2269 కేసులు... ఆరు మరణాలు

ABN , First Publish Date - 2021-05-09T07:15:17+05:30 IST

జిల్లాలో శుక్ర, శనివారాల నడుమ 24 గంటల్లో 2269 మందికి కరోనా సోకగా అదే వ్యవధిలో ఆరుగురు మృతిచెందినట్టు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన బులెటిన్‌ పేర్కొంది.

2269 కేసులు... ఆరు మరణాలు
స్విమ్స్‌లోని పద్మావతి కొవిడ్‌ ఆస్పత్రికి చికిత్స కోసం వెళుతున్న బాధితుడు

తిరుపతి, మే 8 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో శుక్ర, శనివారాల నడుమ 24 గంటల్లో 2269 మందికి కరోనా సోకగా అదే వ్యవధిలో ఆరుగురు మృతిచెందినట్టు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన బులెటిన్‌ పేర్కొంది. తాజా కేసులు, మరణాలతో ఇప్పటివరకూ నమోదైన మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 137768కు చేరుకోగా మరణాలు 1022కు చేరాయి. కాగా శనివారం ఉదయానికి యాక్టివ్‌ పాజిటివ్‌ల సంఖ్య 21248కు చేరింది.కొత్తగా గుర్తించిన కేసులు తిరుపతి నగరంలో 487, తిరుపతి రూరల్‌లో 198, చిత్తూరులో 182, శ్రీకాళహస్తిలో 118, మదనపల్లెలో 116, పుత్తూరులో 104, ఐరాలలో 79, రేణిగుంటలో 74, పలమనేరులో 62, పుంగనూరులో 58, కుప్పం, పీలేరుల్లో 55 వంతున, ఏర్పేడులో 45, బంగారుపాలెంలో 34, వడమాలపేటలో 30, చంద్రగిరిలో 28, నగరిలో 26, గంగవరం, నారాయణవనం, పూతలపట్టు మండలాల్లో 21 వంతున, పాకాల, పులిచెర్ల మండలాల్లో 18 వంతున, రామకుప్పంలో 17, రామసముద్రం, శాంతిపురం మండ లాల్లో 16 చొప్పున, సోమల, జీడీనెల్లూరు మండలాల్లో 15 వంతున, రొంపిచెర్ల, పెద్దపంజాణి, వాల్మీకిపురం, కార్వేటినగరం, తవణంపల్లె మండలాల్లో 12 వంతున, బి.కొత్తకోట, చౌడేపల్లె, రామచంద్రాపురం, గుడుపల్లె, తంబళ్ళపల్లె, నాగలాపురం మండలాల్లో 11 చొప్పున, కలికిరి, సదుం, పెనుమూరు, సత్యవేడు, చిన్నగొట్టిగల్లు, గుడిపాల మండలాల్లో 10 వంతున నమోదయ్యాయి.


రుయాలో ఆక్సిజన్‌ బెడ్లు దొరక్క ఇద్దరు మృతి


తిరుపతి రుయాస్పత్రిలో ఆక్సిజన్‌ బెడ్లు లభించక ఆవరణలోనే ఇద్దరు కొవిడ్‌ బాధితులు శనివారం మృతి చెందారు. రామసముద్రం మండలం గజ్జలవారిపల్లెకు చెందిన రేషన్‌ డీలరు గజ్జెల రవీంద్ర (52) కరోనా సోకడంతో శుక్రవారం మదనపల్లె ప్రభుత్వాస్పతికి వెళ్ళారు. శ్వాస తీసుకునేందుకు ఇబ్బందిగా వుందని చెప్పినా ఆక్సిజన్‌ బెడ్లు అందుబాటులో లేకపోవడంతో వైద్యాధికారుల సలహా మేరకు రుయాస్పత్రికి వచ్చారు. అక్కడా ఆక్సిజన్‌ బెడ్డు ఖాళీ లేదని చెప్పడంతో నిరీక్షిస్తూ ఊపిరాడని స్థితిలో శనివారం వేకువజామున ఆస్పత్రి ఆవరణలోనే మృతి చెందారు.రేణిగుంట మండలం గురవరాజుపల్లెకు చెందిన రిటైర్డు పోలీసు పి.వెంకట్రమణ సైతం కొవిడ్‌ సోకడంతో ఊపిరాడని స్థితిలో అంబులెన్సులో శనివారం మధ్యాహ్నం రుయాకు చేరుకున్నారు. మధ్యాహ్నం 2 గంటల సమయానికి ఆస్పత్రిలో క్సిజన్‌ బెడ్లు 11 ఖాళీగా వున్నాయని బోర్డులో డిస్‌ప్లే బోర్డు వెల్లడిస్తున్నా బెడ్లు ఖాళీ లేవన్న సమాధానం సిబ్బంది నుంచీ వచ్చింది. దీంతో సుమారు రెండున్నర గంటల పాటు అక్కడే వేచి చూస్తూ శ్వాస ఆడక అంబులెన్సులోనే వెంకట్రమణ చనిపోయారు. దీంతో ఆయన కుటుంబీకులు, బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు.


మాజీ జడ్పీటీసీ, టీడీపీ నేత మృత్యువాత


కురబలకోట మండలం మద్దిరెడ్డిగారిపల్లెకు చెందిన మాజీ జడ్పీటీసీ ధనలక్ష్మి (53) కరోనాతో బెంగుళూరులో చికిత్స పొందుతూ శనివారం మధ్యాహ్నం మరణించారు. ఆమె గతంలో టీడీపీ తరపున జడ్పీటీసీగా ఎన్నికవగా తర్వాత వైసీపీలో చేరారు. శ్రీకాళహస్తి పట్టణం పూసల వీధికి చెందిన టీడీపీ నేత బాలిశెట్టి వర్మ (41) కరోనాతో తిరుపతి పద్మావతీ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూ శనివారం ఉదయం మృతిచెందారు.



ప్రభుత్వ కొవిడ్‌ సెంటర్లలో  696  పడకల ఖాళీ 


తిరుపతిలోని ప్రభుత్వ కొవిడ్‌ ఆస్పత్రులు, కొవిడ్‌ కేర్‌ సెంటర్లలో శనివారం రాత్రి 11గంటలకు 696  బెడ్స్‌ ఖాళీగా ఉన్నాయి.తిరుపతిలోని విష్ణు నివాసంలో 190, శ్రీనివాసంలో 275, రుయాలో 104 (ఆక్సిజన్‌ 8, నాన్‌ ఆక్సిజన్‌ 96), ఈఎస్‌ఐ ఆస్పత్రిలో 72 (ఆక్సిజన్‌ 10, నాన్‌ ఆక్సిజన్‌ 62), ఆయుర్వేద వైద్యశాలలో 5 నాన్‌ ఆక్సిజన్‌ బెడ్స్‌ ఖాళీగా ఉన్నాయి. టీటీడీ ఉద్యోగుల కోసం ఏర్పాటు చేసిన మాధవంలో 50 బెడ్స్‌ ఖాళీగా ఉన్నాయి.

Updated Date - 2021-05-09T07:15:17+05:30 IST