20 కోట్ల ప్రభుత్వ భూమికి తహసీల్దారు పట్టా.. YSRCP బడా నేత దగ్గరి బంధువేనా..!

ABN , First Publish Date - 2022-03-08T12:33:25+05:30 IST

20 కోట్ల ప్రభుత్వ భూమికి తహసీల్దారు పట్టా.. YSRCP బడా నేత దగ్గరి బంధువేనా..!

20 కోట్ల ప్రభుత్వ భూమికి తహసీల్దారు పట్టా.. YSRCP బడా నేత దగ్గరి బంధువేనా..!

  • ముగ్గురి పేరిట ఆన్‌లైన్‌లో నమోదు 
  • తొట్టంబేడు తహసీల్దారు చర్యలపై ఇటీవల ఏసీబీ దాడులు 
  • తాజాగా సస్పెండు చేస్తూ కలెక్టర్‌ ఉత్తర్వులు

చిత్తూరు : తొట్టంబేడు తహసీల్దారు పరమేశ్వరస్వామిని కలెక్టర్‌ హరినారాయణన్‌ సస్పెండ్‌ చేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ భూముల్ని ముగ్గురి పేరిట పట్టాలిచ్చినట్లు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఈ చర్యలకు పూనుకున్నట్లు తెలిసింది. ఆయన స్థానంలో శ్రీకాళహస్తి తహసీల్దార్‌ జరీనాబేగంను ఇన్‌చార్జిగా నియమిస్తున్నట్లు ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కడప జిల్లా సుండుపల్లె మండలంలో డిప్యూటి తహసీల్దార్‌గా పనిచేసిన పరమేశ్వరస్వామి.. 2019 సాధారణ ఎన్నికల సమయంలో పదోన్నతి పొంది, అదే ఏడాద జూలై నుంచి తొట్టంబేడులో విధులు నిర్వహిస్తున్నారు. 


అసలేం జరిగిందంటే..

శ్రీకాళహస్తి పట్టణంలో విలువైన ప్రాంతం దక్షిణ కైలాసనగర్‌ను ఆనుకుని తొట్టంబేడు మండలం సీఎన్‌ఆర్‌ కండ్రిగ రెవెన్యూ గ్రామంలోని భూములున్నాయి. ఇక్కడ ప్రధాన రహదారికి ఆనుకుని ఎకరా రూ.10 కోట్లు పలుకుతుండగా.. కాస్త లోపలికి రూ.5 కోట్లకుపైగా విలువ ఉంది. సర్వే నంబరు 52లో 2.58 ఎకరాలు, సర్వే నంబరు 53లో 1.44 ఎకరాల కాలువ పొరంబోకు భూమిని రెవెన్యూ రికార్డుల్లో పట్టాభూమిగా మార్చినట్లు తహసీల్దారు పరమేశ్వరస్వామిపై ఆరోపణలు వచ్చాయి. ఈ భూమిని గంగలపూడి సుకేష్‌, ఎస్‌కే హమీద్‌బాషా, వై.ప్రసాద్‌ పేరిట ఆన్‌లైన్‌లోనూ నమోదు చేశారని ఏసీబీ అధికారులకు ఫిర్యాదులు అందాయి.


ఫిబ్రవరి 25, 26వ తేదీల్లో తిరుపతి ఏసీబీ డీఎస్పీ శంకర్‌రెడ్డి ఆధ్వర్యంలో తహసీల్దార్‌ కార్యాలయంపై దాడులు చేసి, పలు రికార్డులను తనిఖీ చేశారు. ప్రభుత్వ భూమిని క్లాసిఫికేషన్‌ మార్చేసి పలువురు వ్యక్తుల పేరిట ఆన్‌లైన్‌లో నమోదు చేసినట్లు గుర్తించామని, మరికొన్ని అక్రమాల గురించి విచారిస్తున్నామని ఏసీబీ డీఎస్పీ శంకర్‌రెడ్డి ఆంధ్రజ్యోతికి తెలిపారు. దీనిపై ఏసీబీ అధికారులు ఇంకా కలెక్టర్‌కు నివేదిక ఇవ్వలేదు. కానీ, కలెక్టర్‌ మరో కోణంలో విచారణ చేపట్టి తహసీల్దార్‌ను సస్పెండ్‌ చేసినట్లు తెలిసింది. ఈ వ్యవహారంలో ప్రమేయమున్న మరికొంత మంది సిబ్బందిపైనా విచారణ జరిపిన చర్యలు  తీసుకునే అవకాశాలు  కనిపిస్తున్నాయి.


ఆ ముగ్గురు డమ్మీలే.. అసలు వేరే

శ్రీకాళహస్తి నియోజకవర్గానికి చెందిన వైసీపీ బడా నేత దగ్గరి బంధువు తొట్టంబేడు మండలంలో భూఅక్రమాలకు తెరలేపినట్లు ఆరోపణలున్నాయి. ఈ క్రమంలోనే ఆయన ప్రభుత్వ భూముల్ని తన అనుచరులైన ముగ్గురి పేర్లతో ఆన్‌లైన్‌లో నమోదు చేయించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనికి సహకరించిన తహసీల్దార్‌ సస్పెండయ్యారు. ప్రస్తుతం ఆ భూముల్ని ఆన్‌లైన్‌లో రెడ్‌మార్క్‌లో ఉంచారు.

Updated Date - 2022-03-08T12:33:25+05:30 IST