కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని బీర్భూమ్ జిల్లాలో జరిగిన అల్లర్లలో 21 మందిపై కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) కేసు నమోదు చేసింది. అలాగే తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన బూత్ లీడర్ అరనుల్ హొస్సేన్‌ను సీబీఐ అధికారులు విచారిస్తున్నారు. ఆరోపణలు నిజమైతే ఈయన అరెస్ట్‌కు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హామీ ఇచ్చారు. రాజకీయ హత్యకు ప్రతీకారంగా కొందరు దుండగులు మంగళవారం తెల్లవారుజామున ఐదు ఇళ్లకు బయటనుంచి తాళాలు వేసి నిప్పంటించారు. ఇప్పటికే 20 మందిని అరెస్ట్ చేశారు. ఇందులో ఆరుగురు మహిళలు, ఇద్దరు చిన్నారులు ఉన్నారు.
తాజాగా శనివారం బీర్భూమ్ హింసాకాండకు సంబంధించి విచారణ జరిపేందుకు డీఐజీ అఖిలేష్ సింగ్ నేతృత్వంలోని సీబీఐ టీం, ఫోరెన్సిక్ టీం రాంపూర్ హట్ గ్రామాన్ని సందర్శించింది. 15 సభ్యులతో కూడిన సీబీఐ టీమ్ ఈ హత్యాకాండపై దర్యాప్తు చేస్తోంది. ఎప్రిల్ 4 వరకు నివేదికను కలకత్తా హైకోర్టుకు సీబీఐ సమర్పించనుంది.
తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన భదు షైక్ అనే నాయకుడి హత్యతో ఈ అల్లర్లు మొదలయ్యాయి. బీర్భూమ్లోని రాంపూర్‌హాట్‌లో టీఎంసీకి చెందిన పంచాయితీ నాయకుడు భాదు ఫైక్పై గుర్తు తెలియని దుండగులు బాంబులు వేశారు. ఈ పేలుడులో ఆయన మరణించారు. దీనికి ప్రతీకారంగానే ప్రత్యర్థుల ఇళ్లకు నిప్పంటించారని స్థానిక వర్గాలు తెలిపాయి. మంగళవారం తెల్లవారుజామున ఐదు ఇళ్లకు బయటనుంచి తాళాలు వేసి నిప్పంటించడంతో ఎనిమిది మంది మరణించారు.