త్వరగా పూర్తయ్యేలా చూడాలి. అలాగే గేట్లు మొరాయించకుండా చర్యలు తీసుకుంటే రాయలసీమ ప్రాంతవాసులు నీరు సక్రమంగా వాడుకునే అవకాశం ఉంటుంది.

పనులు 16 శాతమే..

పోతిరెడ్డిపాడు నుంచి బానకచర్ల వరకు కాలువల ఆప్‌గ్రేడ్‌ పనులు, గోరుకల్లు రిజర్వాయర్‌ వరకు లైనింగ్‌ పనులను ప్రభుత్వం చేపట్టింది. దీని కోసం రూ.1000.71 కోట్లు కేటాయించింది. కాలువ సామర్థ్యం 20 వేల క్యూసెక్కుల నుంచి 30 వేల క్యూసెక్కులకు పెంచేందుకు చేపట్టిన ఈ పనులు ఇప్పటి వరకు 16.28 శాతం మాత్రమే పూర్తయ్యాయి. పైగా ఈ పనులు నాసిరకంగా ఉన్నాయన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. సిమెంటు పరుపునకు, లైనింగ్‌ పనుల్లో శ్రద్ధ చూపించలేదన్న విమర్శలు కూడా ఉన్నాయి. దీంతో కాలువ కట్టలు బలహీనంగా ఉండటంతో అనుకున్న లక్ష్యంతో నీరు విడుదల చేయలేకపోతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అలసత్వం వల్ల పనులు ఎపుడు పూర్తవుతాయో తెలీని పరిస్థితి ఉంది. నాసిరకం పనుల వల్ల కాలువల సామర్థ్యం మీద అనుమానాలు రేకెత్తుతున్నాయి. లైనింగ్‌ పనులు పూర్తయితే శ్రీశైలం రిజర్వాయర్‌ నుంచి వరద సమయంలో 880 అడుగుల నీటిమట్టం ఉన్నపుడు 80 వేల క్యూసెక్కుల నీటిని వాడుకోవచ్చని పనులు ప్రారంభ సమయంలో అధికారులు గొప్పలు చెప్పారు. 80 వేల క్యూసెక్కులు కాదు కదా, పనుల ప్రారంభంలో భాగంగా చెప్పిన 30 వేల క్యూసెక్కుల నీరు అయినా అందే అవకాశం ఉంటుందా? అనే ప్రశ్న తలెత్తుతోంది.
 
పనులు వివిధ దశల్లో ఉన్నాయి

గతంలో పోతిరెడ్డిపాడు నుంచి 44 వేల క్యూసెక్కులు తరలించేలా కాలువ పనులు జరిపాం. అయితే అవుకు టన్నెల్‌, గోరుకల్లు వద్ద పనులు పూర్తి కాలేదు. దీంతో పూర్తిస్థాయిలో నీటిని వదలడానికి సాధ్యపడటం లేదు. వీటికి సంబంధించిన పనులన్నీ పూర్తయితే  80 వేల క్యూసెక్కుల వరకు నీటిని తరలించవచ్చు. ఈ పనులు వివిధ దశల్లో ఉన్నాయి.

- మనోహర్‌రాజు, ఈఈ, టీజీబీ డిస్ట్రిబ్యూటరీ 1, నంద్యాల

Updated Date - 2022-08-07T04:16:30+05:30 IST