2021

ABN , First Publish Date - 2021-01-01T06:20:54+05:30 IST

ప్రపంచాన్ని పట్టుకున్న పీడను చావులోనూ రోగంలోనూ మాత్రమే కాదు, లక్ష రూపాలలో కనుగొనవచ్చు. పెళ్లిమంటపాలలో గుప్పుమనవలసిన మల్లియలు...

2021

ప్రపంచాన్ని పట్టుకున్న పీడను చావులోనూ రోగంలోనూ మాత్రమే కాదు, లక్ష రూపాలలో కనుగొనవచ్చు. పెళ్లిమంటపాలలో గుప్పుమనవలసిన మల్లియలు, తోరణాలకు రంగులద్దవలసిన బంతులు, సిగలను అలంకరించవలసిన లిల్లీలు, గులాబీలు పశువుల మేతగా మారిపోతే? పూల కన్నీరు, తోటమాలి రక్తస్వేదమూ కలిసి రహదారులను దుర్గంధం చేస్తే? 2020 సంవత్సరంలో కొవిడ్-19 సృష్టించిన బీభత్స దృశ్యాలలో పూలరైతుల విషాదం ఒకటి. రైలుపట్టాలపై చెదిరిన జీవితాలు మరొకటి. నిద్రలేవమని తల్లి కళేబరాన్ని స్పృశిస్తున్న పసిపాప మరొకటి. గడచిన ఏడాదిని తలచుకుంటే, అది మనుషులను ఎంతగా విషాదానికి, మృత్యువుకి అలవాటు చేసింది? ఈ సంవత్సరం కాలగర్భంలో ఆవిరైపోవాలని, తలపునకు కూడా రాకుండా విస్మృతిపొరల అడుగుల్లో ఖననమైపోవాలని ఎవరికి ఉండదు? వెళ్లిపో 2020, నిజంగా వెళ్లిపో, నిన్ను గెంటేసిన క్షణమే పండగ, వెళ్లిపో, మళ్లీ ఎప్పుడూ రాకు! 


ఏ పాత సంవత్సరమూ బహుశా ఇంతగా బాధపెట్టలేదు. ఇప్పుడిక, 2021 ఆశ. ఎప్పుడూ ఏ కొత్త సంవత్సరం మీదా ఇంతటి ఆశ లేదు. ఇన్ని ఆశలు లేవు. మునుపెన్నడూ మనం ఆరోగ్యాన్ని ఒక శుభాకాంక్షగా చెప్పి ఉండం. ఇప్పుడు చెబుతున్నాము. కొత్త సంవత్సరం ఆరోగ్యవంతంగా సాగాలి. రోగాలను తరిమివేయాలి. పెద్దలకు, పిన్నలకు అందరికీ శ్వాసనిండుగా ప్రాణవాయువు అందాలి. టీకాలో, మరో నిరోధమో ఏదో ఒకటి, అందరికీ అంది, ఆ వైరస్ కొమ్ములను విరవాలి. ప్రకృతి మంచిదే. తనలోనుంచి కలిగే కీడుకి, తానే విరుగుడు కూడా చెబుతుంది. కొందరు మనుషులతోనే సమస్య. వారు స్వయంగా క్రిములు. రోగాలను పోషించే వ్యవస్థలు. 


తెల్లారేదాకా బార్లా తెరుస్తాం తాగండని తెలుగు రాష్ట్రాలు చలివేంద్రాలు తెరిచాయి కానీ, పాపం ఇంగ్లండ్‌లో నూతన సంవత్సర వేడుకలే లేవు. ఈ ఏడు తలుపులు బిగించుకుని ఇళ్లలోనే ఉండండి, రేపటి అనేక వేడుకల కోసం నేటి పండగను వదులుకోండి- అని ప్రభుత్వం చెప్పింది. ప్రజల చేత మద్యం తాగించి, ఆ పాపపు డబ్బుతో పాలన చేయవలసిన అగత్యాలు అక్కడ లేవు కాబోలు. బ్రిటన్ ఒక్కటే కాదు, ఐరోపా అంతటా కొత్తకోరల కరోనా భయంతో అనేక ఆంక్షలు విధించారు. ధిక్కరించి వీధుల్లోకి వచ్చేవారిని, విందులు చేసుకునేవారిని అదుపు చేయడానికి ఫ్రాన్స్ లక్షమంది పోలీసులను ప్రత్యేకంగా నియమించింది. చైనాలో, జపాన్‌లో ఆనవాయితీగా చేసే అధికారిక నూతన సంవత్సర వేడుకలన్నిటిని రద్దు చేశారు. ఆస్ట్రేలియాలో సిడ్నీలో బాణాసంచా కాల్చారు కానీ, దాన్ని ప్రజలు ప్రత్యక్షంగా చూసే వీలు కల్పించలేదు. కరోనాను సమర్థంగా కట్టడి చేసినందుకు ప్రపంచ ప్రశంసలు అందుకున్న న్యూజీలాండ్‌లో మాత్రం సంబరాలు యథావిధిగా జరిగాయి. కట్టడులు కేవలం ఇతర దేశాలలో మాత్రమే కాదు, భారత్లోనూ ఉన్నాయి. దేశరాజధాని ఢిల్లీలో, మరి కొన్ని నగరాలలో రాత్రి కర్ఫ్యూ విధించారు. 


కొత్త సంవత్సరంలో బడులు తెరుచుకుంటాయా? చదువులు సాగుతాయా? కొత్తకోరల కరోనా సమస్యను తిరగబెడుతుందా? 2021 కూడా పూర్తిస్థాయిలో ప్రజాజీవనాన్ని పునరుద్ధరించలేకపోవచ్చు. ఇది మనుషులు కోలుకునే కాలం, జీవనరంగాలు తేరుకునే కాలం. అన్నిటికంటె ప్రాణం, ఆరోగ్యం ముఖ్యం అని గుర్తించినవారు వయోధికులనే కాదు, పిల్లలను కూడా కాపాడుకోవడానికే ప్రాధాన్యం ఇస్తున్నారు. బాలబాలికలు, ముఖ్యంగా ప్రాథమిక, ప్రాథమికపూర్వ తరగతుల పిల్లలు తిరిగి పాఠశాలలకు రావడం, వచ్చే విద్యా సంవత్సరంలో జరిగే పనేనా? లేకపోతే, ఫలితంగా ఉత్పన్నమయ్యే పరిస్థితులను ఎట్లా ఎదుర్కొనాలి? ముందుచూపుతో ప్రభుత్వాలు చేయవలసిన ఆలోచనలు ఇవి. దేశాల మధ్య విద్యా వినిమయం, పర్యాటకుల సందడి పూర్తిగా పూర్వస్థితికి రాకపోవచ్చు. చదువులను, కొన్ని రకాల ఉద్యోగవిధులను పరోక్షంగా కూడా నెరవేర్చవచ్చును కానీ, మనుషుల భౌతిక సమన్వయం అవసరమైన ఉత్పాదక, ఉద్యోగ రంగాలు పరిమితులను అధిగమించేందుకు ఏమి చేస్తాయో చూడాలి. 


ప్రపంచపటం మీద కరోనా తెచ్చిన కొద్దిపాటి ఊరట, యుద్ధం పలచబడింది. అసలే జరగలేదని కాదు, డ్రోన్లూ, యుద్ధవిమానాలూ నడవలేదనీ, విస్ఫోటాలూ రాజకీయ హత్యలూ జరగలేదనీ కాదు, మంచుకొండల సరిహద్దుల్లోనూ నెత్తురు చిమ్మలేదనీ కాదు. కానీ, మొత్తం మీద ప్రపంచంలో యుద్ధసంఘటనలు, మరణాలు తగ్గాయి. అదే సమయంలో, కొవిడ్ రాజకీయ చైతన్యాన్ని బలహీనపరచలేదు. అమెరికాలో ట్రంప్ ఓటమిలో కొవిడ్ కూడా ఒక పాత్రధారి. బైడెన్ వాస్తవ పాలన 2021లోనే మొదలు. అందులో భారత్‌కు ఏ ప్రభావం ఉందో? కొత్త ఏడాది రెండు రాష్ట్రాలలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు భారతదేశ రాజకీయాలలో కీలకమైనవి. కోవిడ్‌తో పాటు ఓడించవలసిన వైరస్‌లు అనేకం ఉన్నాయి. 


మరీ ఎక్కువ ఆశ పెట్టుకోలేము కానీ, కొత్త సంవత్సరం తప్పనిసరిగా ప్రపంచాన్ని ఎంతో కొంత మెరుగుపరుస్తుంది. 2020ని తట్టుకుని నిలిచిన అనుభవం అందుకు పనికివస్తుంది. ఆరోగ్య రక్షణ కోసం ఆచితూచి జీవితపు అడుగులు వేసినందున, ఆ జాగ్రత్త ఈ ఏడు కూడా పనికివస్తుంది. నేర్చుకున్న ప్రభుత్వాలు ఆరోగ్య వ్యవస్థల్లోని లోపాలను సరిదిద్దుకుంటాయి, స్థానిక, దేశీయరంగాల సాయంతో ఆర్థిక వ్యవస్థకు నిబ్బరం పెంచే ప్రయత్నం చేస్తాయి. ప్రభుత్వాల మీద పూర్తిగా ఆధారపడలేమనే అవగాహన కలిగినందున, ప్రజాసమూహాలు, సమాజాలు తమ సమష్టి ప్రయత్నాల ద్వారా, సహకారం ద్వారా తమ మనుగడకు, రక్షణకు తగిన ఏర్పాట్లు చేసుకుంటాయి. మనుషులు వ్యక్తిగత స్థాయిలోనూ ప్రయత్నాలు చేసుకోవాలి. తమ ఆరోగ్యాన్ని దృఢపరచుకునే చర్యలు తీసుకుని, అందుబాటులో ఉన్న అవకాశాలతోనే జీవికకు భరోసా కల్పించుకునే ప్రయత్నాలు చేయవలసి వస్తుంది. అనేక దశల్లో జరగవలసిన వ్యూహరచనలు ఇవి!


ఇప్పటికైతే నిన్ను ప్రేమిస్తున్నాము, కొత్త సంవత్సరమా, కాసింత దయగా, మృదువుగా ఉండు.

Updated Date - 2021-01-01T06:20:54+05:30 IST