సీఏఏ నిరసన: ఇద్దరు మహిళా కార్యకర్తలకు జ్యూడీషియల్ కస్టడీ

ABN , First Publish Date - 2020-05-29T23:05:23+05:30 IST

కలిత, నర్వాల్‌‌లను మార్చి 23న అరెస్ట్ చేశారు. జఫరాబాద్ సిట్-ఇన్ నిరసనలో వారి పాత్ర ఉందని ఆరోపణలు రావడంతో ఢిల్లీ పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. కాగా, మరుసటి రోజే బెయిల్ పొందారు

సీఏఏ నిరసన: ఇద్దరు మహిళా కార్యకర్తలకు జ్యూడీషియల్ కస్టడీ

న్యూఢిల్లీ: ఈశాన్య ఢిల్లీలో సీఏఏ(పౌరసత్వ సవరణ చట్టం)కు వ్యతిరేకంగా నిర్వహించిన నిరసనలో పాల్గొన్నారంటూ వచ్చిన ఆరోపణలతో ఇద్దరు పింజ్రా తోడ్ కార్యకర్తలకు 14 రోజుల జ్యూడీషియల్ కస్టడీ విధిస్తూ ఢిల్లీ హైకోర్టు శుక్రవారం ఉత్తర్వులు విడుదల చేసింది. దేవంగన కలిత, నటాషా నర్వాల్‌లను ఢిల్లీలో జరిగిన అల్లర్లతో సంబంధాలు ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే వారిని అరెస్ట్ చేసినట్లు ఢిల్లీ పోలీసులు పేర్కొన్నారు.


‘‘దర్యాప్తు పెండింగ్‌లో ఉంది. అరెస్ట్ చేసిన వారిని విచారించారు. నిందితులను అరెస్ట్ చేయడానికి తగిన కారణాలు ఉన్నాయి. ఆరోపణలు బలంగా ఉన్న కారణంగానే నిందితులకు జ్యూడీషియల్ కష్టడీ విధించాం. మళ్లీ వారిని జూన్ 11న కోర్టు ముందు హాజరు పరుస్తారు’’ అని డ్యూటీ మెజిస్ట్రేట్ కపిల్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు.


కలిత, నర్వాల్‌‌లను మార్చి 23న అరెస్ట్ చేశారు. జఫరాబాద్ సిట్-ఇన్ నిరసనలో వారి పాత్ర ఉందని ఆరోపణలు రావడంతో ఢిల్లీ పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. కాగా, మరుసటి రోజే బెయిల్ పొందారు. వారు బయటికి వచ్చిన నిమిషాల్లోనే వీరిద్దరిపై హత్యాయత్నం, అల్లర్లు, నేరపూరిత కుట్ర ఆరోపణలు వచ్చాయి. దీంతో వారిని మళ్లీ అరెస్టు చేశారు.

Updated Date - 2020-05-29T23:05:23+05:30 IST