ఒక్కరోజే 2,293!

ABN , First Publish Date - 2021-05-06T05:33:47+05:30 IST

జిల్లాను కరోనా కమ్మేస్తోంది. అక్కడా...ఇక్కడా అనే వ్యత్యాసం లేకుండా అన్ని ప్రాంతాల్లోనూ విజృంభిస్తోంది.

ఒక్కరోజే 2,293!

భారీగా పెరుగుతున్న కరోనా కేసులు

మొత్తం 89,805

చికిత్స పొందుతూ మరో 11 మంది మృతి

655కు చేరిన మృతుల సంఖ్య

సర్వత్రా ఆందోళన

కరోనా బారిన న్యాయవాదులు 

రెండు వారాల్లో 20 మంది మృతి


విశాఖపట్నం, ఏప్రిల్‌ 5 (ఆంధ్రజ్యోతి) : జిల్లాను కరోనా కమ్మేస్తోంది. అక్కడా...ఇక్కడా అనే వ్యత్యాసం లేకుండా అన్ని ప్రాంతాల్లోనూ విజృంభిస్తోంది. దీంతో రోజురోజుకూ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. బుధవారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో 2,293 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. జిల్లాలో కరోనా కేసుల సంఖ్య రెండు వేల మార్కును దాటడం ఇదే తొలిసారి. 

గత ఏడాది మార్చి 19న మొదటి పాజిటివ్‌ కేసు నమోదైంది. అప్పటి నుంచి క్రమంగా పెరిగాయి. మొదటి దశలో ఆగస్టు రెండో తేదీన అత్యధికంగా 1,227 కేసులు నమోదయ్యాయి. ఆ తరువాత కేసులు నెమ్మదిగా తగ్గుతూ వచ్చాయి. చివరిగా, ఈ ఏడాది మార్చి ఒకటో తేదీన అత్యల్పంగా ఒకే ఒక్క కేసు నమోదైంది. దీంతో జిల్లాలో వైరస్‌ పూర్తిగా తగ్గినట్టేనని అంతా భావించారు. అయితే, రెండో దశ వ్యాప్తి అప్పటి నుంచే ప్రారంభమైందని ఆ తరువాత గానీ తెలియలేదు. మార్చి రెండో తేదీ నుంచి మెల్లగా కేసుల్లో పెరుగుదల ప్రారంభమైంది. ఏప్రిల్‌ నెలాఖరుకు వచ్చేసరికి వైరస్‌ విజృంభణ ప్రారంభమైంది. గత నెల 24 నుంచి ప్రతిరోజూ వేయికిపైగా కేసులు నమోదవుతున్నాయి.   గత నెల 30వ తేదీన 1358 కేసులు నమోదుకావడంతో మొదటివేవ్‌లో రికార్డు (1227) కూడా చెరిగిపోయింది. ఆ తరువాత కూడా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. మంగళవారం 1,976 కేసులు రాగా, బుధవారం ఏకంగా రికార్డు స్థాయిలో 2,293 వచ్చాయి. వీటితో జిల్లాలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 89,805కు చేరింది. 


భారీగా మరణాలు

పాజిటివ్‌ కేసులతోపాటు బుధవారం మరణాలు ఎక్కువగానే ఉన్నాయి. మొదటి, రెండో దశల్లో ఒక్కరోజులో అత్యధిక మరణాలు ఇప్పటివరకు తొమ్మిదిగా ఉన్నాయి. అయితే, మొదటిసారిగా బుధవారం 11 మంది మరణించినట్టు అధికారులు ప్రకటించారు. వీటితో జిల్లాలో కొవిడ్‌ బారినపడి మృతిచెందిన వారి సంఖ్య 655కు చేరింది. 


1195 మంది డిశ్చార్జి

బుధవారం డిశ్చార్జులు భారీగానే జరిగాయి. చికిత్స పొందుతున్న వారిలో 1,195 మంది కోలుకున్నారు. ఒక్కరోజులో వేయి మందికిపైగా కోలుకోవడం ఇదే తొలిసారి. వీటితో జిల్లాలో మొత్తం రికవరీల సంఖ్య 73,947కు చేరింది. ప్రస్తుతం జిల్లాలో 15,203 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. 


కరోనా బారిన న్యాయవాదులు 

కరోనా బారినపడి న్యాయవాదులు పదుల సంఖ్యలో చనిపోతున్నారు. గత రెండు వారాల్లో జిల్లాలో 20 మంది మరణించారు. కరోనా నేపథ్యంలో ప్రస్తుతం కేసులను వీడియో సమావేశాల ద్వారానే విచారిస్తున్నారు. అయితే కక్షిదారులతో సంప్రతింపులు, అవసరమైన పత్రాల సేకరణ, సమర్పణ వంటి కార్యక్రమాలకు న్యాయవాదులు కోర్టు కార్యాలయానికి వెళుతున్నారు. చాలామందిని కలవాల్సి వస్తోంది. దీంతో పలువురు కరోనాబారిన పడుతున్నారు. వెంటనే తగిన చికిత్స లభించకపోవడం, మరికొందరికి ఇతర ఆరోగ్య సమస్యలు కూడా వుండడంతో మరణిస్తున్నారు. జిల్లాలో విశాఖపట్నం, అనకాపల్లి, చోడవరం, నర్సీపట్నం, గాజువాక తదితర ప్రాంతాల్లో ఇప్పటివరకు 40 మంది వరకు న్యాయవాదులు మరణించారు. గత రెండు వారాల్లో 20 మంది చనిపోయారు. ఒక్క మంగళవారమే ముగ్గురు మరణించారు. వారిలో పేరొందిన లంక జగన్నాథం కూడా ఒకరు.


15న వ్యాక్సిన్‌: మహేశ్వరరెడ్డి, అధ్యక్షులు, విశాఖ బార్‌ అసోసియేషన్‌

న్యాయవాదులు వరుసగా కరోనాతో చనిపోతుండడంతో విశాఖపట్నం బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు మహేశ్వరరెడ్డి విషయాన్ని కలెక్టర్‌ వినయ్‌చంద్‌ దృష్టికి తీసుకువెళ్లారు. న్యాయవాదులకు ప్రత్యేక సదుపాయాలు కల్పించాలని కోరారు. దానికి స్పందించిన ఆయన..గాయత్రి ఆస్పత్రిలో న్యాయవాదుల కోసం 25 పడకలు కేటాయిస్తామని చెప్పారు. అలాగే ఈ నెల 15న జిల్లా కోర్టు ప్రాంగణంలో కొవిడ్‌ వ్యాక్సిన్‌ కార్యక్రమం చేపడతామని హామీ ఇచ్చారు.


కరోనాతో 24 గంటల్లో దంపతులు మృతి

అచ్యుతాపురం, మే 5: కరోనా వృద్ధ దంపతులను పొట్టన పెట్టుకుంది. మండలంలోని గురజాపాలేనికి చెందిన భార్య, భర్త 24 గంటల వ్యవధిలోనే మృతిచెందారు. సెజ్‌ పునరావాస కాలనీ (దిబ్బపాలెం పంచాయతీ) గురజాపాలేనికి చెందిన లాలం సత్యంనాయుడు (65), ఆయన భార్య సీత (60)లకు కరోనా సోకింది. దీంతో ఈ నెల మూడో తేదీన విశాఖలోని ఓ ఆస్పత్రిలో చేరారు. అక్కడ చికిత్స పొందుతూ సత్యంనాయుడు మంగళవారం మరణించగా, సీత బుధవారం కన్నుమూశారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. 


Updated Date - 2021-05-06T05:33:47+05:30 IST