Canada లో భారత యువకుడి దారుణ హత్య.. Indian సమాజం ఏం చెబుతుందంటే..

ABN , First Publish Date - 2021-09-09T18:14:37+05:30 IST

ఉపాధి కోసం కెనడా వెళ్లిన భారత యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు.

Canada లో భారత యువకుడి దారుణ హత్య.. Indian సమాజం ఏం చెబుతుందంటే..

టోరంటో: ఉపాధి కోసం కెనడా వెళ్లిన భారత యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. పంజాబ్ రాష్ట్రం మొగాకు చెందిన 23 ఏళ్ల ప్రభజోత్ సింగ్ కత్రిని అతను నివాసముండే నోవా స్కాటియాలోని ట్రూరో నగరంలోని అపార్ట్‌మెంట్‌లో కొందరు గుర్తు తెలియని దుండగులు దారుణంగా కొట్టి వదిలేసిపోయారు. తీవ్ర గాయాలతో ఉన్న ప్రభజోత్ సింగ్‌ను చూసిన అపార్ట్‌మెంట్ వాసులు పోలీసులకు సమాచారం అందించారు. వారి సమాచారంతో అక్కడి చేరుకున్న పోలీసులు కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న ప్రభజోత్ సింగ్‌ను ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అతడు చనిపోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న ట్రూరో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.   


ఇవి కూడా చదవండి..

18 దేశాల్లోని ఈ 50 నగరాలకు భారతీయులు వెళ్లొచ్చు..

Chicago: విమానం మిస్ చేసుకున్న మహిళ.. కన్నింగ్‌ ఐడియాతో అధికారులకు చుక్కలు!


ట్రూరో పోలీస్ అధికారి డేవిడ్ మాక్ నీల్ మాట్లాడుతూ.. ఆదివారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో తమకు 911 ద్వారా ట్రూట్ నగర పరిధిలోని 494 రాబీ స్ట్రీట్ నుంచి ఓ ఫోన్ కాల్ వచ్చిందన్నారు. దాంతో హూటాహూటిన ఘటనాస్థలికి చేరుకున్న తాము ఓ వ్యక్తి తీవ్ర గాయాలతో పడి ఉండడం చూసి వెంటనే చికిత్స కోసం ఆస్పత్రికి తరలించామని చెప్పారు. కానీ అక్కడ చికిత్స పొందుతూ అతడు చనిపోయినట్లు తెలిపారు. మృతుడిని ప్రభజోత్ సింగ్ కత్రిగా గుర్తించామని చెప్పిన మాక్ నీల్.. లేటన్స్ ట్యాక్సీతో పాటు ట్రూరోలోని రెండు మూడు రెస్టారెంట్స్‌లో సింగ్ పని చేస్తున్నట్లు తెలిసిందన్నారు. ఇది నరహత్యగానే తాము భావిస్తున్నామని, కేసు దర్యాప్తు కొనసాగుతుందన్నారు. 


ఇదిలాఉంటే.. అక్కడి భారత సమాజం మాత్రం ఇది కచ్చితంగా జాతివివక్ష హత్య అని పేర్కొంది. విద్వేషపూరితంగానే కొందరు దుండగులు దాడి చేసి మరీ చంపేశారని ఇండియన్ కమ్యూనిటీ తెలిపింది. ప్రభజోత్ సింగ్ కత్రి సౌమ్యుడని, తన పని తాను చూసుకునేవాడని అతని స్నేహితులు చెప్పారు. అందరీతో కలిసిమెలిసి ఉండే సింగ్ ఇలా దారుణ హత్యకు గురికావడం తమను తీవ్రంగా కలిచి వేసిందన్నారు. ప్రభజోత్ సింగ్ మృతదేహాన్ని భారత్‌కు తరలించేందుకు 'గోఫండ్‌మీ' ద్వారా నిధులు సేకరిస్తున్నట్లు భారత కమ్యూనిటీ వెల్లడించింది.   



Updated Date - 2021-09-09T18:14:37+05:30 IST