22లోగా మూల్యాంకనం పూర్తిచేయాలి

ABN , First Publish Date - 2022-05-19T06:37:37+05:30 IST

22లోగా మూల్యాంకనం పూర్తిచేయాలి

22లోగా మూల్యాంకనం పూర్తిచేయాలి

- జూన్‌ రెండో వారంలో టెన్త్‌ ఫలితాలు

- ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్‌ డి.దేవానందరెడ్డి

మచిలీపట్నం టౌన్‌, మే18 : ఆంధ్రప్రదేశ్‌లో టెన్త్‌ జవాబు పత్రాల మూల్యాంకనాన్ని ఈ నెల 22వ తేదీలోగా పూర్తి చేయాలని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరక్టర్‌ డి.దేవానందరెడ్డి ఆదేశించారు. బుధవారం జిల్లా కేంద్రమైన మచిలీపట్నం సెయింట్‌ ఫ్రాన్సెస్‌ హైస్కూల్‌ ఏర్పాటు చేసిన టెన్త్‌ స్పాట్‌ వాల్యుయేషన్‌ శిబిరాన్ని దేవానందరెడ్డి సందర్శించారు. మూల్యాంకనం చేస్తున్న ఉపాధ్యాయులతో మాట్లాడారు. జిల్లా విద్యాశాఖాధికారి, క్యాంపు ఆఫీసరు తాహెరా సుల్తానా, డిప్యూటీ క్యాంపు ఆఫీసర్‌ లలితా మోహన్‌, పరీక్షల అసిస్టెంట్‌ కమిషనర్‌ గూడూరు శ్రీనివాసరావు, డీవైఈవో యూవీసుబ్బారావు, సూపరింటెండెంట్‌ పి.వెంకటేశ్వరరావు, బందరు ఎంఈవో దుర్గాప్రసాద్‌ తదితరులతో దేవానందరెడ్డి చర్చలు జరిపారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ నెల 22 లోగా జవాబు పత్రాల మూల్యాంకనాన్ని ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేస్తారన్నారు. జూన్‌ రెండో వారంలో పదో తరగతి పరీక్షా ఫలితాలు ప్రకటిస్తామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 13 టెన్త్‌స్పాట్‌ వాల్యుయేషన్‌ కేంద్రాల్లో ఇప్పటికి ఆరు శిబిరాలను సందర్శించానన్నారు. ఈ ఏడాది పూర్వ జిల్లాల్లోని జిల్లా ప్రధాన కేంద్రాల్లో మూల్యాంకన శిబిరాలు ఏర్పాటు చేశామని, వచ్చే విద్యాసంవత్సరం నుంచి 26జిల్లాల ప్రధాన కేంద్రాల్లో టెన్త్‌ స్పాట్‌ వాల్యుయేషన్‌ కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు. మచిలీపట్నంతో పాటు విజయవాడలో రానున్న సంవత్సరంలో మూల్యాంకన శిబిరాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఆరులక్షల 22 వేల 530మంది విద్యార్థులు పరీక్షలు రాసారన్నారు. 44 లక్షల, 18 వేల జవాబు పత్రాలను మూల్యాంకనం చేసేందుకు సీఈలు, ఏఈలు, స్పెషల్‌ అసిస్టెంట్లు 20 వేలమందిని నియమించామన్నారు. వేసవికాలాన్ని దృష్టిలో ఉంచుకుని శిబిరాల్లో తాగునీటి వసతి సౌకర్యాన్ని ఏర్పాటు చేశారన్నారు. గదుల్లో ఫ్యాన్లు, లైట్లు ఏర్పాటు చేశారన్నారు. దేవానందరెడ్డికి వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. మూల్యాంకన పత్రాలకు ఇచ్చే చెల్లింపులు పెంచాలని కోరారు. ఇందుకు దేవానందరెడ్డి సానుకూలంగా స్పందించారు. రానున్న విద్యాసంవత్సరంలో మూల్యాంకన చెల్లింపులు పెంచుతామని హామీ ఇచ్చారు. 

Updated Date - 2022-05-19T06:37:37+05:30 IST