Abn logo
Jun 11 2021 @ 10:25AM

కత్తులతో బెదిరించిన 22 మంది రౌడీల అరెస్టు


ప్యారీస్‌(చెన్నై): ఉత్తర, దక్షిణ చెన్నై ప్రాంతాల్లో కత్తులు చూపించి వ్యాపారులను బెదిరించి దోచుకున్న 22 మంది రౌడీలను అరెస్ట్‌ చేసినట్లు గ్రేటర్‌ చెన్నై పోలీసులు తెలిపారు. మాధవరం పొన్నియమ్మన్‌ నగర్‌లోని ఓ కిరాణా వ్యాపారి కరుప్పుస్వామిపై ఓ రౌడీ ముఠా కత్తులతో దాడికి పాల్పడింది. అనంతరం ఆ ప్రాంతంలో ఉన్న చిల్లర దుకాణాల యజ మానులను బెదిరించి దౌర్జన్యం చేసి మామూళ్ల వసూళ్లకు పాల్పడ్డారు. దీనిపై బాధితులు అందజేసిన ఫిర్యాదుపై విచారణ జరిపిన పోలీసులు, వ్యాసర్పాడికి చెందిన ఛార్లెస్‌, గోకులకృష్ణన్‌, ఏలుమలై,  మహేష్‌లను అదుపులోకి తీసుకుని ఎగ్మూర్‌ మేజిస్ట్రేట్‌ కోర్టులో హాజరుపరచి రిమాండ్‌కు తరలించారు. అదే విధంగా, తాంబరం సమీపంలోని ఇరుం బుళియూర్‌లో ప్రముఖ రౌడీ ఉదయ్‌కుమార్‌ ఈ నెల 7వ తేది తన పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా వేట కొడవలితో కేక్‌ కట్‌ చేయడం స్థానికులను భయాందోళనలకు గురిచేసింది. దీనిపై అందిన ఫిర్యాదు మేరకు పోలీసులు అజిత్‌, ప్రవీణ్‌కుమార్‌, వర్గీస్‌ సహా 17 మంది రౌడీలను అరెస్ట్‌ చేసి, పరారైన ఉదయ్‌కుమార్‌ కోసం తీవ్రంగా గాలిస్తున్నారు.