209 ఎకరాల పోర్టుభూమి ప్రైవేటు వ్యక్తులకు

ABN , First Publish Date - 2021-07-28T08:11:20+05:30 IST

శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో భారీ భూ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. చిల్లకూరు మండలం..

209 ఎకరాల పోర్టుభూమి ప్రైవేటు వ్యక్తులకు

నెల్లూరులో వెలుగులోకి భూస్కాం.. ఆర్డీవో విచారణ

తహశీల్దారు, ఆర్‌ఐ, కంప్యూటర్‌ ఆపరేటర్ల సస్పెన్షన్‌

నెల్లూరు, జూలై 27 (ఆంధ్రజ్యోతి): శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో భారీ భూ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. చిల్లకూరు మండలం తమ్మినపట్నం పరిధిలోని 209.25 ఎకరాల కృష్ణపట్నం పోర్టు భూములను రెవెన్యూ అధికారులు ప్రైవేటు వ్యక్తుల పేరిట బదలాయించారు. తమ్మినపట్నం పరిధిలో సర్వే నెం.94-3లో దేవదాయశాఖ భూములను 2011లో భూసేకరణ చట్టం కింద ప్రభుత్వం ఇండస్ట్రీయల్‌ కారిడార్‌కు సేకరించింది. అందులో 271.80 ఎకరాలను డైరెక్టర్‌ పోర్టు పేరిట బదలాయించింది. అప్పటి నుంచి ఆ భూములు కృష్ణపట్నంపోర్టు ఆధీనంలో ఉన్నాయి. అయితే అందులో 209.25 ఎకరాలను 11మంది వ్యక్తుల పేరుతో ఈ ఏడాది మార్చిలో ఆన్‌లైన్‌లో మార్పులు చేశారు. కొనుగోలు ద్వారా వారికి భూములు సంక్రమించినట్లు రికార్డులో పేర్కొంటూ వెబ్‌ల్యాండ్‌లో మార్పు చేసి 1బీ, అడంగల్‌ సృష్టించారు.  ఈ మార్పులకు సంబంధించి ఈసీ ఇవ్వాల్సిందిగా తహశీల్దారు గీతావాణి గూడూరు సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయానికి ఉత్తర్వులు కూడా పంపారు. అక్రమాలను గుర్తించిన పోర్టు అధికారులు జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో గూడూరు ఆర్డీవో మురళీకృష్ణ విచారణ జరిపి భూకుంభకోణం వాస్తవమేనంటూ కలెక్టర్‌ చక్రధర్‌బాబుకు నివేదిక అందజేశారు. దీంతో తహశీల్దారు గీతావాణి ఆర్‌ఐ సిరాజ్‌, కంప్యూటర్‌ ఆపరేటర్‌ నవీన్‌ను సప్పెండ్‌ చేసూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. 

తెర వెనుక అధికార పార్టీ నేతలు?

 ప్రభుత్వం కోస్టల్‌కారిడార్‌ కోసం భూసేరణ చేసేందుకు సన్నాహాలు  చేస్తోంది. ఇటీవల జరిగిన లావాదేవీల ప్రకారం చూస్తే తమిన్నపట్నం గ్రామంలో ఎకరాకు సుమారు రూ. 25లక్షల వరకు పరిహారం దక్కే అవకాశాలు ఉన్నాయి. దీనిని దృష్టిలో పెట్టుకునే కొంత మంది అధికార పార్టీ నేతలు ఈ భూకుంభకోణానికి తెరలేపినట్లు ప్రచారం జరుగుతోంది.    భూములు తమవని తహశీల్దారుకు దరఖాస్తుచేసుకున్న 11మంది  కనీసం చిల్లకూరు మండలానికి సంబంధించినవారు కూడా కాదు. వెబ్‌ల్యాండ్‌లో మార్పునకు దరఖాస్తు చేసుకునేటప్పుడు కొన్ని రిజిస్ట్రేషన్‌ల డాక్యుమెంట్లు సమర్పించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఇది కుంభకోణమని తేలడంతో ఆ డాక్యుమెంట్లన్నీ నకిలీవని తెలిపోయింది. నకిలీపత్రాలు సృష్టించి పోర్టు భూములు తమవంటూ దరఖాస్తు చేసుకున్నవారిపై ఎటువంటి చర్యలు తీసుకుంటారన్నది ఆసక్తిగా మారింది. 


Updated Date - 2021-07-28T08:11:20+05:30 IST