24 గంటల కరెంటు ఉత్తదే!

ABN , First Publish Date - 2022-08-19T05:12:56+05:30 IST

‘‘రాష్ట్రంలో కరెంటు కోతల బాధలు పోయినయ్‌. గతంలో కరెంట్‌ ఎప్పుడొస్తుందో..ఎప్పుడు పోతుందో తెలియదు.

24 గంటల కరెంటు ఉత్తదే!
మెదక్‌ సబ్‌స్టేషన్‌లోని విద్యుత్‌ టవర్లు

12 గంటలకు మించని త్రీ ఫేజ్‌ విద్యుత్‌ సరఫరా

పంటలు ఎండుతాయని అన్నదాతల ఆందోళన 

సక్రమంగా నీరందక తడి ఆరుతున్న పొలాలు

జాప్రతినిధులు స్పందించాలని రైతన్నల డిమాండ్‌

 

  ఆంధ్రజ్యోతిప్రతినిధి, మెదక్‌, ఆగస్టు 18 :  ‘‘రాష్ట్రంలో కరెంటు కోతల బాధలు పోయినయ్‌. గతంలో కరెంట్‌ ఎప్పుడొస్తుందో..ఎప్పుడు పోతుందో తెలియదు. ఎన్ని మోటార్లు కాలుతాయో.. ఎన్ని ట్రాన్స్‌ఫార్మర్లు కాలేవో.. వేసిన పంట పండుతుందో లేదో తెలియదు. కానీ ఈ నాడు 24 గంటలు అత్యుత్తమమైన ఓల్టేజీతో ఇండియాలో కరెంట్‌ సప్లయ్‌ చేస్తున్న ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ’’. ఈ మాటలు అన్నది ఎవరో సాదాసీదా వ్యక్తి కాదు.. ఈ నెల 16న వికారాబాద్‌ సభలో  రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ మాట్లాడిన మాటలివి. కానీ మెదక్‌ జిల్లాలో పరిస్థితి మాత్రం సీఎం మాటలకు పూర్తి విరుద్ధంగా ఉన్నది. మెదక్‌ జిల్లాలో ఎక్కడా కూడా వ్యవసాయానికి రోజులో 12 గంటలకు మించి ఉచిత కరెంట్‌ రావడం లేదని రైతులు చెబుతున్నారు. జిల్లాలో కొన్నిచోట్ల ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు కరెంట్‌ సరఫరా చేస్తే.. మరికొన్ని ప్రాంతాల్లో ఉదయం 7 నుంచి రాత్రి 7 వరకు మాత్రమే త్రీఫేజ్‌ కరెంట్‌ సరఫరా చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాంకేతిక లోపాలు, మరమ్మతులు వంటి కారణాల వల్ల రోజులో కనీసం గంట నుంచి రెండు గంటల పాటు విద్యుత్‌ సరఫరాలో కోత విధిస్తున్నారని రైతాంగం ఏకరువు పెడుతున్నది. ప్రస్తుత ఖరీఫ్‌ సీజన్‌లో వర్షాలు సమృద్ధిగా పడటంతో నీటి నిల్వలు పెరిగి పంటలకు పెద్దగా సమస్యలు రావడం లేదు. కానీ బోర్లపై ఆధారపడి సాగు చేసుకుంటున్న రైతాంగానికి అవసరమైన కరెంట్‌ సరఫరా జరగకపోవడం ఇబ్బందిగా మారింది. 


బోరుబావులపై ఆధారపడి 1.30 లక్షల ఎకరాల్లో సాగు

మెదక్‌ జిల్లాలో ఎక్కువ మంది రైతులు బోరుబావులపై ఆధారపడి వ్యవసాయం చేస్తున్నారు. ప్రాజెక్టులు, కాలువలు లేకపోవడంతో బోరు బావులే దిక్కయ్యాయి. జిల్లాలో 21 మండలాల పరిధిలో దాదాపు లక్ష వరకు వ్యవసాయ బోరు బావులు ఉన్నాయి. వీటిపై ఆధారపడి సుమారు 1.30 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేస్తున్నారు. వర్షాకాలం కావడంతో ఆశించిన మేరకు నీటి వసతి ఉంది. దీంతో మెజార్టీ రైతులు వరినే సాగు చేస్తున్నారు. బోర్ల కింద పంటలు కూడా పూర్తిస్థాయిలో సాగుచేశారు. కానీ అంతరాయం లేకుండా త్రీఫేజ్‌ విద్యుత్‌ సరఫరా జరిగితేనే పంటకు సరిపడా నీరందుతుంది. లేకుంటే పంటలు దెబ్బతినే అవకాశం ఉన్నది. రెండు నెలలుగా వ్యవసాయానికి సరఫరా చేస్తున్న త్రీఫేజ్‌ విద్యుత్‌లో కోతలు విధిస్తున్నారు. బ్రేక్‌డౌన్‌, ట్రిప్‌ అవడం వంటి కారణాల వలన రోజులో కనీసం రెండు గంటల పాటు కోత తప్పడం లేదని రైతులు వాపోతున్నారు. పది నుంచి 12 గంటల పాటు త్రీఫేజ్‌ విద్యుత్‌ సరఫరా చేస్తే రాత్రి వేళల్లో సింగిల్‌ ఫేజ్‌ విద్యుత్‌ సరఫరా చేస్తున్నారు. పూర్తి స్థాయిలో కరెంట్‌ అందకపోవడం వలన బోర్ల కింద సాగు చేస్తున్న పంటలకు సరిపడా నీరందడం లేదు. పరిస్థితి ఇలాగే ఉంటే పంటలు దెబ్బతిని తీవ్రంగా నష్టపోతామని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్‌ శాఖ ఎస్‌ఈ జానకీరాం మాత్రం జిల్లాలో అసలు ఎలాంటి కరెంట్‌ సమస్యలు లేవని, అంతా సవ్యంగా ఉందని చెబుతున్నారు. కానీ శివ్వంపేట మండలం చెన్నాపూర్‌లో రైతులు కోతలు లేని త్రీఫేజ్‌ కరెంట్‌ సరఫరా చేయాలని డిమాండ్‌ చేస్తూ ఆందోళన నిర్వహించడం గమనార్హం. అధికారుల, ప్రజాప్రతినిధులు స్పందించి 24 గంటల పాటు త్రీఫేజ్‌ ఉచిత విద్యుత్‌ అందేలా చూడాలని రైతులు కోరుతున్నారు. 


12 గంటలే కరెంట్‌ సరఫరా

- శివకుమార్‌, ఔరంగాబాద్‌ తండా, హవేళిఘనపూర్‌ 

ప్రతి రోజూ 12 గంటలు మాత్రమే విద్యుత్‌ సరఫరా అవుతుంది. బోరు బావులపై ఆధారపడి పంటలు సాగు చేసుకుంటున్న వ్యవసాయదారులకు ఇబ్బందిగా మారింది. పంటకు నీరందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. మండల విద్యుత్‌ అధికారులను సంప్రదిస్తే ఉన్నతాధికారులు చెప్పిన విధంగానే కరెంట్‌ ఇస్తున్నామంటున్నారు. 24 గంటలు కరెంట్‌ సరఫరా జరిగేలా ప్రజాప్రతినిధులు చొరవ చూపాలి. 


మోటార్లు కాలుతున్నాయి 

- మీనాజిపేట పెంటయ్య, శివ్వంపేట

కరెంట్‌ సరఫరాలో తరచూ కోతలు విధిస్తున్నారు. వ్యవసాయ బావుల దగ్గర మోటార్లు కాలిపోతున్నాయి. 4 నెలల కాలంలో మాబావి దగ్గర మూడుసార్లు మోటారు కాలిపోయింది. మోటర్‌ కాలిపోయిన ప్రతిసారి బావిలో  నుంచి పైకి లాగడం, మోటర్‌ను బాగుచేయించిన తర్వాత మళ్లీ బావిలోకి దించడం ఇబ్బందికరంగా మారింది. రిపేర్లకు రూ.15వేల వరకు ఖర్చు చేశాను. 





Updated Date - 2022-08-19T05:12:56+05:30 IST