మారియుపోల్‌లో 200 మృతదేహాలు

ABN , First Publish Date - 2022-05-25T08:59:39+05:30 IST

ఉక్రెయిన్‌లోని సముద్రతీర పట్టణం మారియుపోల్‌లో రష్యా సేనలు జరిపిన మారణకాండలో 5వేల మందికి పైగా చనిపోయినట్లు ఉక్రెయిన్‌ సేనలు చెబుతుండగా..

మారియుపోల్‌లో 200 మృతదేహాలు

అపార్ట్‌మెంట్‌ శిథిలాల కింద వెలికితీత

కీవ్‌, మే 24: ఉక్రెయిన్‌లోని సముద్రతీర పట్టణం మారియుపోల్‌లో రష్యా సేనలు జరిపిన మారణకాండలో 5వేల మందికి పైగా చనిపోయినట్లు ఉక్రెయిన్‌ సేనలు చెబుతుండగా.. తాజాగా, ఓ అపార్ట్‌మెంట్‌ శిథిలాల కింద 200 మృతదేహాలను కనుగొన్నట్లు అధికారులు వెల్లడించారు. ఇప్పటికే ఈ నగరాన్ని పూర్తిస్థాయిలో స్వాధీనం చేసుకున్నట్లు రష్యా చెబుతోంది. మంగళవారం ఉక్రెయిన్‌ రెస్క్యూ బృందాలు ఓ అపార్ట్‌మెంట్‌ శిథిలాలను తొలగిస్తుండగా.. బేస్‌మెంట్‌లో ఈమృతదేహాలు కుళ్లిపోయిన స్థితిలో లభించాయన్నారు. ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ, విదేశాంగ మంత్రి దిమిత్రి కులేబా రష్యా దారుణ మారణకాండపై మండిపడ్డారు. ‘‘రెండో ప్రపంచ యుద్ధం తర్వాత.. ఆ స్థాయిలో డాన్‌బా్‌స(లుహాన్స్క్‌, డోనెట్స్క్‌ రీజియన్లు)పై అతిపెద్ద దాడికి రష్యా కుట్రలు పన్నుతోంది. ఐరోపాలో రెండో ప్రపంచయుద్ధం తర్వాత ఎన్నడూ ఈ స్థాయిలో దాడులు జరగలేదు’’ అని కులేబా అన్నారు.


ఇప్పటి వరకు ఈ యుద్ధంలో 29,500 మంది రష్యా సైనికులు మృతిచెందినట్లు ఉక్రెయిన్‌ నిఘా వ్యవస్థ పేర్కొంది. కాగా.. రష్యా అధినేత వ్లాదిమిర్‌ పుతిన్‌పై రెండు నెలల క్రితం హత్యాయత్నం జరిగినట్లు ఉక్రెయిన్‌ రక్షణశాఖ వర్గాలు వెల్లడించాయి. ఉక్రెయిన్‌పై దురాక్రమణ తర్వాత.. కౌకస్‌స(నల్లసముద్రం-కాస్పియన్‌ సముద్రం మధ్య ఉన్న ప్రాంతాలు) పర్యటనలో హత్యాయత్నం జరిగినట్లు ఉక్రెయిన్‌ డిఫెన్స్‌ ఇంటెలిజెన్స్‌ అధిపతి మేజర్‌ జనరల్‌ బుదనోవ్‌ తెలిపారు. పుతిన్‌ తన పొట్టలో చేరిన ద్రవాలను తొలగించుకునేందుకు శస్త్రచికిత్స చేయించుకున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో బుదనోవ్‌ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. 

Updated Date - 2022-05-25T08:59:39+05:30 IST