పుత్రశోకం.. ఎవరిదీ ఘాతుకం..

ABN , First Publish Date - 2021-06-19T18:07:22+05:30 IST

ఆ దంపతుల 12 ఏళ్ల నిరీక్షణ ఈ బాబు. సంతానం కోసం ఎక్కని మెట్టు లేదు.. మొక్కని దేవుడు లేడు. కలవని డాక్టర్‌ లేరు.. వాడని మందులు లేవు....

పుత్రశోకం.. ఎవరిదీ ఘాతుకం..

  • 2 నెలల బాలుడి హత్య
  • నీటి సంపులో పడేసిన దుండగులు
  • 12 ఏళ్ల అనంతరం ఆ దంపతులకు కలిగిన సంతానం
  • కుటుంబ సభ్యులపైనే పోలీసుల అనుమానం 

హైదరాబాద్ సిటీ/అబ్దుల్లాపూర్‌మెట్‌ : ఆ దంపతుల 12 ఏళ్ల నిరీక్షణ ఈ బాబు. సంతానం కోసం ఎక్కని మెట్టు లేదు.. మొక్కని దేవుడు లేడు. కలవని డాక్టర్‌ లేరు.. వాడని మందులు లేవు. అన్ని ప్రయత్నాలూ ఫలించి 12 ఏళ్ల అనంతరం వారికి బాబు పుట్టాడు. దీంతో ఆ దంపతుల ఆనందానికి హద్దుల్లేవు. అల్లారుముద్దుగా చూసుకుంటున్నారు. కంటికి రెప్పలా కనిపెట్టుకుంటున్నారు. కానీ, ఎవరి కన్నుకుట్టిందో  ఏమో..12 ఏళ్ల తర్వాత పుట్టిన ఆ బాబు 2 నెలలకే తల్లిదండ్రులకు దూరమయ్యాడు.  తల్లి పక్కనే నిద్రించిన బిడ్డ తెల్లారేసరికి నీటి ట్యాంకులో శవమై తేలాడు. ఈ హృదయ విదారక ఘటన అబ్దుల్లాపూర్‌మెట్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది.


పోలీసుల కథనం ప్రకారం.. అనాజ్‌పూర్‌ గ్రామానికి చెందిన మంచాల లత (బాలమ్మ), ఇబ్రహీంపట్నం మండలం నెర్రపెల్లి గ్రామానికి చెందిన దూసరి తిరుమలేష్‌ దంపతులు 12 ఏళ్లుగా సంతానం కోసం ఎదురుచూశారు. రెండు నెలల క్రితం లత బాబుకు జన్మనిచ్చింది. దీంతో ఆ కుటుంబంలో ఎనలేని సంతోషం కలిగింది. బాబుకు ఉమామహేశ్వర్‌గా నామకరణం చేశారు. గురువారం రాత్రి భోజనం చేసిన తర్వాత బాబును నిద్రపుచ్చి భార్యాభర్తలు కూడా నిద్రపోయారు. శుక్రవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో లత నిద్రలేచి చూడగా పక్కన బాబు కనిపించలేదు. కుటుంబంలో ఎవరైనా ఎత్తుకుని ఆడిస్తున్నారేమోనని ఇల్లంతా గాలించింది. అందరూ నిద్రలోనే ఉండడంతో తీవ్ర ఆందోళనకు గురై రోధించింది. దీంతో కుటుంబ సభ్యులంతా లేచి బాబు కోసం వెదికారు. చుట్టు పక్కల వారిని విచారించారు. బాబు జాడ తెలియలేదు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు స్థానికంగా ఉన్న సీసీ ఫుటేజీలను పరిశీలించినా బాబు జాడ చిక్కలేదు. కుటుంబ సభ్యులు ఇంటిపై ఉన్న వాటర్‌ ట్యాంక్‌ మూత తీసి చూడగా అందులో బాబు శవమై తేలాడు. లేకలేక కలిగిన బిడ్డ కళ్లముందు శవమై కనబడడంతో ఆ తల్లితండ్రులు గుండెలు అవిసేలా విలపించారు.


పోలీసుల అదుపులో కుటుంబ సభ్యులు

ఇంట్లోకి పరాయివ్యక్తులు వచ్చి ఈ ఘాతుకానికి పాల్పడే అవకాశం లేకపోవడంతో పోలీసులు చనిపోయిన బాబు తల్లిదండ్రుల కుటుంబ సభ్యులపైనే అనుమానం వ్యక్తం చేస్తున్నట్లు తెలిసింది. ఇంకా ఆ ఇంట్లో మంచాల రంగయ్యగౌడ్‌, ఆయన భార్య పద్మ, కుమారుడు బాల్‌రాజ్‌, ఆయన భార్య శ్వేత ఉంటున్నారు. వీరంతా బంధువులే. బాలరాజ్‌కు వివాహమై రెండేళ్లయినా ఆయనకు కూడా సంతానం కలగలేదని స్థానికులు తెలిపారు. పోలీసులు కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. వనస్థలిపు రం ఏసీపీ పురుషోత్తంరెడ్డి, ఇన్‌స్పెక్టర్‌ స్వామి ఘటన స్థలానికి చేరుకు ని హత్యకు గల వివరాలను సేకరించారు. బాబు తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.


రైతుబజార్‌ వద్ద పసికందు మృతదేహం..

అప్పుడే పుట్టిన పసికందు మృతదేహం కొత్తపేట్‌ రైతుబజార్‌ ఎదురుగా కనిపించింది. స్థానికుల ఫిర్యాదు మేరకు చైతన్యపురి పోలీసులు మృతదేహాన్ని అక్కడి నుంచి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. శిశువు మృతదేహాన్ని చూసి స్థానికులు కన్నీటి పర్యంతమయ్యారు.

Updated Date - 2021-06-19T18:07:22+05:30 IST