GHMC కి పెనుసవాల్‌గా నిలిచిన 2021..

ABN , First Publish Date - 2021-12-31T12:55:42+05:30 IST

1.30కోట్ల జనాభా ఉన్న గ్రేటర్‌లో పౌర సేవలు, మౌలిక సదుపాయాలు కల్పన

GHMC కి పెనుసవాల్‌గా నిలిచిన 2021..

  • కొలువుదీరిన కొత్త పాలకమండలి
  • కరోనా ఎఫెక్ట్‌.. ఆర్థిక ఇబ్బందులు
  • మెరుగవ్వని జీహెచ్‌ఎంసీ పౌర సేవలు
  • ప్రయోగాలతో కొత్త సమస్యలు

హైదరాబాద్‌ సిటీ : 1.30కోట్ల జనాభా ఉన్న గ్రేటర్‌లో పౌర సేవలు, మౌలిక సదుపాయాలు కల్పన, అభివృద్ధి పనులు చేపట్టడం 2021లో జీహెచ్‌ఎంసీకి సవాల్‌గా మారాయి. కరోనా విజృంభణ, ఆర్థిక ఇబ్బందులు, సర్కారునుంచి సాయం అందకపోవడంతో పలు ప్రాజెక్టు పనుల్లో వేగం మందగించింది. రహదారుల నిర్మాణం, నిర్వహణకు సంబంధించి రూ.400 కోట్లకుపైగా బిల్లులు బకాయి ఉండడంతో మెజార్టీ ఏరియాల్లో రోడ్లు అధ్వానంగా మారాయి. కాంప్రెహెన్సివ్‌ రోడ్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌(సీఆర్‌ఎంపీ)లో భాగంగా ప్రైవేట్‌కు అప్పగించిన రహదారులు మినహా ఇతర చోట్ల పరిస్థితి తీసికట్టుగా మారింది. గతంతో పోలిస్తే ఆస్తిపన్ను, పట్టణ ప్రణాళికా విభాగం ఆదాయంలోనూ తగ్గుదల కనిపిస్తోంది. నిరుపేదల ఆత్మగౌరవ గృహాల నిర్మాణం మెజార్టీ సైట్లలో దాదాపుగా నిలిచిపోయింది. రూ.600 కోట్ల మేర బకాయిలు ఉండగా.. రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ నెలకు, రెండు నెలలకోసారి రూ.50కోట్లు, 100కోట్లు ఇస్తుండడంతో నిర్మాణదారులు చేతులెత్తేశారు. ఎస్‌ఆర్‌డీపీలో భాగంగా హైటెక్‌ సిటీ రైల్వే స్టేషన్‌ వద్ద రూ.66.59కోట్లతో నిర్మించిన రైల్‌ అండర్‌ బ్రిడ్జి(ఆర్‌యూబీ)ని మార్చి 17న, రూ.80 కోట్లతో ఒవైసీ-మిథాని జంక్షన్‌ వద్ద నిర్మించిన ఏపీజే అబ్దుల్‌ కలాం వంతెన డిసెంబర్‌ 28న అందుబాటులోకి వచ్చాయి.


కొత్త పాలకమండలి...

- ఫిబ్రవరి 11న జీహెచ్‌ఎంసీలో కొత్త పాలకమండలి కొలువుదీరింది. 2016లో ఎన్నికైన పాలకమండలి గడువు ముగియక ముందే డిసెంబర్‌ 1వ తేదీన గ్రేటర్‌ ఎన్నికలు జరిగాయి. అదే నెల 4వ తేదీన ఫలితాలు వెలువడ్డాయి. అధికార టీఆర్‌ఎస్‌-56, బీజేపీ-48, ఎంఐఎం-44, కాంగ్రెస్‌-2 స్థానాలు దక్కించుకున్నాయి. ప్రమాణ స్వీకారానికి ముందే లింగోజిగూడ కార్పొరేటర్‌ మృతి చెందడంతో జరిగిన ఉప ఎన్నికల్లో ఆ వార్డును కాంగ్రెస్‌ దక్కించుకుంది. దీంతో కౌన్సిల్‌లో బీజేపీ బలం 47కు తగ్గింది. గ్రేటర్‌ మేయర్‌గా విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్‌గా మోతె శ్రీలతాశోభన్‌రెడ్డిలు ఎన్నికయ్యారు. గత పాలకమండలి గడువు ఫిబ్రవరి 10వ తేదీన ముగియగా..  మర్నాడే కొత్త పాలక మండలిని ఎన్నుకున్నారు. 


- సనత్‌నగర్‌ నియోజకవర్గంలోని చాచా నెహ్రూ నగర్‌, జీవైరెడ్డినగర్‌, అంబేడ్కర్‌నగర్‌లో నిర్మించిన రెండు పడకల ఇళ్లను లబ్ధిదారులకు అందజేశారు. 


- నూతన విధానంలో ఈ యేడాది అందుబాటులోకి వచ్చిన జనన, మరణ ధ్రువీకరణ పత్రాల జారీలో పారదర్శకత లోపించింది. మెరుగైన సేవలందించేందుకు వినియోగిస్తోన్న సాఫ్ట్‌వేర్‌తో కొత్త తలనొప్పులు మొదలయ్యాయి. సర్టిఫికెట్ల సవరణలో ఇబ్బందులకు ఇప్పటికీ పరిష్కారం చూపలేదు. 


- ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో ఎస్‌ఆర్‌డీపీలో ఇప్పటికే పురోగతిలో ఉన్న ప్రాజెక్టులు మినహా కొత్తవి చేపట్టవద్దని నిర్ణయించారు. 


- జీహెచ్‌ఎంసీలో కొత్త చట్టం అమలు మొదలవలేదు. టీఎస్-బీపా‌స్‌లో భాగంగా పట్టణ ప్రణాళికా విభాగంలో మాత్రమే నయా నిబంధనలు అమలవుతున్నాయి. 


- ప్రధాన రహదారులపై ఒత్తిడి తగ్గించేందు కు ప్రతిపాదించిన లింక్‌/మిస్సింగ్‌ రోడ్లను జూన్‌లో పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. ఇప్పటి వరకు 16 రహదారులు అందుబాటులోకి రాగా.. మరో పదిచోట్ల పనులు పురోగతిలో ఉన్నాయి.

Updated Date - 2021-12-31T12:55:42+05:30 IST