నైజీరియా నుంచి హైదరాబాద్‌కు చదువు కోసం వచ్చి.. ఇక్కడేం చేస్తున్నారో చూడండి..!

ABN , First Publish Date - 2022-06-03T16:39:37+05:30 IST

చదువుకోవడానికి నగరానికి వచ్చి డ్రగ్స్‌ విక్రయిస్తున్న ఇద్దరు నైజీరియా విద్యార్థులను పోలీసులు అరెస్ట్‌ చేశారు..

నైజీరియా నుంచి హైదరాబాద్‌కు చదువు కోసం వచ్చి.. ఇక్కడేం చేస్తున్నారో చూడండి..!

  • డ్రగ్స్‌ విక్రయం
  • ఇద్దరు విద్యార్థుల అరెస్టు 
  •  4.5 గ్రాముల కొకైన్‌, 10 ఎండీఎంఏ మాత్రలు స్వాధీనం

హైదరాబాద్ సిటీ/రాజేంద్రనగర్‌ : చదువుకోవడానికి నగరానికి వచ్చి డ్రగ్స్‌ (Drugs) విక్రయిస్తున్న ఇద్దరు నైజీరియా విద్యార్థులను పోలీసులు (Police) అరెస్ట్‌ చేశారు. శంషాబాద్‌ డీసీపీ ఆర్‌. జగదీశ్వర్‌రెడ్డి గురువారం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. నైజీరియాకు చెందిన ఓజిగ్‌బోటోచుకు గుడ్‌లక్‌(25), ఓబివులు చిమాడార్టింగ్‌టన్‌(27) స్టూడెంట్‌ వీసాపై భారత్‌కు వచ్చి కొంతకాలం ఢిల్లీలో ఉన్నారు. అనంతరం నగరానికి వచ్చి నానల్‌నగర్‌లో ఉంటున్నారు. వీరు డ్రగ్స్‌ విక్రయిస్తున్నారని, ఢిల్లీలో ఉంటున్న నైజిరియా ప్రాంతానికి చెందిన ఎబుకా అలియాస్‌ ఇమాన్యుయేల్‌ అలియాస్‌ లెవల్‌ నుంచి వారికి అందాయని పోలీసులకు సమాచారం అందింది.  


గురువారం ఉదయం నిఘా పెట్టిన మాదాపూర్‌ ఎస్‌ఓటీ, రాజేంద్రనగర్‌ పోలీసులు రాజేంద్రనగర్‌ పరమరెడ్డి హిల్స్‌ వద్ద నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 4.5 గ్రాముల కొకైన్‌, 10 మిథాయిలిన్‌ డయాక్సీ మెథామ్‌ ఫెటమైన్‌(ఎండీఎంఏ)ఎక్స్‌టాక్సీ మాత్రలు, ద్విచక్రవాహనం, ల్యాప్‌టాప్‌, పాస్‌పోర్టు, నాలుగు సెల్‌ఫోన్లు, రూ. 20.600 స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ. 2.20 లక్షలు ఉంటుందన్నారు. విచారించగా.. గ్రాము డ్రగ్స్‌ రూ. 12 వేల నుంచి రూ. 15 వేలకు విక్రయిస్తున్నట్లు అంగీకరించారు. ఎబుకా అలియాస్‌ ఇమాన్యుయేల్‌ పరారీలో ఉన్నాడు. నిందితులను రిమాండ్‌కు తరలించారు. విలేకరుల సమావేశంలో రాజేంద్రనగర్‌ ఏసీపీ బి.గంగాధర్‌, మాదాపూర్‌ ఎస్‌ఓటీ ఇన్‌స్పెక్టర్‌ శివ, రాజేంద్రనగర్‌, అత్తాపూర్‌ ఇన్‌స్పెక్టర్‌లు కె.కనకయ్య, కె. క్రాంతికుమార్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-06-03T16:39:37+05:30 IST