Abn logo
Sep 10 2021 @ 02:46AM

నరమేధానికి ఇరవై ఏళ్లు!

  • 2001 సెప్టెంబరు11న ‘అగ్ర’ గడ్డపై భారీ ‘ఉగ్ర’ దాడి
  • వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌, పెంటగాన్‌పై హైజాక్‌ విమానాల కూల్చివేత
  • అక్టోబరు 7న అఫ్ఘాన్‌లోని అల్‌-ఖైదా స్థావరాలపై అమెరికా ప్రతీకార దాడి
  • తాలిబాన్ల తరిమివేత 
  • 20  ఏళ్లలో యుద్ధానికి, పునర్నిర్మాణానికి
  • రూ.కోటి 70 లక్షల కోట్ల ఖర్చు
  • అయినా సాధించింది శూన్యం


అమెరికాపై సెప్టెంబరు 11 దాడులు యావత్‌ ప్రపంచాన్నే వణికించాయి. దీనికి ప్రతీకారంగా అఫ్ఘానిస్థాన్‌పై ఆ దేశం దాడులు జరిపి తాలిబాన్లను తరిమికొట్టి.. తిష్ఠవేసింది. ఉగ్రపోరులో వంద కాదు.. వెయ్యి కాదు.. 2,300 మంది సైనికులను కోల్పోయింది.. పునర్నిర్మాణానికి డాలరు కాదు.. వంద డాలర్లు కాదు.. ఏకంగా 2.3 ట్రిలియన్‌ డాలర్లు ఖర్చుచేసింది. మిత్రదేశాలకూ చమురు వదిలింది. అయినా సాధించింది ఏమీ లేదు. అక్కడ సుస్థిరత సాధించడంలో పూర్తిగా విఫలమై.. ఏకపక్షంగా పిడివాద ఉగ్రవాదులతో చేతులు కలిపి అక్కడి నుంచి రిక్తహస్తాలతో నిష్క్రమించింది. ఏతావాతా అఫ్గాన్‌లో మారిన పరిస్థితులు భారత్‌కు ముప్పుగా పరిణమించవచ్చన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

అమెరికాలో అల్‌-ఖైదా ఉగ్రవాదుల నరమేధానికి శనివారంతో సరిగ్గా ఇరవై ఏళ్లు గడుస్తుంది. 2001 సెప్టెంబరు 11న 19 మంది టెర్రరిస్టులు నాలుగు జట్లుగా విడిపోయి.. అమెరికా ప్యాసింజర్‌ విమానాలను హైజాక్‌ చేసి.. వాణిజ్య, సైనిక స్థావరాల్లో వాటిని కూల్చివేసిన సంగతి తెలిసిందే. మొత్తం నాలుగు దాడులు జరగగా.. 19 మంది టెర్రరిస్టులు సహా 2,996 మంది ప్రాణాలు కోల్పోయారు. అమెరికా గడ్డపై ఇంత భారీ స్థాయిలో ఉగ్రదాడి జరగడం ఇదే ప్రథమం. అమెరికా విమానాలనే హైజాక్‌ చేసి.. ఒసామా బిన్‌ లాడెన్‌ సారథ్యంలోని అల్‌-ఖైదా బృందాలు జరిపిన ఈ వ్యూహాత్మక దాడులు ప్రపంచ దేశాలను నివ్వెరపరిచాయి. అమెరికా ప్రతీకారంతో రగిలిపోయింది. తొలుత ఇరాక్‌ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్‌ను బాధ్యుడిని చేసి ఆ దేశంపై దాడిచేయాలని అమెరికా రక్షణ శాఖ భావించింది. అధ్యక్షుడు జార్జి బుష్‌ తిరస్కరించారు. తదనంతరం లాడెన్‌, అల్‌-ఖైదా నేతల పాత్ర నిర్ధారణ కావడంతో వారిని అప్పగించాలని అఫ్ఘానిస్థాన్‌ పాలకులై న తాలిబాన్లకు అమెరికా అల్టిమేటం జారీచేసింది. అందుకు నిరాకరించిన వారు.. సాక్ష్యాధారాలు చూపిస్తే తామే ఇస్లామిక్‌ కోర్టులో విచారణ జరిపి శిక్షలు విధిస్తామని తెలిపారు. దీంతో 2001 అక్టోబరు 7న అమెరికా.. నాటో దళాల సాయంతో  ప్రతీకార దాడులు మొదలుపెట్టింది. తాలిబాన్లను పదవీచ్యుతులను చేసి.. హమీద్‌ కర్జాయ్‌ను దేశాధ్యక్షుడిగా నియమించింది. మొత్తం దేశ పాలనను, రక్షణను తన చేతుల్లోకి తీసుకుంది. ఇరవై ఏళ్లపాటు ఉగ్రవాదుల ఏరివేతకు సైనిక కార్యకలాపాలు కొనసాగిస్తూనే.. పునర్నిర్మాణం బాధ్యతలూ చేపట్టింది. కోట్ల డాలర్లు ఖర్చుచేసింది. భారత్‌ సహా పలు మిత్రదేశాలతోనూ భారీగా ఖర్చుపెట్టించింది. అయితే తాలిబాన్లు, అల్‌-ఖైదా టెర్రరిస్టులపై ఎన్నో దాడులు చేసినా.. ఎంత మం దిని హతమార్చినా.. లాభం లేకపోయింది. పశ్చిమ పాకిస్థాన్‌లో ఆశ్రయం పొందిన తాలిబాన్లు తిరిగి సంఘటితమయ్యారు. 2002 నుంచే ఎదురుదాడులు సాగించారు. ఫలితంగా 3,500 మంది నాటో సైనికులు చనిపోయారు. వీరిలో అమెరికా మిలిటరీ సిబ్బందే 2,300 మంది వరకు ఉన్నారు. మరో 20,660 మంది అమెరికా సిబ్బంది క్షతగాత్రులయ్యారు. 


ఎంత కష్టం.. ఎంత నష్టం..

అఫ్ఘాన్‌లో 2001 అక్టోబరు 7న మొదలైన అమెరికా-నాటో దాడులు ఇరవై ఏళ్లు కొనసాగాయి. అప్పటి నుంచి 93,527 వైమానిక దాడులు జరిగాయని అమెరికా రక్షణ కార్యాలయం పెంటగాన్‌ ప్రకటించింది. 20 వేల మంది ఉగ్రవాదులను హతమార్చామని పేర్కొన్నా.. ఈ అంకెపై రక్షణ నిపుణులకు అనుమానమే. ఎందుకంటే ఆ దాడుల్లో 48 వేల మంది అఫ్ఘాన్‌ పౌరులు కూడా మృతిచెందారు. సైనిక చర్యకు, అఫ్గాన్‌ పునర్నిర్మాణానికి అమెరికా రూ.కోటి 70 లక్షల కోట్ల ఖర్చుచేసినట్లు అంచనా. తనతోపాటు జర్మనీ, భారత్‌, బ్రిటన్‌ తదితర దేశాలతో కూడా దరిదాపుగా 500 కోట్ల డాలర్లు ఖర్చుచేయించింది. ఇవన్నీ బూడిదలో పోసిన పన్నీరు చందంగా మారాయి. పాక్‌లోని అబోటాబాద్‌లో తలదాచుకున్న లాడెన్‌ను 2011 మే 2న అర్ధరాత్రి అమెరికా సేనలు హతమార్చాయి. అయితే పాక్‌లోనే ఆశ్రయం పొందుతున్న ఇతర అల్‌-ఖైదా నేతలను గానీ, తాలిబాన్లను గానీ అంతమొందించలేకపోయింది. అంతర్యుద్ధ సమస్యను ప రిష్కరించలేకపోయింది. ఇంకోవైపు.. అఫ్గాన్‌ పాలకులు పూర్తి గా అవినీతిలో కూరుకుపోయారు. తాలిబాన్లు ఇటీవల కాబూల్‌ను ఆక్రమించుకోవడానికి రాగానే దేశాధ్యక్షుడు అష్రఫ్‌ ఘనీ కోట్ల డబ్బుతో పరారైన సంగతి ప్రస్తావనార్హం. అఫ్ఘాన్‌ సైన్యానికి, పోలీసు బలగాలకు అమెరికా, భారత్‌ శిక్షణ ఇచ్చాయి. కానీ వారిని సరైన దిశలో నడపడంలో ఘనీ, ఆయన ప్రభుత్వం, సైన్యాధికారులు పూర్తిగా విఫలమయ్యారు. ఇంకోవైపు.. నాటో దాడుల్లో ప్రాణనష్టం జరిగినా తాలిబాన్లు వెనక్కి తగ్గలేదు. పాకిస్థాన్‌, టర్కీల పరోక్ష దన్నుతో వారు ఎదురుదాడులు కొనసాగించారు. అమెరికా దాడులు తరచూ లక్ష్యాలు తప్పి.. అమాయక పౌరులను బలిగొనడంతో అధ్యక్షుడు కర్జాయ్‌ అప్పట్లో తీవ్రంగా నిరసించారు. రక్షణ బాధ్యతలు తమకే అప్పగించాలని.. అమెరికా తన సేనలను ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేసినందుకే ఆయన్ను కాదని అమెరికా ఘనీని అధ్యక్ష పీఠంపై కూర్చోబెట్టింది. ఆయన ఏలుబడిలో  పరిస్థితులు మరింత దిగజారాయి. సైనిక నష్టం నానాటికీ పెరగడం, స్వదేశంలో తీవ్ర నిరసనలు పెల్లుబుకడంతో అమెరికా తాలిబాన్లతో శాంతి చర్చలకు సిద్ధమైంది. చివరకు అఫ్ఘాన్‌ భూభాగంలో అమెరికా సైన్యం ఉండరాదన్న షరతుకు తలొగ్గి.. నిరుడు ఫిబ్రవరి 29న వారితో శాంతి ఒప్పందంపై సంతకాలు చేసింది. అయితే ఈ శాంతి ప్రక్రియలో అఫ్ఘాన్‌ ప్రభుత్వాన్ని భాగస్వామిని చేయకపోవడంతో ఘనీ సర్కారు ఈ ఒప్పందాన్ని తిరస్కరించింది. అయితే గత ఏడాది నుంచే తాలిబాన్లపై వైమానిక దాడులను అమెరికా-నాటో దళాలు నిలిపివేశాయి. అఫ్ఘాన్‌ సేనలు మాత్రమే పోరాడాయి. కానీ ఘనీ బృందంలోని పలువురు నేతలు తాలిబాన్లతో చేతులు కలిపారు. సైన్యానికి మార్గనిర్దేశం చేసేవారే కరువయ్యారు. దీంతో సైనికుల్లోనూ నిర్లిప్తత పెరిగింది. పోరాడకుండానే తాలిబాన్లకు లొంగిపోయారు.


భారత్‌కు గడ్డు పరిస్థితి..

అఫ్ఘాన్‌ పునర్నిర్మాణంలో ముఖ్య పాత్ర పోషించిన భారత్‌.. అక్కడ మారిన పరిస్థితులతో సంకట పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఆ దేశాన్ని అమెరికా నట్టేట ముంచుతుందని.. మధ్యలోనే కాడిపడేస్తుందని అది ఊహించలేదు. అఫ్ఘాన్‌పై దాడులకు అమెరికా పాకిస్థాన్‌లోనే వైమానిక స్థావరాలు ఏర్పరచుకుంది. తాలిబాన్లు, అల్‌ఖైదా, తదితర ఉగ్రవాద సంస్థలపై ఉక్కుపాదం మోపేలా ఒత్తిడి తెచ్చింది. ఉగ్రవాదంపై పోరుకు సహకరించనందుకు ఆర్థిక సాయం కూడా నిలిపివేసింది. దానిబాటలోనే పలు దేశాలు నడిచాయి. దీంతో టెర్రరిస్టులపై తప్పనిసరి పరిస్థితుల్లో పాక్‌ చర్యలు తీసుకోవలసి వచ్చింది. ఈ కారణంగా జమ్మూకశ్మీరులో పాక్‌ ప్రేరిత ఉగ్రమూకల దాడులు చాలా వరకు తగ్గాయి. ఇప్పుడు అఫ్ఘాన్‌ నుంచి అమెరికా అర్ధాంతరంగా వైదొలగడం, తాలిబాన్లు పాక్‌, చైనా చెప్పుచేతల్లో ఉండడం.. వారిని గతంలో వ్యతిరేకించిన రష్యా సైతం గుర్తించడం భారత్‌కు ప్రతికూలాంశాలే. తూర్పు ఆసియా దేశాలతో భౌగోళిక సంబంధాలు సైతం తెగిపోతాయి. దీనికితోడు భారత్‌కు వ్యతిరేకంగా ఉగ్రవాద కార్యకలాపాలను పాక్‌ మరింత పెచ్చరిల్లజేసే అవకాశాలున్నాయి. ఇప్పటికే ఉగ్రమూకలు కశ్మీర్లో రెచ్చిపోవడం మొదలుపెట్టాయి. దీంతో భద్రతపరంగా భారత్‌ తన వ్యూహాలను మార్చుకోవలసిన అనివార్యత ఏర్పడింది. తాలిబాన్లతో సత్సంబంధాలకు రష్యా ద్వారా తెరచాటుగా ప్రయత్నాలు చేస్తున్నా.. పాక్‌ పడనివ్వడం లేదు. 1990ల్లో ప్రపంచ ఉగ్రవాదానికి అఫ్ఘాన్‌ స్వర్గధామంగా మారిందని.. అమెరికా నిష్క్రమణ దరిమిలా తాలిబాన్లు తిరిగి అప్ఘాన్‌ను చేజిక్కించుకోవడంతో మళ్లీ అవే పరిస్థితులు తలెత్తుతాయన్న ఆందోళన ప్రపంచ దేశాల్లో నెలకొంది. పాశ్చాత్య దేశాల నిఘా సంస్థలు కూడా దీనిని ధ్రువీకరిస్తున్నాయని ఆసియా పసిపిక్‌ ఫౌండేషన్‌కు చెందిన నిపుణుడు సజ్జన్‌ గోహెల్‌ తెలిపారు. ‘ఉగ్రవాద శిక్షణ కోసం ఇక పశ్చిమ దేశాల నుంచి అఫ్ఘాన్‌కు పెద్దఎత్తున విదేశీ ఉగ్రవాదుల వలస మొదలవుతుంది. దీనిని ఆయా దేశాలు అడ్డుకునే పరిస్థితుల్లో లేవు. ఎందుకంటే ఆ దేశాన్ని ముంచేసి అవి పూర్తిగా నిష్క్రమించాయి. వారిని ఎదుర్కొనే వనరులు వాటికి లేవు’ అని వ్యాఖ్యానించారు.