మక్కా, మదీనాలో 24 గంట‌ల క‌ర్ఫ్యూ !

ABN , First Publish Date - 2020-04-03T17:10:25+05:30 IST

గ‌ల్ఫ్ దేశాల్లోనూ మ‌హ‌మ్మారి క‌రోనావైర‌స్‌(కొవిడ్‌-19) శ‌ర‌వేగంగా విస్తరిస్తోంది.

మక్కా, మదీనాలో 24 గంట‌ల క‌ర్ఫ్యూ !

రియాధ్‌: గ‌ల్ఫ్ దేశాల్లోనూ మ‌హ‌మ్మారి క‌రోనా వైర‌స్‌(కొవిడ్‌-19) శ‌ర‌వేగంగా విస్తరిస్తోంది. ఈ వైర‌స్ ప్ర‌భావం సౌదీ అరేబియా, ఖ‌తార్‌, యూఏఈలో తీవ్రంగా ఉంది. సౌదీలో ఇప్ప‌టివ‌ర‌కు ఈ మ‌హ‌మ్మారి బారిన‌ప‌డిన వారి సంఖ్య 1,885 కాగా, 21 మంది మ‌ర‌ణించారు. వైర‌స్ వ్యాప్తి, నియంత్ర‌ణ‌కు ఇప్ప‌టికే సౌదీ కఠిన చ‌ర్య‌లు చేప‌ట్టింది. జ‌నాల‌ను పూర్తిగా ఇళ్ల‌కే ప‌రిమితం చేయ‌డంతో పాటు ప్ర‌యాణాల‌పై ఆంక్ష‌లు విధించింది. అంత‌ర్జాతీయ విమాన స‌ర్వీసుల‌ను పూర్తిగా ర‌ద్దు చేసింది. మ‌సీదులు, మాల్స్‌, పార్క్స్‌ మూసివేసింది. బ‌హిరంగ ప్ర‌దేశాల్లో జ‌న‌స‌మూహాల‌ను నిషేధించింది. దీనిలో భాగంగానే తాజాగా సౌదీ మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. గురువారం నాడు పవిత్ర నగరాలైన‌ మక్కా, మదీనాల‌లో 24 గంట‌ల పాటు క‌ర్ఫ్యూ విధిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. 


అయితే కార్మికులు, నివాసితులకు నిత్యావ‌స‌ర స‌రుకులు కొనుగోలు చేయ‌డానికి, వైద్యం కోసం కొన్ని మినహాయింపులు ఉన్నాయని అంతర్గత వ్యవహారాల శాఖ తెలిపింది. ఇక వైర‌స్ వ్యాప్తిని అరిక‌ట్టేందుకు మ‌క్కా, మ‌దీనా నగరాలలోని జిల్లాల్లో తిరిగే కార్లలో ఒకే వ్య‌క్తి మాత్ర‌మే వెళ్లాల‌ని పేర్కొంది. ఇప్ప‌టికే ఉమ్రా యాత్ర‌ను ఏడాది పొడవునా ర‌ద్దు చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించిన సౌదీ స‌ర్కార్‌.. ఈసారి హజ్‌యాత్ర ప్రణాళికను ఆలస్యంగా రూపొందించుకోవాలని ముస్లింలకు విజ్ఞప్తి చేసిన విష‌యం తెలిసిందే. తాము స్పష్టతనిచ్చేవరకు ట్రావెల్‌ కంపెనీలతో ఒప్పందాలు చేసుకోవద్దని సౌదీ మంత్రి మహ్మద్‌ సలెహ్‌ బిన్‌ తాహెర్‌ సూచించారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ముస్లింల భద్రత దృష్ట్యా తాము ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.

Updated Date - 2020-04-03T17:10:25+05:30 IST