కెనడాలో కలకలం.. కాల్పుల్లో భారతీయ విద్యార్థి దుర్మరణం..!

ABN , First Publish Date - 2022-04-09T21:13:39+05:30 IST

కెనడాలో ఓ భారతీయ విద్యార్థి తూటాలకు బలయ్యాడు. టొరొంటో నగరంలోని ఓ సబ్‌వే స్టేషన్ ప్రవేశద్వారం వద్ద గురువారం సాయంత్రం జరిగిన కాల్పుల్లో 21 ఏళ్ల కార్తిక్ వాసుదేవ్ తీవ్రంగా గాయపడ్డారు. శరీరంలోకి తూటాలు దూసుకుపోవడంతో కుప్పకూలిపోయాడు. అక్కడే ఉన్న పారామెడికల్ సిబ్బంది ఒకరు..

కెనడాలో కలకలం.. కాల్పుల్లో భారతీయ విద్యార్థి దుర్మరణం..!

టొరొంటో(కెనడా): కెనడాలో ఓ భారతీయ విద్యార్థి తూటాలకు బలయ్యాడు. టొరొంటో నగరంలోని ఓ సబ్‌వే స్టేషన్ ప్రవేశద్వారం వద్ద గురువారం సాయంత్రం జరిగిన కాల్పుల్లో 21 ఏళ్ల కార్తిక్ వాసుదేవ్ తీవ్రంగా గాయపడ్డారు. శరీరంలోకి  తూటాలు దూసుకుపోవడంతో కుప్పకూలిపోయాడు. అక్కడే ఉన్న పారామెడికల్ సిబ్బంది ఒకరు తక్షణం వైద్య సహాయం అందించారు. అనంతరం వాసుదేవ్‌ను స్థానిక ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ  మరణించారు. ఈ మేరకు టొరొంటో పోలీసు శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం టొరొంటో పోలీస్ సర్వీస్‌ హోమిసైడ్ విభాగం ఈ కేసు దర్యాప్తు చేస్తోంది. ఇక.. ఘటనకు సంబంధించి ప్రత్యక్ష సాక్షులు తమను సంప్రదించాలని పోలీసులు కోరారు. కాల్పుల తాలూకు సీసీటీవీ ఫుటేజీ ఏదైనా ఉంటే తమకు అందజేయాలని విజ్ఞప్తి చేశారు. 


విద్యార్థి మృతి పట్ల విదేశాంగ మంత్రి సంతాపం!

వాసుదేశ్ మృతి పట్ల భారతీయ విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జయశంకర్  విచారం వ్యక్తం చేశారు. మృతుడి కుటుంబ సభ్యులకు సంఘీభావం తెలుపుతూ ట్వీట్ చేశారు. కెనడాలోని భారతీయ రాయబార కార్యాలయం కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.  టొరొంటోలో జరిగిన కాల్పుల్లో భారతీయ విద్యార్థి మరణించడం దురదృష్టకరమని, ఇది తమను చాలా బాధించిందని ట్వీట్ చేసింది.  కాగా.. వాసుదేవ్ సెనెకా కాలేజీలో మేనేజ్‌మెంట్ కోర్సు చదువుతున్నారు. ఉద్యోగం కోసం బయటకెళ్లినప్పుడు కాల్పుల్లో అతడు మరణించినట్టు  వాసుదేశ్ సోదరుడు మీడియాకు తెలిపారు. ఈ ఏడాది జనవరిలోనే వాసుదేవ్ కెనడాకు వెళ్లారు. మరోవైపు.. కార్తిక్ వాసుదేశ్ మృతి పట్ల సెనెకా కాలేజీ యాజమాన్యం కూడా సంతాపం వ్యక్తి చేసింది. ఇది ఎంతో విచారకమంటూ  ప్రకటన విడుదల చేసింది. ఇక.. వాసుదేవ్‌పై కాల్పులు జరిపిన వ్యక్తి ఓ నల్లజాతీయుడని పోలీసులు అనుమానిస్తున్నారు. చేతిలో గన్నుతో అతడు హవర్డ్ వీధివైపు వెళుతూ చివరిసారిగా కనిపించినట్టు స్థానిక న్యూస్ చానెల్ పేర్కొంది. 



Updated Date - 2022-04-09T21:13:39+05:30 IST