20 యూట్యూబ్‌ చానళ్లపై వేటు

ABN , First Publish Date - 2021-12-22T10:03:52+05:30 IST

భారత్‌పై దుష్ప్రచారం చేస్తున్న 20 యూట్యూబ్‌ చానళ్లు, రెండు వెబ్‌సైట్‌లపై నిషేధం విధిస్తున్నట్లు కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ ప్రకటించింది. నిఘా వర్గాల సహకారంతో

20 యూట్యూబ్‌ చానళ్లపై వేటు

  • రెండు వెబ్‌సైట్లపైనా నిషేధం..
  • భారత్‌పై దుష్ప్రచారం చేస్తున్నందునే
  • చానళ్ల వెనుక పాకిస్థాన్‌ నెట్‌వర్క్‌: కేంద్రం


న్యూఢిల్లీ, డిసెంబరు 21: భారత్‌పై దుష్ప్రచారం చేస్తున్న 20 యూట్యూబ్‌ చానళ్లు, రెండు వెబ్‌సైట్‌లపై నిషేధం విధిస్తున్నట్లు కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ ప్రకటించింది. నిఘా వర్గాల సహకారంతో వాటిని గుర్తించినట్లు పేర్కొంది. ఈ మేరకు 20 చానళ్లను నిలిపివేయాల్సిందిగా సోమవారమే యూట్యూబ్‌ సంస్థకు ఆదేశాలు జారీ చేసింది. రెండు వెబ్‌సైట్లను బ్లాక్‌ చేయాల్సిందిగా ఇంటర్నెట్‌ సర్వీస్‌ ప్రొవైడర్లకు సూచించాలంటూ టెలికాం మంత్రిత్వశాఖను కోరింది. ఈ చానళ్లు, వెబ్‌సైట్లను పాకిస్థాన్‌కు చెందిన నెట్‌వర్క్‌ నిర్వహిస్తున్నట్లుగా గుర్తించినట్లు, ఇవి సున్నితమైన అంశాలపై అసత్య వార్తలను ప్రచారం చేస్తున్నట్లు పేర్కొంది.


కశ్మీర్‌ అంశం, భారత సైన్యం, భారత్‌లోని మైనారిటీ వర్గాలు, రామ మందిరం, దివంగత సీడీఎస్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌ తదితర అంశాలపై ఈ చానళ్లు విద్వేషపూరిత ప్రచారం చేస్తున్నట్లు వెల్లడించింది. దేశ వ్యతిరేక వార్తలతో దేశంలో భయాందోళనలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్న 20 యూట్యూబ్‌ చానళ్లు, రెండు వెబ్‌సైట్లపై కఠిన చర్యలు తీసుకున్నామని సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ ట్విటర్‌లో ఓ వీడియో సందేశంలో పేర్కొన్నారు. కాగా, నయా పాకిస్థాన్‌ గ్రూప్‌ (ఎన్‌పీజీ) పేరిట ఏర్పాటైన యూట్యూబ్‌ నెట్‌వర్క్‌ ఈ దుష్ప్రచారానికి పాల్పడుతున్నట్లు, ఈ చానళ్లన్నింటికీ కలిపి 35 లక్షలకు పైగా సబ్‌స్ర్కైబర్లు, వీటి వీడియోలకు 55 కోట్లకు పైగా వీక్షకులు ఉన్నట్లు సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ వెల్లడించింది. నిషేధం విధించిన యూట్యూబ్‌ చానళ్లలో ద పంచ్‌ లైన్‌, ఇంటర్నేషనల్‌ వెబ్‌ న్యూస్‌, ఖల్సా టీవీ, ద నేక్‌డ్‌ ట్రూత్‌, 48 న్యూస్‌, నయా పాకిస్థాన్‌ గ్లోబల్‌, గ్లోబల్‌ ఈ-కామర్స్‌, జునైద్‌ హలీమ్‌ అఫీషియల్‌ తదితర 20 చానెళ్లు ఉన్నట్లు వివరించింది.

Updated Date - 2021-12-22T10:03:52+05:30 IST