24 గంటలు

ABN , First Publish Date - 2020-07-20T05:53:15+05:30 IST

ఏదో ఒకటి జరగకుండా ఎలా ఉంటుంది ఇరవై నాలుగు గంటలు ఎలా వెళ్తాయి ఆకు రాలుతుంది గడ్డి ఊగుతుంది కొన్ని గుడ్లు పెడతాయి...

24 గంటలు

ఏదో ఒకటి జరగకుండా ఎలా ఉంటుంది

ఇరవై నాలుగు గంటలు

ఎలా వెళ్తాయి

ఆకు రాలుతుంది

గడ్డి ఊగుతుంది

కొన్ని గుడ్లు పెడతాయి

కొన్ని పిల్లలు చేస్తాయి

గోడలు పగులుతాయ్‌

మర్రిచెట్టు ఊడ ఒకటి పాకుతుంది

చీమపుట్టలో పాము, దర్జాగా

గృహప్రవేశం చేస్తుంది


చెట్టులో ఉన్న పూలు

తల్లో చేరుతాయి


ఎన్నో సంగమాలు

పిల్లలు పుడతారు

శవాల్ని కడిగే కన్నీళ్లు

ఆవిరయ్యే నీళ్లు


ఇరవై నాలుగు గంటలు

ఎలా నడుస్తాయి

సూరీడు ఓ ఇంట్లో దూరి

పసిబిడ్డతో దాగుడుమూతలు ఆడుతాడు

ఆకలి పుడుతుంది

పొయ్యి మండుతుంది

ఒకడు ప్రేమలో పడతాడు

ఒకటి మాయలో పడుతుంది


ఎండిన వాగు ఒకటి దిగులు పడుతుంది

పండిన పైరు పాట పాడుతుంది

ఎప్పుడో

ప్రయాణం మొదలుపెట్టిన నత్త ఒకటి

గమ్యం చేరుతుంది


చేపలు వల్లో పడతాయి

రాలిన పురుగుల్ని చూసి

దీపం బాధగా వెలుగుతుంది


ఉన్నటుండి

గాలి గదిలో ఉన్న పుస్తకాన్ని తిప్పి

నాలుగు వాక్యాలు రాసి పోతుంది


అక్కడెక్కడో పుట్టిన పాట

నిశ్శబ్దాన్ని ధ్వంసం చేస్తుంది

సుంకర గోపాలయ్య

94926 38547


Updated Date - 2020-07-20T05:53:15+05:30 IST