ఒక్కరోజే 210 కేసులు

ABN , First Publish Date - 2020-06-07T08:42:07+05:30 IST

కరోనా కేసుల్లో మరో రికార్డు నమోదైంది. రాష్ట్రంలో శనివారం ఒక్కరోజే ఏకంగా 210మంది వైరస్‌ బారిన పడ్డారు. వీరిలో 161మంది రాష్ట్రంలోని వారు కాగా, 41మంది ఇతర రాష్ట్రాల నుంచి, 8మంది విదేశాల నుంచి

ఒక్కరోజే 210 కేసులు

  • రాష్ట్రంలో మరో 161 మందికి కరోనా
  • ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి వచ్చిన 49 మందికి నిర్ధారణ 
  • పాసర్లపూడిలో 108 డ్రైవర్‌కు వైరస్‌.. 
  • నెల్లూరు, కృష్ణాల్లో ముగ్గురి మృతి?


(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌) : కరోనా కేసుల్లో మరో రికార్డు నమోదైంది. రాష్ట్రంలో శనివారం ఒక్కరోజే ఏకంగా 210మంది వైరస్‌ బారిన పడ్డారు. వీరిలో 161మంది రాష్ట్రంలోని వారు కాగా, 41మంది ఇతర రాష్ట్రాల నుంచి, 8మంది విదేశాల నుంచి వచ్చినవారు. మొదటిసారిగా ఒకేరోజు ఈ స్థాయిలో కేసులు వెలుగులోకి రావడంతో వైద్యవర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. వీటితో కలిపి మొత్తం పాజిటివ్‌ల సంఖ్య 4,460కి పెరిగింది. ఇందులో రాష్ట్రానికి చెందినవారు 3,588మంది ఉన్నారు. తాజాగా 29మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జి అయ్యారు. మరో 1,192మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కృష్ణాజిల్లాలో మరో 25కేసులు నమోదయ్యాయి. గొల్లపూడిలో ఒకే కుటుంబంలో నలుగురికి వైరస్‌ సోకింది. గన్నవరం చెక్‌పోస్టు వద్ద నిర్వహించిన పరీక్షల్లో ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న ఐదుగురికి కరోనా సోకినట్లు గుర్తించారు. రెండురోజుల క్రితం విజయవాడలో మరణించిన ఇద్దరికి పాజిటివ్‌ వచ్చినట్లు తెలిసింది. ఈ రెండు మరణాలను ప్రభుత్వం ధ్రువీకరించాల్సి ఉంది. పశ్చిమగోదావరిలో అత్యధికంగా ఒకేరోజు 32 కేసులు నిర్ధారణ అయ్యాయి. తాజాగా పాజిటివ్‌ వచ్చిన వారిలో ఓ కానిస్టేబుల్‌, హెల్త్‌వర్కర్‌ ఉన్నారు. నర్సాపురం నియోజకవర్గంలో అత్యధికంగా ఒకేరోజు 13 కేసులు నమోదయ్యాయి. నెల్లూరు జిల్లాలో మరో 22మంది కొవిడ్‌ బారిన పడ్డారు. 


నెల్లూరు నగరానికి చెందిన ఓ మహిళ(51) మృత్యువాత పడింది. ఈ నెల 2న గుండెనొప్పితో ఆస్పత్రిలో చేరిన ఆమెకు కరోనా లక్షణాలు ఉండటంతో నమూనాలు సేకరించి జీజీహెచ్‌కు పంపారు. శనివారం తెల్లవారు జామున పాజిటివ్‌ అని తేలడంతో జిల్లా కొవిడ్‌ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందింది. విశాఖ జిల్లాలో మరో 19మందికి పాజిటివ్‌ వచ్చింది. వీరిలో కూర్మన్నపాలెం ప్రాంతానికి చెందిన ఐదుగురు ఉన్నారు. అందులో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురికి వైరస్‌ సోకింది. దువ్వాడ ప్రాంతానికి చెందిన ఒకే కుటుంబంలోని ఇద్దరితో పాటు మరో వ్యక్తికి, అనకాపల్లికి చెందిన ఇద్దరికి, నక్కపల్లి మండలానికి చెందిన మహిళకు, దేశ, విదేశాల నుంచి ఈ వారంలో జిల్లాకు వచ్చిన మరో 9మందికి వైరస్‌ సోకినట్టు అధికారులు ప్రకటించారు. కర్నూలు జిల్లాలో మరో 17మందికి వైరస్‌ నిర్ధారణ అయింది. వీటితో కలిపి ఈ జిల్లాలో కేసుల సంఖ్య 762కు చేరింది. తూర్పుగోదావరి జిల్లాలో మరో 12మంది కరోనా బారిన పడ్డారు. పాసర్లపూడిలో 108 వాహనం డ్రైవర్‌(49)కు వైరస్‌ సోకినట్లు తేలడంతో కలకలం రేగింది. 


సఖినేటిపల్లి మండలంలో వారం కిందట ముంబై నుంచి వచ్చిన ఇద్దరు క్వారంటైన్‌లో ఉండకుండా రహస్యంగా ఇంటికి వెళ్లిపోయారు. వీరికి పాజిటివ్‌ అని తేలింది. కాకినాడకు చెందిన ఓ వ్యక్తి(48), వాకలపూడికి చెందిన మరొకరు(43) గత నెలలో విశాఖ, ముంబై వెళ్లి వచ్చారు. ఆ తర్వాత ఇద్దరూ కలసి ఇంట్లో పార్టీ చేసుకున్నారు. ఇప్పుడు వీరిద్దరికీ కరోనా సోకినట్లు గుర్తించారు. గొల్లప్రోలులో తొలిసారిగా ఎనిమిదేళ్ల బాలుడికి వైరస్‌ సంక్రమించింది. గుంటూరు జిల్లాలో మరో 8కేసులు నమోదైనట్లు అధికారులు ప్రకటించారు. ఇవికాక పొందుగుల చెక్‌పోస్ట్‌ వద్ద రాష్ట్రంలోకి వస్తున్నవారికి నిర్వహించిన పరీక్షల్లో 8మందికి పాజిటివ్‌ వచ్చింది. విజయనగరం జిల్లాలో మరో ఏడు కేసులు నమోదయ్యాయి. వీరిలో చీపురుపల్లి, విజయనగరం, రామభద్రపురంలో ఇద్దరు చొప్పున, డెంకాడ మండలంలో ఒకరు ఉన్నారు. చిత్తూరు జిల్లాలో మరో 7 కేసులు బయటపడగా వారంతా హైదరాబాద్‌, చెన్నై నుంచి వచ్చినవారేనని గుర్తించారు. కడప జిల్లాలో మరో ఐదుగురికి పాజిటివ్‌ వచ్చినట్లు అధికారులు ప్రకటించారు.

Updated Date - 2020-06-07T08:42:07+05:30 IST