లాక్‌డౌన్ మధ్య 20 వేల మంది విదేశీయులను తరలించాం: కేంద్రం

ABN , First Publish Date - 2020-04-10T23:41:57+05:30 IST

కోవిడ్-19 లాక్‌డౌన్ నేపథ్యంలో 20 వేల మందికి పైగా విదేశీయులను తమ తమ దేశాలకు తరలించినట్టు భారత..

లాక్‌డౌన్ మధ్య 20 వేల మంది విదేశీయులను తరలించాం: కేంద్రం

న్యూఢిల్లీ: కోవిడ్-19 లాక్‌డౌన్ నేపథ్యంలో 20 వేల మందికి పైగా విదేశీయులను వారి దేశాలకు తరలించినట్టు భారత విదేశాంగ శాఖ పేర్కొంది. ఆయా ప్రభుత్వాల అభ్యర్థన మేరకు వారందరినీ ప్రపంచలోని పలు ప్రాంతాలకు సురక్షితంగా తరలించామని వెల్లడించింది. ‘‘ఏప్రిల్ 9 వరకు 20,473 మంది విదేశీయులను విజయవంతంగా ఖాళీ చేయించాం. ప్రస్తుతం కొనసాగుతున్న ఈ ప్రక్రియలో ప్రపంచంలోని వివిధ దేశాలు పాల్గొంటున్నాయి. వారి నుంచి మాకు అద్భుతమైన సహకారం అందుతోంది. కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కృషిలో విదేశాంగ శాఖ సహా అన్ని ప్రభుత్వ శాఖలు, రాష్ట్ర ప్రభుత్వాలు కష్టపడి పనిచేస్తున్నాయి..’’ అని విదేశాంగ శాఖ ఏఎస్, కోవిడ్-19 సమన్వయకర్త దమ్ము రవి పేర్కొన్నారు.


విదేశాల్లో ఉన్న భారతీయుల పరిస్థితిపై ఓ ప్రశ్నకు ఆయన స్పందిస్తూ.. ‘‘దీనిపై మేము ఒక అంచనాకు రావాల్సి ఉంది. ఆ తర్వాతే భారతీయులను ఎలా తరలించాలన్న దానిపై ప్రభుత్వం ఒక నిర్ణయానికి వస్తుంది. అయితే ఆయా దేశాల్లోని భారతీయులతో అక్కడి రాయబారులు, హైకమిషనర్లు ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూనే ఉన్నారు. వారికి మార్గదర్శకాలు ఇవ్వడంతో పాటు హెల్ప్‌లైన్ల ద్వారా అన్ని విధాలా అండగా ఉంటున్నారు...’’ అని పేర్కొన్నారు.

Updated Date - 2020-04-10T23:41:57+05:30 IST