రెండేళ్లలో 200 ఆన్‌లైన్‌ కోర్సులు!

ABN , First Publish Date - 2022-05-26T07:34:30+05:30 IST

‘‘గృహిణులు ఎవరైనా, ఎక్కడైనా ఎదుర్కొనే సమస్య ఒక్కటే. ఇంట్లో తన పనిని గొప్పగా చూడరు. ఆ మాటకొస్తే ఎవరూ గుర్తించరు.

రెండేళ్లలో 200 ఆన్‌లైన్‌ కోర్సులు!

పెళ్లయ్యాక మహిళలు చదువు కొనసాగించాలంటే ఇంట్లోనే ఎన్నో ఆటుపోట్లు, అడ్డంకులు ఎదురవుతాయి. అయితే ఆయేషా సుల్తానా వీటిని అధిగమించింది. తన ముగ్గురు పిల్లల్లాగే చదువుల్లో బిజీ అయింది. కరోనా సమయంలో ఏకంగా 200 ఆన్‌లైన్‌ సర్టిఫికేట్‌ కోర్సులు చేసింది. విద్య, సామాజిక సేవకు డాక్టరేట్‌నూ అందుకున్న ఆయేషా సుల్తానాను ‘నవ్య’ పలకరిస్తే తన ప్రయాణాన్ని చెప్పుకొచ్చిందిలా.. 


‘‘గృహిణులు ఎవరైనా, ఎక్కడైనా ఎదుర్కొనే సమస్య ఒక్కటే. ఇంట్లో తన పనిని గొప్పగా చూడరు. ఆ మాటకొస్తే ఎవరూ గుర్తించరు. ‘పొద్దున నుంచీ అసలు నువ్వు ఏంచేశావు?’ అన్నట్లే చూస్తుంటారు. ప్రతి మహిళా ఈ విషయంలో సంఘర్షణకు గురవుతుంటుంది. ఇదే ఆలోచనతో ‘ఈ రోజంతా ఏమి చేశావని?’ అనే కవిత రాశా. మహిళాదినోత్సవం రోజున చదివి వినిపించా. మంచి స్పందన వచ్చింది. అక్కడ  వివిధ రంగాల్లో ఉండే మహిళలను చూసి.. నేను కూడా ఏదోటి చేయాలి. ఇంట్లోనే ఆగిపోకూడదనే పట్టుదల అలా నాలో పుట్టింది.


అత్తమ్మ సహకారంతోనే..

డిగ్రీ చివరి ఏడాదిలో పెళ్లయ్యింది. భర్త సహకారంతో ఇన్ఫర్‌మేషన్‌ సిస్టమ్స్‌లో పీజీ చేశా. ఆ తర్వాత నాకు ముగ్గురు పిల్లలు పుట్టారు. వారి ఆలనాపాలనే సరిపోయింది. మావారు సౌదీలో ఇంజనీర్‌గా పని చేస్తున్నారు. పిల్లలు బడికెళ్లే వయసులో నేనూ పుస్తకాలు పట్టుకోవాలనుకున్నా. ‘చదువుకుంటా’నని అత్తమ్మను అడిగా. ‘పిల్లలున్నారు. నీకేమీ ఇబ్బంది లేదు. ఉద్యోగం చేయాలా?’ అన్నది. వద్దంది. మరోసారి నా మనసులో మాట చెప్పా. ఆమె అంగీకరించింది. ‘పిల్లల బాధ్యతలు చూసుకుంటా. చదువుకో’ అన్నది. ఖమ్మంలో పీహెచ్‌డీ చేసే అవకాశం లేక.. దూర


విద్యలో ఎంఏ. ఇంగ్లీష్‌, ఎంఏ. సంస్కృతం, ఎంఎస్సీ. సైకాలజీ, మాస్టర్స్‌ ఇన్‌ ఎడ్యుకేషన్‌ పూర్తిచేశా. ఉమెన్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ ఎంపవర్‌మెంట్‌, ఇస్లామిక్‌ స్టడీస్‌, కంపారిటివ్‌ రిలిజియన్‌.. డిప్లొమో కోర్సులు చేశా. త్వరలో పీహెచ్‌డీలో చేరతా. చదువుల విషయంలో ఇంకా సంతృప్తి కలగలేదు నాకు. ఇవాళ విద్యలో ఏదైనా సాధించానంటే.. అదంతా అత్తమ్మ చలవే. ప్రస్తుతం జమాతె ఇస్లామీ హింద్‌ సంస్థకు వైస్‌ ప్రెసిడెంట్‌గా పని చేస్తున్నా. తెలంగాణ రాష్ట్రమంతా తిరిగి ఉమన్‌ ఎంపవర్‌మెంట్‌ గురించి చెబుతుంటా.


అలాంటప్పుడే ధైర్యంతో.. 

‘ముగ్గురు బిడ్డల తల్లివి.. నీకు చదువు అవసరమా? ఇప్పుడు చదువుకుని ఏం చేస్తావు?’ అన్నారు కొందరు. ఈ సమాజం చదువు అంటే కేవలం ఉద్యోగం అనే కోణంలో చూస్తుంది. నా చదువు పదిమంది మేలుకోసమని తెల్సినపుడు ఆగిపోవడమెందుకూ? అనుకున్నా. అవేమీ పట్టించుకోకుండా.. ధైర్యంతో ముందడుగేశా. అందుకే పెద్ద చదువులు చదవగలిగా. పాఠశాలల్లో డ్రాపవుట్స్‌ అంతా ఆడపిల్లలే. వారి పేరెంట్స్‌ను మోటివేట్‌ చేస్తున్నా. పేద పిల్లలకు పదో తరగతిలో మంచి మార్కులొస్తే అభినందిస్తున్నా. వారికి కౌన్సిలింగ్‌ ఇస్తున్నా. ఆడపిల్లకు చదువే ఆయుధం. చదువుకుంటేనే గౌరవం అని చెబుతున్నా. 


లాక్‌డౌన్‌లో ఆన్‌లైన్‌ కోర్సులు...

పదేళ్లనుంచీ సామాజిక సేవ చేస్తున్నా. సొంత డబ్బునే వెచ్చిస్తున్నా. అయితే లాక్‌డౌన్‌లో ఎంతో మంది రోడ్డు మీదకు వచ్చారు. పేదల దయనీయ జీవితాలు చూశాక మనసు కలచివేసింది. ఐదువేల మందికి ఆహారసామగ్రితో పాటు భోజనం, దుస్తులు ఇచ్చా. ఎన్నారైల సహకారంతో పిల్లలకు ల్యాప్‌టాప్స్‌, ఫోన్లు ఇప్పించా. ఫేస్‌బుక్‌ లాంటి సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉండి బాధితులకు సాయం చేశా. ఆన్‌లైన్‌ అంటే కేవలం చాటింగ్‌, అశ్లీల దృశ్యాలు చూడటం కాదు.. దీనినుంచి ఎంతో నేర్చుకోవాలనిపించింది. గూగుల్‌లో వెతికా. ఐదువందల రూపాయల నుంచి యాభైవేల వరకూ సర్టిఫికేట్‌ కోర్సులు కనిపించాయి. పగలు పిల్లల బాధ్యత, సామాజిక సేవ చేసేదాన్ని. సమయం దొరికితే గూగుల్‌, లింక్డన్‌, యుడెమి.. లాంటి ఆన్‌లైన్‌ లెర్నింగ్‌ ప్లాట్‌ఫామ్స్‌లో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, డేటాసైన్స్‌.. లాంటి టెక్నాలజీ కోర్సులతో పాటు మేనేజ్‌మెంట్‌, రైటింగ్‌ స్కిల్స్‌, కాలిగ్రఫీ.. ఇలా రెండువందల ఆన్‌లైన్‌ సర్టిఫికేట్‌ కోర్సులు ఈ రెండేళ్లలో చేశా. ఇది సాధ్యమా? అంటూ ఎంతో మంది ఫోన్లు చేశారు. విద్యాసంస్థలు వారి పిల్లలకు పాఠాలు చెప్పమని అడిగాయి. నేర్చుకున్న విద్యను ఉచితంగా చెబుతున్నా. మహిళలంటేనే మల్టీటాస్కింగ్‌లో నిపుణులు. సెల్ఫ్‌లెర్నింగ్‌ కోర్సుల్ని ఆన్‌లైన్‌లో నేర్చుకోవచ్చు. 


అలా.. కల నెరవేరింది

బాల్యం నుంచీ నా పేరుముందు ‘డాక్టర్‌’ ఉండాలనే కల కనేదాన్ని. అది విద్యతో నెరవేరింది. విద్యారంగంలో చేస్తున్న కృషి, సామాజిక సేవను గుర్తించి.. ఇంటర్నేషనల్‌ యాంటీ కరెప్షన్‌ అండ్‌ హ్యూమన్‌ రైట్స్‌ సంస్థ నాకు గౌరవ డాక్టరేట్‌ను ఇచ్చింది. టాప్‌ 100 ఉమన్‌ లీడర్‌షిప్‌ అవార్డుతో పాటు మరెన్నో అవార్డులు వచ్చాయి. ఇటీవలే ‘సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయన్స్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ అవార్డును కూడా అందుకున్నా. ఢిల్లీ కేంద్రంగా నడిచే ‘ఆరా’ అనే మహిళా ఆన్‌లైన్‌ మ్యాగజైన్‌ ఎడిటర్‌గా పని చేస్తున్నా. ఇందులో దాదాపు మహిళలే పని చేస్తున్నారు. ఈ ఏడాది 85 మంది మహిళా రచయితలను ఎంకరేజ్‌ చేశాం. అందరూ వాలంటీర్లుగా పని చేస్తారు. ‘నో టైమ్‌’ అనే పుస్తకం రాశా. మహిళలు సమయపాలన ఎలా  చేసుకోవాలి? అనే అంశం అందులో చర్చించా. డిజిటల్‌ వర్షెన్‌లో ఉంది. త్వరలో పుస్తకరూపంలో తెస్తా. అసలు నీకు చదువు అవసరమా? ముగ్గురు పిల్లల తల్లివి చదువుకుని ఏం చేస్తావు? అన్న వాళ్లంతా ఇప్పుడు ముక్కున వేళ్లు వేసుకుంటున్నారు. అసలు నీకు సమయం ఎక్కడిది? ఇంటిపని ఉన్నా ఎలా చదివావు? అంటూ వాళ్లే ప్రశ్నలు వేస్తున్నారు. దానికి సమాధానమే నా పుస్తకం. నాకిప్పుడు 38 ఏళ్లు. నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. చాలా మంది ప్రతిభ ఉన్న గృహిణులు ఉంటారు. అలాంటి వారి ప్రతిభను గుర్తించి సాయపడేట్లు ఓ సంస్థను నెలకొల్పాలనే ఆశయం ఉంది.’’

రాళ్లపల్లి రాజావలి


హైదరాబాద్‌లో పుట్టి పెరిగా. నాకు ముగ్గురు పిల్లలు. పెద్ద కూతురు మెడిసన్‌ చదువుతోంది. మిగతా ఇద్దరు అమ్మాయిలు పదో తరగతి చదువుతున్నారు. తెలుగు, హిందీ, ఉర్దూ, అరబిక్‌, ఇంగ్లీష్‌, సంస్కృతంలో చదవగలను. రాయగలను. నాన్నద్వారానే సామాజిక సేవ చేయాలనే ఆలోచన పుట్టింది. అడ్డంకులు ప్రతిచోటా ఉంటాయి. అణచివేతకు గురైన మహిళలకు చదువే ఆయుధం కావాలి. ప్రతి ఇంటా అమ్మ చదువుకోవాలి.

Updated Date - 2022-05-26T07:34:30+05:30 IST