మరో 2 రోజులు వర్షాలు

ABN , First Publish Date - 2022-07-10T09:23:12+05:30 IST

రుసగా రెండోరోజూ రాష్ట్రాన్ని వర్షం ముంచెత్తింది. కొన్నిచోట్ల ఎడతెరిపి లేకుండా వానపడింది.

మరో 2 రోజులు వర్షాలు

  • 8 జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌
  • హైదరాబాద్‌ వాతావరణశాఖ డైరెక్టర్‌ నాగరత్న

హైదరాబాద్‌, జూలై 9 (ఆంధ్రజ్యోతి): వరుసగా రెండోరోజూ రాష్ట్రాన్ని వర్షం ముంచెత్తింది. కొన్నిచోట్ల ఎడతెరిపి లేకుండా వానపడింది. శుక్రవారం దక్షిణ తెలంగాణలో భారీవర్షాలు పడగా.. శనివారం ఉత్తర తెలంగాణలోనూ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి. రాష్ట్రంలో మరో రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణశాఖ డైరెక్టర్‌ కె.నాగరత్న తెలిపారు. అల్పపీడన ద్రోణి కారణంగా రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నందున 8 జిల్లాలకు రెడ్‌ అలెర్ట్‌ ప్రకటించినట్లు ఆమె పేర్కొన్నారు. జయశంకర్‌ భూపాలపల్లి, పెద్దపల్లి, ములుగు, నిర్మల్‌, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, మంచిర్యాల జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌ ఇచ్చామని వెల్లడించారు. ఈ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడతాయని పేర్కొన్నారు. మిగిలిన జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌ ఇచ్చామని ఆమె తెలిపారు. ఇక శనివారం రాష్ట్రవ్యాప్తంగా సగటున 40.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. అత్యధికంగా నిజామాబాద్‌ జిల్లా నవీపేట్‌లో 206 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు పేర్కొంది.


12 లేదా 13న మరో అల్పపీడనం

ఈ నెల 12 లేదా 13న వాయువ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీనికితోడు తూర్పు, పడమర ద్రోణి మరికొన్ని రోజులు దక్షిణ ఒడిశా, ఉత్తర కోస్తా మధ్యే కొనసాగే అవకాశం ఉందని పేర్కొంది. వీటి ప్రభావంతో మధ్య, పశ్చిమ భారతం, ఏపీ, తెలంగాణల్లో అనేకచోట్ల విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. 

Updated Date - 2022-07-10T09:23:12+05:30 IST