అతి చిన్న ఇంట్లో 24 గంటలు

ABN , First Publish Date - 2021-01-27T07:58:56+05:30 IST

ఇరవై ఐదు చదరపు అడుగుల వైశాల్యం ఉన్న ఇంటిలో ఇరవై నాలుగు గంటలు గడపడం సాధ్యమా! సరిగ్గా నిలబడలేము.

అతి చిన్న ఇంట్లో 24 గంటలు

ఇరవై ఐదు చదరపు అడుగుల వైశాల్యం ఉన్న ఇంటిలో ఇరవై నాలుగు గంటలు గడపడం సాధ్యమా! సరిగ్గా నిలబడలేము. పూర్తిగా కాళ్లు చాపుకుని పడుకోలేము. ఓ గంట అందులో గడిపితే ఉక్కిరిబిక్కిరవుతాము. అయితే ర్యాన్‌ ట్రహన్‌ ఆ సవాలును స్వీకరించాడు. సరిగ్గా ఇరవై నాలుగు గంటలు అందులో ఉన్నాడు. గడపడమంటే ఏదో కూర్చొని రావడం కాదు... అందులోనే కాలకృత్యాలు తీర్చుకుని, అందులోనే వంట చేసుకుని తిని, పడుకుని లేవాలి. అబ్బో... ఊహించుకొంటేనే ఊపిరాడడంలేదు కదూ! కానీ ర్యాన్‌ విజయవంతంగా అవన్నీ చేసి బయటకు వచ్చాడు. చక్రాలపై ఉండే ఈ ఇంటిని ‘ఎయిర్‌ బీఎన్‌బీ’ అని పిలుస్తారు. అంటే ‘ఎయిర్‌, బెడ్‌, బ్రేక్‌ఫాస్ట్‌’ అనమాట. 


ఇంతకీ ఎవరీ ర్యాన్‌? అతడు ప్రముఖ యూట్యూబర్‌. తన పేరు మీదే యూట్యూబ్‌ ఛానల్‌ నిర్వహిస్తున్నాడు. ఆ చిన్న ఇంటిలోకి అడుగు పెట్టింది మొదలు... బయటకు వచ్చే వరకు తన కార్యకలాపాలన్నింటినీ వీడియో తీసి, దాన్ని ఓ పది నిమిషాలకు కుదించి యూట్యూబ్‌లో పోస్ట్‌ చేశాడు. ఇప్పుడది వైరల్‌గా మారింది. ర్యాన్‌ మాటల్లో చెప్పాలంటే... ‘ఆ ఇంట్లో స్టవ్‌, టాయిలెట్‌, కుళాయి, లైట్ల వంటి సౌకర్యాలున్నాయి. చిన్న చిన్న కిటికీల నుంచి గాలి, వెలుతురు ప్రసరిస్తాయి. నిజంగా ప్రపంచంలోకెల్లా ఇదే చిన్న ఇల్లు. అంత చిన్న ఇంట్లో ఇరవై నాలుగు గంటలు గడిపానంటే నమ్మలేకపోతున్నా’’ అంటున్న ర్యాన్‌ ఆ ఇంట్లోకి వచ్చిన స్నేహితులతో కలిసి పిజ్జా కూడా ఆస్వాదించాడు. ఈ సందర్భంగా ఆ ఇంటిని డిజైన్‌ చేసిన జెఫ్‌ను పరిచయం చేశాడు. మొత్తానికి అతడి ఫీట్‌కు నెటిజనులు అభినందనల జల్లు కురిపించారు.

Updated Date - 2021-01-27T07:58:56+05:30 IST